కొత్త లోగోతో ఎస్‌బీఐ
నేటి నుంచి అనుబంధ బ్యాంకుల విలీనం
ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐలో అనుబంధ బ్యాంకుల విలీన ప్రక్రియ నేడు (ఏప్రిల్ 1) ప్రారంభం కానుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ సహా స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్ తదితర అయిదు అనుబంధ బ్యాంకుల విలీనం మూడు నెలల్లో పూర్తి కాగలదని అంచనా. ఆర్‌బీఐ ఆదేశాల ప్రకారం ఏప్రిల్ 1 నుంచి ఇవి ఎస్‌బీఐ శాఖలుగా పనిచేయనున్నాయి. విలీనంలో భాగంగా అనుబంధ బ్యాంకులు ప్రకటించిన విఆర్‌ఎస్ పథకానికి దాదాపు 6వేల మంది ఉద్యోగులు అంగీకరించే అవకాశం ఉన్నట్లు ఎస్‌బీఐ ఎండీ దినేశ్ కుమార్ ఖరా తెలిపారు. మరోవైపు, అనుబంధ బ్యాంకుల విలీనంతో ఎస్‌బీఐ కొత్త లోగోతో దర్శనమివ్వనుంది.
పాతదానికి స్వల్ప మార్పులు చేసి బ్యాక్ గ్రౌండ్ కలర్‌ను దట్టమైన నీలి రంగులోకి మార్చడం ద్వారా కొత్త లోగోను రూపొందించడం జరిగింది. గతంలో బ్యాక్‌గ్రౌండ్ తెల్లరంగులో ఉండేది. కొత్తగా ట్యాగ్‌లైన్ ఫాంట్‌ను కూడా మార్చారు. బ్యాంకు కొత్త లోగోను డిజైన్ స్టాక్ అనే కంపెనీ రూపొందించింది. దిగ్గజ బ్యాంకుగా మారనున్న ఎస్‌బిఐ సామర్ధ్యాన్ని దృష్టిలో ఉంచుకొని దీని డిజైనింగ్ జరిగింది. అనుబంధ బ్యాంకుల విలీనంతో రూ. 42 లక్షల కోట్ల డిపాజిట్లు, 2.77 లక్షల మంది ఉద్యోగులు, 24,000 పైచిలుకు శాఖలతో ఎస్‌బీఐ ప్రపంచంలోని టాప్ 50 బ్యాంకుల జాబితాలోకి చేరనుంది.