ఇది దుర్యోధన.. దుశ్శాసన రాజ్యం | MLC PAYYAVULA Keshav followers attacks on a women | Sakshi
Sakshi News home page

ఇది దుర్యోధన.. దుశ్శాసన రాజ్యం

Published Fri, Feb 3 2017 1:42 AM | Last Updated on Fri, Aug 10 2018 9:46 PM

ఇది దుర్యోధన.. దుశ్శాసన రాజ్యం - Sakshi

ఇది దుర్యోధన.. దుశ్శాసన రాజ్యం

ప్రశ్నిస్తే చితకబాదుడే..
తాలిబన్ల పాలనను మరిపిస్తున్న బాబు సర్కారు


కూడేరు (ఉరవకొండ)/ సాక్షి, అమరావతి : అసలే కంటి చూపు సరిగా లేని మహిళ.. పుట్టెడు కష్టాలతో ఒంటరిగా జీవిస్తోంది.. తన ఇంటి ఎదురుగా నీటి తొట్టె నిర్మాణం వద్దని చెప్పడమే పాపమైపోయింది.. ఆ మాత్రం దానికే ఊగిపోతూ.. కింద పడేసి, చెప్పు కాళ్లతో ఎగిరి తంతుంటే విడిపించడానికి ఎవరూ సాహసించలేదు. జుట్టు పట్టి ఈడుస్తుంటే సినిమా చూస్తున్నట్టు చూశారే తప్పించి వారి గూండాగిరీని ఎవరూ ఎదిరించలేక పోయారు. ‘కాపాడండయ్యా.. నేనేం తప్పు చేశాను.. ఏమిటీ అన్యాయం’ అని ఆ మహిళ నిస్సహాయంగా   విలపించడం అరణ్య రోదనే అయ్యింది.

‘మరో 50 ఏళ్లు ఈ రాష్ట్రంలో మనమే అధికారంలో ఉండాలి.. ఎప్పుడూ మనమే అధికారంలో ఉంటేనే బావుంటుంది.. అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చు.. ఈ దిశగా ప్రతి టీడీపీ నేత, కార్యకర్త కృషి చేయాలి.. అధికారులు కూడా మన మాటే వింటారు.. అలా ఎవరైనా వినకపోతే నే చూసుకుంటా’ అని సాక్షాత్తు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొద్ది రోజుల క్రితం పదే పదే నొక్కి చెప్పడంతో రాష్ట్రం రావణకాష్టంగా మారుతోంది. ప్రశ్నించిన వారి నోరు నొక్కేస్తూ.. కాదు కూడదన్న వారిపై బహిరంగ దాడులకు తెగిస్తూ తాలిబన్ల పాలనను తలపిస్తున్నారు. ఇసుక మొదలు భూముల వరకు వారి కన్ను పడిందంటే చాలు వశమయ్యేందుకు ఎంతకైనా బరితెగిస్తున్నారు. మొన్న అధికారిణి వనజాక్షిపై దాడి.. నిన్న జీతం పెంచండన్న అంగన్‌వాడీలపై జులుం.. నేడు ఉరవకొండ నియోజకవర్గంలో అరాచకం..

అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజక వర్గం కూడేరు మండలంలో టీడీపీ నేత, ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ వర్గీయులు ఓ మహిళపై దాడి చేసిన తీరు కలకలం రేపింది. ఒంటరి మహిళను నడిరోడ్డుపై చెప్పుకాళ్లతో ఎగిరెగిరి తంతుంటే నిస్సహాయతతో విలవిల్లాడిపోయింది. జాతీయ రహదారి పక్కన, మిట్ట మధ్యాహ్నం.. అందరూ చూస్తుండగానే ‘మేం చెప్పినా వినవా.. లం.. ముం...’ అంటూ పత్రికల్లో రాయలేని పదజాలంతో దూషిస్తూ దాడి చేసిన దృశ్యాలు బుధవారం టీవీ చానళ్లలో వీక్షించిన వారు ‘అయ్యో.. ఏమిటీ దారుణం.. ఎంత అధికారంలో ఉంటే మాత్రం మరీ ఇంత బరి తెగింపా.. అడ్డుకునే వారే కరువయ్యారే.. ఈ అరాచకానికి అడ్డుపడేదెప్పుడు’ అంటూ తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఇంత జరిగితే.. ‘అయ్యా.. న్యాయం చేయండ’ని బాధితురాలు పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కితే నిందితులను పిలిపించి బెయిల్‌ ఇచ్చి పంపించే శారు. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

అసలేం జరిగిందంటే..
కూడేరు మండలం జల్లిపల్లికి చెందిన సుధమ్మకు కంటి చూపు సరిగా లేదు. నాలుగేళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. సంతానం లేదు. తల్లి ద్రాక్షాయణమ్మ నాలుగు నెలల క్రితం మృతి చెందింది. సోదరుడు రాంభూపాల్‌రెడ్డికి మానసిక స్థితి సరిగా లేదు. తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఆదివారం అనంతపురం–బళ్లారి ప్రధాన రహదారి పక్కన పంచాయతీ తరఫున పశువులకు తాగునీటి తొట్టె నిర్మించేందుకు తెలుగుదేశం పార్టీ నేత, సర్పంచ్‌ నాగరాజు, జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర సిద్ధమయ్యారు. తన ఇంటి ముందు కాకుండా కొంచెం పక్కన తొట్టె నిర్మించుకోవాలని సుధమ్మ కోరింది. అంతే.. మాకే అడ్డు చెబుతావా.. అంటూ ఆగ్రహించిన వారిద్దరూ ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. మహిళ అని కూడా చూడకుండా అందరి ముందు దుర్భాషలాడారు. తలోచేయి పట్టుకుని కింద పడేశారు. అంతటితో ఆగకుండా ఇష్టం వచ్చినట్టు కొట్టారు. సర్పంచ్‌ నాగరాజు చెప్పుకాళ్లతో ఎగిరి తన్నగా.. చంద్ర చేతితో కొట్టాడు.

అధికారానికి ‘ఖాకీ’ దాసోహం
ఓ మహిళపై ఇంతగా దౌర్జన్యం చేసి దాడికి పాల్పడితే బాధితుల పక్షాన ఉండాల్సిన పోలీసులు అధికార పార్టీ నేతలకు వత్తాసు పలికారు. దాడి జరిగిన రోజు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లేందుకు భయపడిన సుధమ్మ.. ఆ మరుసటి రోజు కూడేరు పోలీసులను ఆశ్రయించింది. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేసింది. నిందితులపై సెక్షన్‌ 323, 354, 355 కింద నామమాత్రంగా కేసు నమోదు చేసి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి పంపించేశారు. బాధితురాలు ఫిర్యాదు చేసిన కాసేపటికే పోలీస్‌స్టేషన్‌ నుంచి గ్రామానికి చేరుకుని వారు మీసం మెలేశారు. కనీసం గ్రామంలో పరిస్థితి ఎలా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం పోలీసులు చేయలేదు. కౌన్సెలింగ్‌ నిర్వహించిన దాఖలాలూ లేవు. ‘ఏ నిమిషంలో ఏం జరుగుతుందో భయంగా ఉంది. వారిద్దరి నుంచి నాకు ప్రాణహాని ఉంది. ఉన్నతాధికారులు నాకు రక్షణ కల్పించాలి. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేద’ని బాధితురాలు సుధమ్మ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇదిలా ఉండగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. వాట్సప్‌లో దాడి దృశ్యాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. ఈ ఘటనపై జల్లిపల్లికి చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారం అండతో జన్మభూమి కమిటీ సభ్యుడు చంద్ర ఆగడాలకు అడ్డే లేకుండా పోతోందని, ప్రతి చిన్న విషయానికి గొడవలకు దిగుతుంటాడని తెలిపారు. తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతుంటే బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తనపై దాడి జరిగినట్లు బాధితురాలు ఫిర్యాదు చేసిందని, కేసు నమోదు చేశామని ఆత్మకూరు సీఐ శివనారాయణస్వామి చెప్పారు. నిందితులపై చట్ట ప్రకారం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

 సీఎం చూసీ చూడనట్టు వ్యవహరించబట్టే..
ఎమ్మార్వో వనజాక్షి వ్యవహారంలో  టీడీపీ ఎమ్మెల్యే దాడి చేసినప్పుడు సీఎం చంద్రబాబే ఆయన్ను కాపాడారు. దీంతో గ్రామ స్థాయిలోనూ అధికార పార్టీ నేతల దౌర్జన్యాలు  ఎక్కువ య్యాయి. సీఎంకు చిత్తశుద్ది ఉంటే జల్లిపల్లిలో మహిళపై దాడి చేసిన   సర్పంచ్‌పై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలి. మానవ హక్కుల సంఘం, జిల్లా జడ్జీలు  సుమోటోగా కేసు నమోదు చేయాలి.
– బీశెట్టి బాబ్జీ, లోక్‌సత్తా  రాష్ట్ర అధ్యక్షుడు

దౌర్జన్యాలు మితిమీరాయి
తెలుగుదేశం పార్టీ నాయకుల దౌర్జన్యాలు ఎక్కువయ్యాయి. పోలీసులు అధికార పార్టీకి కొమ్ము కాస్తున్నారు. మహిళను నడిరోడ్డుపైనే కొట్టారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. బాధితురాలికి రక్షణ కల్పించాలి. నిందితులను కఠినంగా శిక్షించకపోతే ఎస్పీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తాం.
– సుశీలమ్మ, వైఎస్సార్‌సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, అనంతపురం

బెయిలబుల్‌ కేసు ఎలా పెడతారు?
అధికార పార్టీ దౌర్జన్యాలు మితిమీరిపోయాయి. జల్లిపల్లిలో మహిళపై దాడి ఘటనలో నిందితులపై బెయిలబుల్‌ కేసులు ఎలా పెడతారు? నిందితులకు అంత తొందరగా స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అధికార పార్టీ నాయకులకు పోలీసులే భయపడుతున్నారు.పోలీసులపై తిరగబడాల్సిన రోజు రాకుండా చూసుకోవాలి.
– హరినాథరెడ్డి, న్యాయవాది,
ఏపీసీఎల్‌సీ జిల్లా అధ్యక్షుడు, అనంతపురం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement