‘వైఎస్ జగన్ సీఎం అయితేనే పోలవరం పూర్తి’
గుంటూరు : వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలు సందర్భంగా పశ్చిమ గోదావరి, విజయనగరం జిల్లాల అధ్యక్షుడు పలు కీలక అంశాలపై తీర్మానాలు చేశారు. ఇందులో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని మాట్లాడుతూ.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి అవుతుందని అన్నారు.
కమీషన్ల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతకైనా దిగజారుతారన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నత్తనడకన సాగుతోందని విమర్శించారు. ఈ సందర్భంగా ఆళ్ల నాని జిల్లాకు సంబంధించిన తీర్మానాలను ప్రవేశపెట్టారు. రూ.16 వేల కోట్ల అంచనాలతో ఉన్న పోలవరం ప్రాజెక్టును రూ.40 వేల కోట్లకు పెంచి కమీషన్లు దండుకుంటున్నారని మండిపడ్డారు
పోలవరం ప్రాజెక్ట్ అంచనాలను 16వేల కోట్ల నుంచి రూ.40వేల కోట్లకు పెంచారన్నారు. కొల్లేరు వాసుల సమస్యలను చంద్రబాబు ఇప్పటివరకూ పరిష్కరించలేదని, కాంటురు పరిధిని 5వ కాంటురు నుంచి 3వ కాంటురు తగ్గించాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల కోసం ముఖ్యమంత్రి ఒక‍్క అడుగు కూడా వేయలేదన్నారు. పోలీసులను అడ్డుపెట్టి ఆక్వా ఫ్యాక్టరీల నిర్మాణాలకు చంద్రబాబు కొమ్ముకాస్తున్నారని ఆళ్ల నాని ధ్వజమెత్తారు. తుందుర్రులో ఆక్వా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వెంటనే ఆపాలని ఆయన డిమాండ్ చేశారు.
విజయనగరంలో గిరిజన వర్శిటీ పెట్టాలి
అన్ని జిల్లాలతో పోలిస్తే విజయనగరం జిల్లా వైద్య, విద్యారంగంలో వెనకబడి ఉందని వైఎస్‌ఆర్ సీపీ జిల్లా అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఈ సందర్భంగా జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై తీర్మానాలు ప్రవేశపెట్టారు. తోటపల్లి ప్రధాన కాల్పవ పెండింగ్ పనులు పూర్తి చేయాలని, గిరిజన వర్శిటీని ఏర్పాటు చేస్తామని ప్రకటించినా ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదన్నారు.
అలాగే ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడేళ్లలో ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని చంద్రశేఖర్ ధ్వజమెత్తారు. మూతపడిన పరిశ్రమలను తెరిపించాలని చంద్రశేఖర్ తీర్మానం ప్రవేశపెట్టారు.