అది భారత్, చైనాకు నష్టమే: అమెరికా
వాషింగ్టన్: భారత్, చైనా దేశాల మధ్య కొనసాగుతోన్న సరిహద్దు వివాదాలపై అమెరికా మరోసారి స్పందించింది. యుద్ధానికి దిగితే ఇరు దేశాలకు నష్టమేనని, నేరుగా చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని అమెరికా రక్షణ విభాగం హెచ్చరించింది. ఈ విషయాన్ని ఆ శాఖ అధికార ప్రతినిధి గ్యారీ రోస్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పొరుగుదేశం చైనా దురాక్రమణలను ఏమాత్రం సహించేది లేదని భారత్ పలుమార్లు సందేశాలు పంపినా ప్రయోజనం లేకపోయింది. చైనా పదేపదే సరిహద్దు విషయాల్లో కయ్యానికి కాలుదువ్వడాన్ని ఆమెరికా సైతం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ఆయన తెలిపారు.
సిక్కింలోని డోక్లామ్ లో చైనా రోడ్డు నిర్మించ తలపెట్టడంతో భారత్ రంగంలోకి దిగి వారి ఆధిపత్యాన్ని అడ్డుకుంటోంది. గత నెల నుంచి చైనాను పలుమార్లు హెచ్చరించినా వెనక్కి తగ్గకపోగా, సరిహద్దు వివాదానికి ఆజ్యం పోస్తుంది. దీంతో ఇరు దేశాల మధ్య ఏ క్షణంలోనైనా యుద్ధం వచ్చే అవకాశాలున్నాయని భావించిన పెంటగాన్ బృందం చైనా ప్రభావాన్ని తగ్గించే యత్నాల్లో బిజీగా ఉందని ఓ టాప్ కమాండర్ చెప్పారు. చైనా తమ సైన్యాన్ని ఆధునికీకరించడంతో పాటు ఆర్థికపరమైన అంశాల్లో సరిహద్దు దేశాలను తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని భావిస్తుందని గ్యారీ రోస్ చెప్పారు.
బీజింగ్‌లో జరగనున్న బ్రిక్స్ సమావేశానికి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ హాజరుకానున్నారు. ఆ పర్యటనలో భాగంగా డోక్లామ్ వివాదంపై చైనా ప్రతినిధులతో దోవల్ చర్చించనున్నట్లు సమాచారం. నేరుగా ఇరుదేశాల ప్రతినిధులు చర్చించి, సామరస్యపూర్వకంగా వివాదాన్ని పరిష్కరించుకోవాలని లేని పక్షంలో ఇరుదేశాలు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికా హెచ్చరించింది.