బురిడీ బాబా చిక్కాడు | con baba arrested in bangaloore | Sakshi
Sakshi News home page

బురిడీ బాబా చిక్కాడు

Published Fri, Jun 17 2016 2:42 AM | Last Updated on Tue, Oct 16 2018 8:38 PM

బురిడీ బాబా చిక్కాడు - Sakshi

బురిడీ బాబా చిక్కాడు

  • బెంగళూరులో పట్టుకున్న హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు
  • బుడ్డప్పగారి శివ అలియాస్ శివానంద బాబాది ఏళ్లుగా ఇదే దందా
  • స్వస్థలం చిత్తూరు జిల్లాలోని వెండుగంపల్లి
  • ‘లక్ష్మీ పూజల’ పేరుతో గతంలో భారీగా మోసాలు
  • ఇంటర్ చదువు మధ్యలో ఆపేసి వక్రమార్గం
  • భక్తులు మత్తులోకి జారుకునేందుకు
  •  పరమాన్నంలో ఉమ్మెత్త గింజల గుజ్జు
  • ఇలా మోసం చేసి గతంలో రెండుసార్లు అరెస్టు
  •  

     సాక్షి, హైదరాబాద్: డబ్బును రెట్టింపు చేస్తానంటూ హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారి మధుసూదన్‌రెడ్డి ఇంటి నుంచి రూ.1.33 కోట్లు ఎగరేసుకుపోయిన దొంగ బాబా బుడ్డప్పగారి శివ అలియాస్ శివానంద బాబా పోలీసులకు చిక్కాడు. హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం రాత్రి బెంగళూరులో ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం రూ.1.33 కోట్లతో హైదరాబాద్ నుంచి పరారైన శివ బెంగళూరు చేరుకుని నగర శివార్లలోని తన ఇంట్లో తలదాచుకున్నాడు. డబ్బుతో సహా అక్కడ్నుంచి జారుకోవడానికి సన్నాహాలు చేస్తుండగా టాస్క్‌ఫోర్స్ బృందం మెరుపుదాడి చేసి అతడిని అదుపులోకి తీసుకుంది.

    విచారణ అనంతరం శుక్ర లేదా శనివారాల్లో పోలీసులు అతడిని మీడియా ముందు ప్రవేశపెట్టనున్నారు. శివను బెంగళూరు నుంచి హైదరాబాద్ తీసుకువచ్చిన ట్యాక్సీ డ్రైవర్ షాజహాన్ మహబూబ్‌నగర్ జిల్లాలో పోలీసులకు చిక్కడంతో ఈ కేసులో కీలక వివరాలు వెల్లడయ్యాయి. దొంగబాబా శివ గతంలోనూ ఈ తరహా మోసాలకు పాల్పడ్డాడు. 2012లో సైబరాబాద్‌లోని కూకట్‌పల్లిలో, 2014లో తిరుపతిలో అలిపిరి పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఈ ఘరానా మోసగాడు ‘భక్తులకు’ మత్తు కలిగించడం కోసం పరమాన్నంలో ఉమ్మెత్త గింజల గుజ్జు కలుపుతాడని వెల్లడైంది.

    మత్తులోకి దించుతాడిలా...
    భక్తులు పూర్తిగా తన ‘ముగ్గులోకి’ దిగారని నమ్మకం కుదిరిన తర్వాత ‘పెద్ద పూజ’కు రం గం సిద్ధం చేస్తాడు శివ. మత్తు కలిగించడం కోసం ఉమ్మెత్త గింజల్ని గుజ్జుగా చేసి తనతోపాటు గుట్టుగా తీసుకు వస్తాడు. అత్యాశకు పోయే భక్తులు ఈసారి గతంలో పెట్టిన డబ్బుకు ఎన్నో రెట్లు సమీకరించుకుని పూజకు సిద్ధమవుతారు. పూజ చేసేప్పుడు కుటుంబీకు లు తప్ప ఇతరులెవ్వరూ ఉండకూడదని చెబుతాడు. పూజ పూర్తయ్యే సమయంలో ప్రసాదమంటూ పరమాన్నం సిద్ధం చేసే ఈ బురిడీ బాబా అందులో ఉమ్మెత్త గింజల గుజ్జు కలిపేస్తాడు. అది తిన్న వారంతా తీవ్రమైన మత్తులోకి జారుకోవడంతో పూజలో ఉంచిన సొమ్ముతో ఉడాయిస్తాడు. 


    ‘బాబా’వారి లీలలు ఎన్నెన్నో...
    దొంగ బాబా శివ 2012లో కూకట్‌పల్లి పరిధిలో ఇలాగే ‘పూజ’ చేసి పోలీసులకు చిక్కాడు. ఆపై బెంగళూరుకు మకాం మార్చి 2014 జూన్ 6న తిరుపతి అర్బన్ జిల్లాలోని అలిపిరిలో ఇలాగే మోసగించాడు. అక్కడ రియల్టర్ ఆర్కే యాదవ్ కుటుంబాన్ని మోసగించేందుకు యత్నించాడు. పూజలో ఉంచిన రూ.63.43 లక్షలు తీసుకునే లోపే యాదవ్ సంబంధీకుడు దామోదర్ రావడంతో అక్కడ్నుంచి ఉడాయించాడు. మత్తు లో ఉన్న కుటుంబాన్ని చూసిన దామోదర్ ఆ డబ్బును తానే తీసుకొని దొంగతనాన్ని బాబాపైకి నెట్టాడు. అలిపిరి నుంచి నెల్లూరు చేరుకున్న బురిడీ బాబా అక్కడి ఆనంద్‌రెడ్డి ఇం ట్లో పూజ చేసి రూ.40 లక్షలు ఎత్తుకుపోయాడు. యాదవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన అలిపిరి పోలీసులు... శివ హైదరాబాద్‌లో ఉన్నట్లు గుర్తించారు. అమీర్‌పేటలోని ఓ లాడ్జిని అడ్డాగా చేసుకుని నల్లగొండకు చెందిన ఓ బడా బాబును మోసం చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుసుకున్నారు. ఆ లాడ్జిపై దాడి చేసిన పోలీసులు శివను పట్టుకున్నారు. అతడి సమాచారంతో దామోదర్‌ను అరెస్టు చేసి రూ.1.30 కోట్ల నగదు, సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

    మధుసూదన్‌కు ఏడాది నుంచే పరిచయం
    ‘లైఫ్‌స్టైల్’ మధుసూదన్‌రెడ్డితో దాదాపు ఏడాది నుంచి శివకు పరిచయం ఉంది. అనేక రకాల పేర్లు చెప్పి గతంలోనూ పూజలు చేసి ‘రెట్టింపు’ నమ్మకం సంపాదించుకున్నాడు. ఇక ఆయన నుంచి సొమ్ము కొల్లగొట్టడానికి ప్లాన్ వేసిన శివ.. మంగళవారం ఉదయం బెంగళూరు నుంచి షాజహాన్ అనే డ్రైవర్‌కు చెందిన ట్యాక్సీలో బయల్దేరాడు. ఈ ట్యాక్సీని సైతం తన ఇంటి వద్ద ఎక్కకుండా వేరే ప్రాంతంలో ఎక్కాడు. మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుని బంజారాహిల్స్‌లోని ఓహిరీస్ హోటల్‌లో బస చేశాడు. రెండింతల డబ్బు కోసం ఆశపడిన మధుసూదన్‌రెడ్డి తన డబ్బుతోపాటు స్నేహితుల వద్ద నుంచీ తీసుకువచ్చి రూ.1.33 కోట్లు పూజలో పెట్టి మోసపోయారు. 

     ‘దొంగ బాబాలు’ నేర్పిన విద్యయే..
    చిత్తూరు జిల్లా కుప్పం మండలం వెండుగంపల్లికి చెందిన శివ ఇంటర్మీడియట్ మధ్యలోనే ఆపేశాడు. తల్లిదండ్రులతో గొడవ పడి ఇంటి నుంచి బయటకు వచ్చేశాడు. ఇంట్లోంచి వస్తూ కొంత బంగారం, నగదు ఎత్తుకెళ్లాడు. వీటితో తిరుపతి, బెంగళూరు, కేరళలోని అనేక ఆశ్రమాలకు వెళ్లి స్వామీజీలను కలిశాడు. కొద్దిరోజుల పాటు వారితో కలిసి ఉన్న శివకు జనం బలహీనతలు తెలిశాయి. ఈ నేపథ్యంలోనే కొందరు దొంగ స్వాములతో పరిచయాలు పెంచుకొని జనాన్ని ఎలా మోసగించవచ్చో తెలుసుకున్నాడు. అనంతరం దొంగ బాబాగా మారి 2012 నుంచి దందా ప్రారంభించాడు.


    లక్ష్మీ పూజ పేరుతో నమ్మిస్తాడు..
    బురిడీ బాబా శివ భక్తులకు లక్ష్మీ పూజ పేరుతో టోకరా వేస్తా డు. తనను ఆశ్రయించిన వారి ఇంటికి వెళ్లి ముందు పూజలు చేస్తాడు. పూజకు ముందే కొంత డబ్బు తొడ భాగంలో కట్టుకుని, పంచె ధరించి కూర్చుంటాడు. లక్ష్మీ కటాక్షం కోసం కొంత మొత్తాన్ని పూజలో పెట్టాలని, తంతు ముగిసే సమయానికి ఆ మొత్తం రెట్టింపవుతుందని చెప్తాడు. భక్తుల పెట్టిన మొత్తానికి తాను ‘తొడలో’ దాచిన నగదు చాకచక్యంగా కలిపేస్తాడు. రెట్టింపు మొత్తా న్ని భక్తులకు ఇచ్చేస్తాడు. ఆపై మంచి రోజు సమీపిస్తోందని, ఈసారి పూజలో పెట్టిన మొత్తానికి మూడింతలొస్తుందంటూ ఎర వేస్తాడు.

     

     డ్రైవర్ ఎలా దొరికాడంటే ..
    దొంగబాబా కారు డ్రైవర్ షాజహాన్ బుధవారం రాత్రి మహబూబ్‌నగర్ జిల్లా ఇటిక్యాల మండలం ఎర్రవల్లి సమీపంలో పోలీసులకు చిక్కాడు. బాబా మోసం గురించి తెలియగానే.. మహబూబ్‌నగర్ ఎస్పీ రమారాజేశ్వరి బెంగళూరుకు వెళ్లే అన్ని మార్గాల్లో తనిఖీలకు ఆదేశించారు. బుధవారం రాత్రి  ఓ ఇన్నోవా వాహనాన్ని పెబ్బేరు ఎస్సై నిలిపేందుకు యత్నించారు. ఆపకుండా వేగంగా వెళ్లడంతో దాన్ని వెంబడించారు. ఇటిక్యాల ఎస్సైకి సమాచారం ఇవ్వడంతో చివరికి ఎర్రవల్లి చౌరస్తా వద్ద అతడిని పట్టుకున్నారు.

    బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్లేందుకు శివ రూ.16 వేలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు సమాచారం. మధుసూదన్ ఇంటి నుంచి సొమ్మును ఎత్తుకొచ్చిన శివ.. వస్త్ర దుకాణాల్లో కొన్ని బ్యాగులు కొని డబ్బు కట్టలను అందులో ఉంచి తన వాహనం వెనుక సీట్లో కూర్చున్నాడని షాజహాన్ తెలిపినట్లు సమాచారం. కాసేపటికి రెండు బ్యాగులతో కిందకు దిగి కారు పార్కింగ్ చేసి రమ్మన్నాడు. కారు పార్క్ చేసి వచ్చేలోపే బాబా కనిపించలేదని, సెల్‌ఫోన్‌ను సైతం స్విచ్చాఫ్ చేశాడని షాజహాన్ పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. షాజహాన్‌ను బుధవారం రాత్రే హైదరాబాద్ పోలీసులకు అప్పగించారు.

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement