విత్తన దీక్ష
పోలీసు పహారా మధ్య పంపిణీ.. రాత్రంతా కేంద్రాల వద్దే జాగరణ
ఓచోట చలిమంట వేసుకొని నిద్ర కాస్తున్నారు.. ఇంకోచోట అక్కడే నిద్రపోతున్నారు.. మరోచోట ఇలా బారులు తీరి కనిపిస్తున్నారు.. అవును వీరంతా రైతులు! గింజ దశ నుంచే కష్టాలను కావలించుకొని ‘విత్తన దీక్ష’ చేస్తున్న కష్టజీవులు!! కామారెడ్డి జిల్లాలోని పలు విత్తన విక్రయ కేంద్రాల ముందు ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. సబ్సిడీ శనగ విత్తనాల కోసం రైతులు అష్టకష్టాలు పడుతున్నారు.
సాక్షి, కామారెడ్డి: రబీలో శనగ విత్తనాల కోసం రైతాంగం విక్రయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని చాలా మండలాల్లో విత్తనాల కోసం రాత్రి, పగలు అనే తేడా లేకుండా బారులుదీరుతున్నారు. జుక్కల్ నియోజకవర్గంలో శనగ విత్తనాలకు భారీగా డిమాండ్ ఉంది. శనివారం బిచ్కుంద మండల కేంద్రంలో శనగ విత్తనాల కోసం భారీగా రైతులు తరలిరావడంతో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. జుక్కల్, మద్నూర్ మండలాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. మద్నూర్ మండల కేంద్రంలో విత్తనకేంద్రం వద్దే శుక్రవారంరాత్రి రైతులు పడిగాపులు కాశారు. కొందరు చలి మంట వేసుకొని నిద్ర కాస్తే.. ఇంకొందరు అక్కడే నిద్రించారు.
మహిళారైతులు సైతం విత్తనాల కోసం కేంద్రాల వద్దకు వచ్చారు. బహిరంగ మార్కెట్‌లో శనగ విత్తనాలు క్విం టాలు రూ.13 వేలు ధర పలుకుతోంది. ప్రభుత్వం 39 శాతం రాయితీపై అందిస్తోంది. దీంతో రైతులు ఇలా విత్తన పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాయాల్సి వస్తోంది. ఒక్కో పాస్‌బుక్‌పై రెండు బ్యాగుల విత్తనాలే ఇవ్వడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాలుగు ఎకరాలభూమి ఉందని చెబుతున్నా, రెండు ఎకరాలకే సరిపడా విత్తన బ్యాగులు ఇస్తుండడంతో సగం భూమి అలికి, మిగిలిన సగం విత్తనాల కోసం బహిరంగ మార్కెట్‌ను ఆశ్రయించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ధర ఎక్కువగా ఉండడంతో కొందరు రైతులకు దళారులు ఆశపెట్టి వారి పాస్‌బుక్‌లపై విత్తనాలు తీసుకొని బహిరంగ మార్కెట్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలూ ఉన్నాయి.
తానూరులో పోలీసు బందోబస్తు మధ్య..
తానూరు: నిర్మల్ జిల్లా తానూరు మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం లో శనివారం శనగ విత్తనాల పంపిణీ పోలీసు బందోబస్తు మధ్య జరిగింది. విత్తనాల కోసం రైతులు ఉదయం నుంచే బారులుదీరి గంటల తరబడి నిరీక్షించారు. విత్తనాలు అందక కొందరు నిరాశతో వెనుదిరిగారు. విత్తనాలు అవసరం లేని ఇక్కడి రైతులు కొందరు మహా రాష్ట్రలోని తమ సంబంధీకులకు పట్టా పుస్తకాలు ఇస్తున్నారు. దీంతో వారు ఇక్కడికి వచ్చి సబ్సిడీ విత్తనాలు పొందుతున్నారు. మరి కొం దరు ఇక్కడ సబ్సిడీపై రూ.1,600కు పొం దిన విత్తనాలను మహారాష్ట్ర రైతులకు రూ.2,200కు అమ్ముకుంటున్నారు. దీంతో సరిహద్దులో అధి కారులు, పోలీసులు నిఘా పెట్టారు. శనివారం అక్రమంగా తరలిస్తున్న 22 సబ్సిడీ శనగ విత్తనాల బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు.