'దేవుడిపై నమ్మకముంది.. కోర్టుకు వస్తా'
సిర్సా: అత్యాచార ఆరోపణలు ఎదుర్కుంటున్న వివాదస్పద ఆధ్యాత్మిక గురువు, డేరా సచ్చా సౌధ చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ ఎట్టకేలకు గళం విప్పారు. శాంతి, సంయమనం పాటించాలని తన భక్తులకు సూచించారు. రేపు కోర్టుకు హాజరవుతానని ట్విటర్ ద్వారా వెల్లడించారు.
'చట్టం పట్ల నాకు అమితమైన గౌరవముంది. చట్టాలను ఎల్లప్పుడు గౌరవిస్తాను. నడుంనొప్పితో బాధపడుతున్నప్పటికీ రేపు న్యాయస్థానం ఎదుట హాజరవుతాను. దేవుడిపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీరంతా శాంతియుతంగా ఉండాల'ని హిందీలో రహీమ్ సింగ్ ట్వీట్ చేశారు. తన ఆశ్రమంలో ఇద్దరు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. 15 ఏళ్ల నాటి రేప్ కేసులో పంచకుల సీబీఐ కోర్టు రేపు తీర్పు వెలువరించనుంది. ఈ నేపథ్యంలో పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు.
శాంతిభద్రతలు కాపాడేందుకు ఎటువంటి భద్రతా ఏర్పాట్లు చేపట్టారో తెలుపుతూ సవివరమైన నివేదిక సమర్పించాలని పంజాబ్-హర్యానా హైకోర్టు.. హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించింది. జాట్ల ఆందోళన సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించింది. మరోవైపు ముందుజాగ్రత్తగా పంజాబ్, హర్యానా, కేంద్ర పాలిత చండీగఢ్‌లో 72 గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్, డేటా సేవలను నిలిపివేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.