బ్రౌన్‌ని అంటారా?....
స్పందన
‘బ్రౌన్ నిఘంటువులో బ్రౌన్ కృషి ఎంత?’ అనే పేరుతో మే 3న సాక్షి సాహిత్యం పేజీలో ఒక వ్యాసం లాంటిది వచ్చింది. ఈ రచనకు కర్తలు పరుచూరి శ్రీనివాస్, వెల్చేరు నారాయణరావు. బ్రౌన్‌కు మనం ఇవ్వవలసిన గౌరవం కంటే ఎక్కువ ఇస్తున్నామనీ బ్రౌన్ పట్ల తెలుగువారికి గల ఆరాధన వెనుక వలసవాద ధోరణి- అంటే బానిస ధోరణి ఉన్నదనీ బ్రౌన్ నిఘంటువులో బ్రౌన్ అవగాహన ఎంతో చెప్పడానికి అవకాశాలు లేవనీ రచయితలు అభిప్రాయపడ్డారు.
బ్రౌన్ గురించి తెలుసుకోవడానికి అచ్చయిన అతని రచనలు అందరికీ అందుబాటులో ఉన్నవే. అయితే తన గురించి తాను చెప్పుకున్న విషయాలు వాస్తవాలేనని గుడ్డిగా నమ్మక్కరలేదు. బ్రౌన్ ఆలోచనా విధానాన్నీ కొంత వరకు ఆయన స్వభావాన్నీ తెలుసుకోవడానికి వేల పేజీలలో ఉన్న అచ్చుకాని ఆయన రాసుకున్న నోట్సు ఒక మంచి ఆధారం. మద్రాసు యూనివర్సిటీలోని ఓరియంటల్ మానుస్క్రిప్ట్ లైబ్రరీలో ఈ నోట్సు సంపుటాలున్నాయి. జి.ఎన్.రెడ్డి పర్యవేక్షకులుగా బంగోరె స్పెషల్ ఆఫీసర్‌గా ఉన్న బ్రౌన్ ప్రాజెక్టు (ఎస్.వి.యు, తిరుపతి) పని చేసిన కాలంలో లండన్ నుంచి వారు తెప్పించిన బ్రౌన్ నిఘంటువుకు సంబంధించిన మరికొంత నోట్సు మైక్రోఫిల్మ్ రూపంలో ఉంది. వీటిలో బ్రౌన్ ధోరణి, స్వభావం, భాష పట్ల దృక్పథం మరింత స్పష్టంగా అర్థం అవుతాయి.
బ్రౌన్ పుట్టింది భారతదేశంలోని కలకత్తాలో. 12 సంవత్సరాల వరకూ అతని బాల్యం కూడా ఇక్కడే గడిచింది. ఆ తర్వాత తల్లిదండ్రులతో కొంతకాలం బ్రిటన్‌కు వెళ్లిపోయాడు. నవయవ్వన దశలోనే బ్రిటిష్ అధికారిగా భారతదేశానికొచ్చాడు. తెలుగుతో బాటు మరికొన్ని భారతీయ భాషలూ నేర్చుకున్నాడు. వేమన పద్యాల సేకరణ, పరిష్కరణ, అచ్చులతో ప్రారంభమైన బ్రౌన్ తెలుగు సాహిత్య కృషి తెలుగు కావ్య పరిష్కరణలతో ఆగక తెలుగు నిఘంటువుల దాకా విస్తృతంగా సాగింది.
బ్రౌన్ స్వభావం గమనించండి.
1. బ్రౌన్ గుంటూరు కలెక్టర్‌గా ఉన్నప్పుడు ఆ ప్రాంతంలో ఏర్పడ్డ దుర్భర పరిస్థితిని వివరిస్తూ బ్రిటిష్ ప్రభుత్వానికి ఒక రిపోర్టు పంపాడు. అందులో ఊఅకఐూఉ (కరువు) అనే మాట ఉపయోగించాడు. అందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఆగ్రహించింది. అయినా బ్రౌన్ తన అభిప్రాయాన్ని మార్చుకోలేదు.
2. పదాలకు అర్థాలు నిర్ణయించడంలో బ్రౌన్ తనకు సహాయకులుగా ఉన్న పండితులపై ఆధారపడటం ఒక కోణం మాత్రమే. పండితుల నుంచి సామాన్యుల దాకా అందరూ తన గురువులే అని స్వీయ చరిత్రలో చెప్పుకున్నాడు. ‘అలవోక’ అనే పదానికి రావిపాటి గురుమూర్తిశాస్త్రి బ్రౌనుకు చెప్పిన అర్థాలు స్వేచ్ఛ, అప్రయత్నము. బ్రౌన్ ఇచ్చిన అర్థాలలో వేడుకగా, విలాసముగా, ఆట్లాటగా, అవలీలగా అనేవి ఉన్నాయి. ఎవరో చెప్పిన విషయాలతోనే తృప్తి పడకుండా తనకు సంతృప్తి దొరికే దాకా పరిశీలించడం బ్రౌనుకు అలవాటు.
3. తెలుగువాడైన బహుజనపల్లి సీతారామచార్యులు తయారు చేసిన ‘శబ్ద రత్నాకరం’ 1885లో అచ్చయింది. కాని బ్రౌన్ నిఘంటువు దానికి చాలాకాలం ముందే 1852లో వచ్చింది. అయినప్పటికీ బ్రౌన్ నిఘంటువులో ఉన్న అనేక పదాలు అర్థాలు ఆ తర్వాతి కాలంలో వచ్చిన శబ్ద రత్నాకరంలో లేవు.
4. ‘మామిడి గుత్తులు’ అనే పదానికి శబ్ద రత్నాకరం ధాన్య విశేషము అని అర్థం చెప్పింది. బ్రౌను ‘వడ్లల్లో భేదము’ అని ఇచ్చాడు.
5. ‘చిక్కుడు’ అనే పదానికి బ్రౌను ఎర్ర, తెల్ల, గోరు, ఆనప, ఏనుగ, కోడి, తొండ, ఉలవ, సొన- అని తొమ్మిది రకాల చిక్కుడు భేదాలను ప్రస్తావించాడు. శబ్దరత్నాకర రచయిత ‘ఒకానొక తీగ’ అని మాత్రమే సరిపెట్టాడు. దీని వల్ల అదొక కూరగాయ అని కూడా తెలియదు.
6. ‘మున్నూరు’ అనే పదానికి శబ్దరత్నాకరంలో ‘మూడు నూఱులు’ అని మాత్రమే ఉంది. బ్రౌను దాంతోబాటు మున్నూటి కులం అని కూడా ఇచ్చాడు.
7. ‘థ’ అనే వర్ణం అనవసరం అన్నాడు బ్రౌన్. చాలాకాలానికి భద్రిరాజు కృష్ణమూర్తి కూడా అదే మాట అన్నారు.
8. శకట రేఫ (ఱ), అరసున్నాలను బ్రౌన్ ఆనాడే తొలగించాడు.
పై విషయాల్ని చూస్తే బ్రౌన్ సామ్రాజ్యవాద స్వభావంతోనే ఈ పని చేశాడని అనిపిస్తుందా? తెలుగు భాషా సాహిత్యాల గురించి ఆయన ఆలోచనలలో కొన్ని తప్పులంటే ఉండొచ్చుగాని ఏదో కడుపులో పెట్టుకున్నట్టుగా మాత్రం లేవు. ‘కవులు భాషను సృష్టిస్తారు. వ్యాకరణవేత్తలు దానిని అనుసరిస్తారు’ అన్నాడు బ్రౌన్. మన వ్యాకరణవేత్తలు చాలామంది కవులకు సంకెళ్లు వేసే పద్ధతినే అనుసరించారు. మనలో వలసవాద భావాలంటే దానికి బ్రౌన్ కారణం కాదు. వ్యాసకర్తలన్నట్టు మనలో సాంస్కృతిక దైన్యం ఉంది. దాన్ని ధిక్కరించి, అధిగమించే స్వభావం కూడా కొంతమందిలోనైనా ఉంది. బ్రౌన్ చవకగా జీతాలిచ్చాడని మరో ఆరోపణ. ఇవాళ మన భూస్వాములూ, పెట్టుబడిదారులూ మన శ్రమజీవుల్ని చేసే దోపిడీ ముందు, దేశాన్ని విదేశాలకు అమ్మే మన పాలక వర్గాల స్వభావం ముందు బ్రౌన్ ఇచ్చిన ‘చవక‘ జీతాల్ని గురించి ప్రశ్నించడం చవకబారు ఆలోచన కాదా?
బ్రౌన్ ఆ రోజుల్లోనే తెలుగు తాళపత్ర ప్రతులు సేకరించడానికి వేల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఒకసారి గుర్రం మీంచి కిందపడి కుడి చేతి బొటనవేలు దెబ్బ తింటే ఎడమ చేత్తో రాయటం అలవాటు చేసుకున్నాడు తప్ప కొన్ని నెలలైనా ఊరికే కూర్చోవడానికి ఇష్టపడలేదు. బ్రౌన్ తెలుగు భాషా సాహిత్యాల కృషిని విమర్శనాత్మకంగా విశ్లేషించుకోవడం అవసరంగాని ఆ విశ్లేషణ ఈ వ్యాసకర్తలు చేసిన పద్ధతిలో మాత్రం కాదు.
- వి. చెంచయ్య 9440638035