10 లక్షలకు చేరువలో.. | Sakshi
Sakshi News home page

10 లక్షలకు చేరువలో..

Published Fri, Jul 17 2020 2:38 AM

India surges past 1 million cases with record one-day spike - Sakshi

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ గుప్పిట్లో చిక్కుకొని భారత్‌ విలవిలలాడుతోంది. రోజు రోజుకి కేసుల సంఖ్య పెరిగిపోతూ ఉండడంతో శరవేగంగా 10 లక్షలకు చేరువలో నిలిచి భయపెడుతోంది. ఒకే రోజు రికార్డు స్థాయిలో ఏకంగా 32,695 కేసులు నమోదు కావడంతో మొత్తం కేసుల సంఖ్య 9,68,876కి చేరుకుందని గురువారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక 24 గంటల్లో 606 మంది ప్రాణాలు కోల్పోవడంతో మృతుల సంఖ్య 24,915కి చేరుకుంది.

కేసుల ఉధృతి ఎంత పెరుగుతున్నా రికవరీ రేటు 63.25%గా ఉండడం ఊరటనిస్తోంది. ఇప్పటివరకు 6,12,814 మంది వైరస్‌ నుంచి కోలుకుంటే యాక్టివ్‌ కేసులు 3,31,146గా ఉన్నాయి. 130 కోట్ల జనాభా ఉన్న దేశంలో కరోనాని బాగానే కట్టడి చేస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. రికవరీ రేటు 63.25శాతంగా ఉండడం సామాన్యమైన విషయం కాదన్నారు. మృతుల రేటు కూడా ఇతర దేశాలతో పోల్చి చూస్తే చాలా తక్కువగా 2.75%గా ఉందని చెప్పారు.  

వైద్య సిబ్బందిలో భయం భయం  
రోగులకు చికిత్స అందించాల్సిన వైద్యులే కోవిడ్‌ బారిన పడుతూ ఉండడం ప్రమాదఘంటికలు మోగిస్తోంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనాతో 99 మంది వైద్యులు ప్రాణాలు కోల్పోయారు. మరో 1300 మంది వైరస్‌ బారినపడ్డారు. దీంతో ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ రెడ్‌ అలెర్ట్‌ ప్రకటించింది. వైద్య సిబ్బంది మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

క్వారంటైన్‌లోకి సీఎం, డిప్యూటీ సీఎం
కోహిమా: నాగాలాండ్‌ ముఖ్యమంత్రి నీఫియూ రియో, డిప్యూటీ సీఎం వై.పట్టోన్‌తోపాటు నలుగురు మంత్రులు క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. అధికార సమావేశాల నిమిత్తం ఢిల్లీ వెళ్లి వచ్చిన వెంటనే వీరు పరీక్షలు చేయించుకోగా కరోనా నెగెటివ్‌ అని తేలింది. అయిన్పటికీ, ముందు జాగ్రత్తగా క్వారంటైన్‌లో గడపనున్నాననీ, అధికారిక విధులు కొనసాగిస్తానని సీఎం  తెలిపారు.

మార్చి 2021నాటికి 6 కోట్ల మందికి ?
కరోనా కేసుల తీవ్రతపై ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్సెస్‌ (ఐఐఎస్‌సీ) కొన్ని అంచనాలు విడుదల చేసింది. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో కనీసం 37.4 లక్షల కేసులు నమోదవుతాయని, అదే వైరస్‌ అడ్డూ అదుçపూ లేకుండా విస్తరిస్తే 6.18 కోట్ల వరకు కేసులు నమోదయ్యే అవకాశాలున్నాయని తెలిపింది. మార్చి 23 నుంచి జూన్‌ 18 వరకు దేశంలో కరోనా వైరస్‌ విస్తరణ, రెట్టింపు అవడానికి పట్టే రోజులు, వివిధ రాష్ట్రాలకి పాకుతున్న తీరుతెన్నులు వంటివి పరిగణనలోకి తీసుకొని ఈ అంచనాలు వేసింది. సెప్టెంబర్‌ రెండోవారం లేదంటే అక్టోబర్‌ మొదటివారంలో కరోనా కేసులు అత్యధిక స్థాయికి చేరుకుంటాయని ఆ సంస్థ తెలిపింది. వారంలో మూడు రోజులు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ అమలుతో కరోనాని కట్టడి చేయవచ్చునని పేర్కొంది.

కర్ణాటకను దేవుడే రక్షించాలి
–మంత్రి బి.శ్రీరాములు వ్యాఖ్య
కర్ణాటకలో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో ప్రజా సహకారం చాలా ముఖ్యమని, వైరస్‌ వ్యాప్తి నుంచి రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడగలడని ఆరోగ్య శాఖ మంత్రి బి.శ్రీరాములు అన్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం విఫలమైందంటూ ప్రతిపక్ష కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలపై ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం తన మాటలను ఒక వర్గం మీడియా వక్రీకరించిందని శ్రీరాములు విమర్శించారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement