కేవిన్‌ జోసెఫ్‌ కేసులో సంచలన తీర్పు | Sakshi
Sakshi News home page

కేవిన్‌ జోసెఫ్‌ కేసులో సంచలన తీర్పు

Published Thu, Aug 22 2019 2:58 PM

Court rules Kevin Joseph Death was honour killing - Sakshi

కొట్టాయం: కేరళలో దుమారం రేపిన దళిత క్రిస్టియన్‌ కేవిన్‌ పీ జోసెఫ్‌ (24) హత్య కేసులో స్థానిక కొట్టాయం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.  ఇది ‘పరువు హత్య’అని తేల్చిచెప్పిన కోర్టు ఈ కేసులో 10మందిని దోషులుగా నిర్ధారించింది. దోషులలో కేవిన్‌ భార్య సోదరుడు కూడా ఉన్నాడు. వీరికి శనివారం శిక్షలు ఖరారు చేయనున్నారు.

2018 మే 24న కేవిన్‌ నీను చాకో (20)ను కొట్టాయంలో పెళ్లాడారు. అయితే, కేవిన్‌  దళితుడు కావడంతో ఈ పెళ్లిని నీను కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది. పెళ్లయిన రెండురోజులకే ఓ గ్యాంగ్‌ కేవిన్‌ను, అతని స్నేహితుడు అనీష్‌ను ఎత్తుకెళ్లారు. నీను కుటుంబం, ముఖ్యంగా నీను సోదరుడు స్యాను చాకో ఈ కిడ్నాప్‌ వెనుక ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి. అనీష్‌ను ఆ గ్యాంగ్‌ విడిచిపెట్టినప్పటికీ.. ఆ మరునాడు కేవిన్‌ మృతదేహం కొల్లాం జిల్లాలోని థెన్‌మలా వద్ద కాలువలో దొరికింది.  కేవిన్‌ బలవంతంగా నీళ్లలో ముంచి చంపినట్టు పోస్టుమార్టం​ నివేదికలో వెల్లడైంది. కేవిన్‌ కిడ్నాప్‌పై నీను, కేవిన్‌ కుటుంబం పదేపదే పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదని విచారణలో వెలుగుచూసింది. 

స్యాను చాకోతోపాటు మరో పదిమందిని మర్డర్‌ (302), కిడ్నాపింగ్‌ (364ఏ), క్రిమినల్‌ కుట్ర (120 బీ) తదితర సెక్షన్ల కింద న్యాయస్థానం దోషులుగా నిర్ధారించింది. అదే సమయంలో నీనూ తండ్రిని, మరో ముగ్గురు నిందితులను ఆధారాలు లేవని కోర్టు విడిచిపెట్టింది.


 

Advertisement
 
Advertisement
 
Advertisement