గోప్యత ప్రాథమిక హక్కే: సుప్రీం కోర్టు
- తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ: వ్యక్తిగత గోప్యత ప్రాథమిక హక్కేనంటూ సుప్రీంకోర్టు గురువారం చరిత్రాత్మక తీర్పు చెప్పింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని తొమ్మిది మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గోపత్య ప్రాథమిక హక్కేనంటూ ఏకగ్రీవంగా తీర్పును వెలువరించింది.
వ్యక్తిగత గోప్యత కూడా రాజ్యంగంలోని ఆర్టికల్ 21(జీవించే హక్కు) కిందకు వస్తుందని చెప్పింది. గోప్యతపై తీర్పు వెలువరించిన ధర్మాసనంలో సీజేఐ జేఎస్ ఖేహర్, న్యాయమూర్తులు డీవై చంద్రచూడ్, జే చలమేశ్వర్, రోహింటన్ నారీమన్, ఆర్కే అగర్వాల్, సంజయ్ కిషన్ కౌల్, ఎస్‌ఏ బొబ్డే, ఎస్ అబ్దుల్ నజీర్, ఏఎమ్ సప్రేలు ఉన్నారు. మూడు వారాల్లో ఆరు రోజుల పాటు వాదనలు విన్న ధర్మాసనం ఆగష్టు 2న తీర్పును రిజర్వు చేసిన విషయం తెలిసిందే.
సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల ఎంపికలో ఆధార్ కార్డును తప్పని సరి చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని పలుమార్లు విచారించిన అత్యున్నత న్యాయస్థానం ప్రజా బాహుళ్యంలో గోప్యత వివరాలు దుర్వినియోగమయ్యే అవకాశాలూ ఉన్నాయని ఆగస్టు 2న పేర్కొంది.
తీర్పు ప్రభావం ఏంటి?
ప్రస్తుతం ఆధార్ కార్డు ఆధారంగా ప్రభుత్వ పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నారు. ఆధార్ కార్డు వ్యక్తిగత వివరాలను తెలుపుతుంది కనుక సుప్రీం కోర్టు తీర్పుతో ఇకపై ప్రభుత్వ పథకాలకు ఆధార్ కార్డును జతచేయాలా? లేదా? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ఆధార్ వివరాల ద్వారా వ్యక్తులపై నిఘా పెట్టడం సాంకేతికంగా సాధ్యం కాదని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా(యూఐడీఏఐ) సుప్రీం కోర్టుకు గతంలో చెప్పింది. ఈ పీటముడిపై సంగ్ధితను తొలగించేందుకు ఐదుగురు జడ్జిలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం గోప్యత అనే ప్రాథమిక హక్కును ఆధార్ కార్డు ఉల్లంఘిస్తుందా? అనే దానిపై విచారణ జరిపి తీర్పు చెప్పనుంది.