టీడీపీలో జనం గోల | People, who want more | Sakshi
Sakshi News home page

టీడీపీలో జనం గోల

Published Thu, Dec 26 2013 4:46 AM | Last Updated on Sat, Sep 2 2017 1:57 AM

టీడీపీలో జనం గోల

టీడీపీలో జనం గోల

=తెలుగుదేశం పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులకు ప్రత్యేక టార్గెట్
 =వీడియో చిత్రీకరిస్తామని హెచ్చరికలు
 =అవమానిస్తున్నారంటూ తమ్ముళ్ల ఆవేదన

 
సాక్షి, తిరుపతి: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తిరుపతిలో ఈనెల 29వ తేదీన చేపట్టనున్న ఎన్నికల శంఖారావం  సభ జిల్లాలోని నేతలకు తలనొప్పిగా మారింది. సభకు తప్పనిసరిగా జనసమీకరణ  చేపట్టాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని అధిష్టానం నుంచి ఆదేశాలు రావడం, జిల్లా  నాయకులను ఆవేదనకు గురి చేస్తోంది. జన సమీకరణ కోసం ఆ పార్టీ ఎమ్మెల్యే ముద్దు కృష్ణమనాయుడు జిల్లావ్యాప్తంగా పర్యటిస్తూ, నాయకులకు టార్గెట్‌లు ఇస్తున్నారు.

రాష్ట్ర, జిల్లా నాయకులు టార్గెట్ తగ్గకుండా జనాన్ని తీసుకు రావాలని, ఆవిధంగా తీసుకు రాని వారిపై చర్యలు తీవ్రంగా ఉంటాయని  హెచ్చరికలు జారీ చేస్తున్నారు.  జిల్లా స్థాయి నాయకుడు 500 మందికి తక్కువ కాకుండా తీసుకుని రావాలని, రాష్ట్ర నాయకులు వెయ్యి నుంచి రెండువేల మందిని తీసుకుని రావాలని ఆదేశాలు జారీ చేశారు. తిరుపతి నుంచి, నగర ఇన్‌చార్జి చదలవాడ కృష్ణమూర్తికి కూడా 30 వేల మందిని సేకరించాలని సూచించినట్లు తెలిసింది. ఎంత మంది జనాలను సమీకరించారనేవిషయంపై వీడియో చిత్రీకరణ  ఉంటుందని, తక్కువ మందిని తీసుకుని వస్తే తీవ్రంగా పరిణామాలు ఉంటాయని జిల్లా నాయకులకు హెచ్చరికలు కూడా జారీ చేసినట్లు తెలిసింది.

బుధవారం తెలుగుదేశం బూత్ లెవెల్ కమిటీ సమావేశం జరగ్గా, ఈ సమావేశంలో ముద్దుకృష్ణమ నాయుడు, చదలవాడ కృష్ణమూర్తి పాల్గొని, జన సమీకరణపై సూచనలు ఇచ్చారు. సమీకరణ చేయని వారిపట్ల పార్టీ కఠినంగా వ్యవహరిస్తుందని చెప్పడంతో, తెలుగు తమ్ముళ్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పది సంవత్సరాలుగా అధికారంలో లేక పోయినా, పార్టీ కోసం డబ్బు ఖర్చు చేస్తూ, కష్టపడి పని చేస్తున్నా, తమపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, అవమానిస్తున్నారని నాయకులు బాధపడుతున్నారు. తమపై నమ్మకం లే క వీడియో చిత్రీకరణ చేయడం సబబు కాదని, పార్టీకి చెందిన జిల్లా నాయకుడు ఒకరు తెలిపారు.

జన సమీకరణ చేయకపోతే, తమ పదవులు తీసేస్తామని ముద్దుకృష్ణమ నాయుడు హెచ్చరికలు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో పార్టీలో ఎలా కొనసాగాలని కూడా ప్రశ్నిస్తున్నారు. ముద్దుకృష్ణమ నాయుడు 2004లో పార్టీ అధికారం కోల్పోగానే, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిపోయారని గుర్తు చేశారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ ఆయనకు సీటు ఇవ్వక పోవడంతో, మళ్లీ తెలుగుదేశంలోకి వచ్చారని ఆరోపించారు. పార్టీ అధికారంలో ఉన్నా, లేక పోయినా, పార్టీ కోసం కష్టపడుతున్న తమపై ఆయన పెత్తనం చెలాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా, ఎన్నికల శంఖారావం జరుగనున్న మున్సిపల్ హైస్కూలు మైదానంలో 30 వేల మందికి మించి పట్టరు. అయితే లక్ష మంది సభకు రానున్నారని తెలుగుదేశం నాయకులు పేర్కొంటున్నారు. చంద్రబాబు నాయుడు 29వ తేదీన ఉదయం తిరుపతికి చేరుకుని, నేరుగా తిరుమలకు వెళ్లి, సాయంత్రం మూడు గంటలపైన తిరుపతికి వస్తారని, ఎన్నికల శంఖారావం ప్రారంభిస్తారని తెలిసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement