చనిపోయిన భార్యను భుజాన వేసుకొని..
భువనేశ్వర్: చనిపోయిన తన భార్య మృతదేహాన్ని తరలించేందుకు వాహనం అందుబాటులో లేక ఓ వ్యక్తి భుజాన వేసుకొని ఆస్పత్రి నుంచి 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న తన ఊరుకు తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఘటన ఒడిశాలోని కలహండి జిల్లాలో చోటుచేసుకుంది. ఆ సమయంలో తన వెంట 12 ఏళ్ల కూతురు కూడా ఉంది. వివరాల్లోకి వెళితే మేఘారా అనే గ్రామంలో దనమాజి(42), అమాంగ్ దేయి గిరిజన దంపతులు. గత కొద్ది కాలంగా అమాంగ్ క్షయ వ్యాధితో బాధపడుతోంది. వారికి ఒక కూతురు కూడా ఉంది.
ఇటీవల ఆ వ్యాధి ముదరడంతో చికిత్స కోసం 60 కిలోమీటర్ల దూరంలోని భవానిపాట్నా ప్రభుత్వ ఆస్పత్రికొచ్చారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ప్రాణాలువిడిచింది. అయితే, ఆమె మృతదేహాన్ని తరలించేందుకు ప్రభుత్వ ఆస్పత్రిలో ఏ ఒక్కరూ సహాయం చేయలేదు. వాస్తవానికి ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ 'మహాపారాయణ' అనే పథకం ప్రారంభించారు. దీని ప్రకారం ప్రభుత్వ ఆస్పత్రుల్లో చనిపోయినవారి మృతదేహాలను వారి స్వగ్రామాలకు ప్రభుత్వం తరుపున ఉచితంగా చేర్చడం ఈ పథకం ఉద్దేశం.
కానీ దనమాజీ భార్యను తరలించేందుకు మాత్రం ఆస్పత్రి సహకరించలేదు. దీంతో తన భార్య మృతదేహాన్ని కొన్ని దుస్తుల్లో చుట్టి భుజాన వేసుకొని 60 కిలోమీటర్ల దూరంలోని తన గ్రామానికి కూతురుతో సహా బయలుదేరాడు. అలా పది కిలో మీటర్లు నడిచి వెళ్లాక ఈ విషయం మీడియా ద్వారా తెలుసుకొని మిగితా 50 కిలోమీటర్లకు కలెక్టర్ వాహనం ఏర్పాటుచేశారు. ఘటనపై విచారణ జరిపి ఆస్పత్రి వర్గాలపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.