మా సంకల్పం ముందు ఎవరెస్ట్ చిన్నదైంది
మా సంకల్పం ముందు ఎవరెస్ట్ చిన్నదైంది
Published Thu, Jun 5 2014 1:55 AM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM
మీడియాతో తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్
సాక్షి, న్యూఢిల్లీ: చిన్న వయసు.. పెద్ద లక్ష్యం.. ముందున్నది ప్రపంచంలోనే ఎత్తై ఎవరె స్ట్ శిఖరం.. అధిరోహించాలంటే కొండంత ధైర్యం, అంతే ఆత్మవిశ్వాసం ఎంతో అవసరం.. మైనస్ నలభై డిగ్రీల చలి, కాలుతీసి కాలు వేయలేనంత మంచు.. కాలి బూట్లే 10 కిలోలు, భుజాన మరో 20 కేజీల బ్యాగ్..
ఇలాంటి పరిస్థితుల్లో పెద్దపెద్దవారికే సాధ్యంకాని ఎవరెస్ట్ అధిరోహణ.. వీరికెలా సాధ్యమంటూ అంతా ఆశ్చర్యంగా చూసినా, ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపారు తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్‌లు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తై ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి, మువ్వన్నెల జాతీయ జెండాను రెపరెపలాడించిన తెలుగు తేజాలు పూర్ణ, ఆనంద్‌కుమార్‌లు బుధవారం ఢిల్లీ చేరుకున్నారు. వీరికి ఇక్కడి ఏపీభవన్ అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మిగతా ఆధ్వర్యంలోని గురుకుల పాఠశాలల్లో చదువుతున్న ఈ ఇద్దరు మే 25న ఎవరెస్ట్ శిఖరాగ్రంపై అడుగు పెట్టిన విషయం తెలిసిందే. 14 ఏళ్ల అత్యంత పిన్న వయస్సులో ప్రపంచంలోనే ఎత్తయిన ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి పూర్ణ రికార్డు సృష్టించగా, 17 ఏళ్ల ఆనంద్ సైతం అరగంట తేడాతో ఈ శిఖారాన్ని చేరుకొని తెలుగు వారి సత్తా చాటిన విషయమూ విదితమే. ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఇనిస్టిట్యూషన్స్ సొసైటీ అందించిన సహకారం.. శిక్షకులు శేఖర్, పరమేష్‌ల సారథ్యంలో సాగిన ఎవరెస్ట్ అధిరోహణ అనుభవాలను వారిద్దరూ మీడియాతో పంచుకున్నారు.
అవకాశం దొరికితే మరోమారు అధిరోహిస్తా: పూర్ణ
‘‘నేను ఎవరెస్ట్ ఎక్కడానికి వెళుతున్నా అని చెప్పగా నా తల్లిదండ్రులు ముందు కంగారుపడ్డా, తర్వాత అంగీకరించారు. నువ్వు సాధిస్తావ్ అని ప్రోత్సహించారు. వారి ఆశీర్వాదం, స్వేరోస్ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ప్రోత్సాహం, శేఖర్, పరమేష్‌లు ఇచ్చిన శిక్షణతో ఎవరెస్ట్ అధిరోహణకు సిద్ధమయ్యాం. భువనగిరి రాక్‌లైప్ స్కూల్‌లో శిక్షణ తీసుకుంటున్న సమయంలోనే అంత పెద్ద బండను చూసి భయపడిపోయా. ఇంత పెద్ద బండను ఎలా ఎక్కుతామని అనుకున్నా. కానీ శేఖర్, పరమేష్‌ల ప్రోత్సాహంతో రోజూ ఆ బండను ఎక్కుతుంటే భయం పోయింది. ఆ ఉత్సాహంతోనే డార్జిలింగ్‌లోని పినాక్ పర్వతాన్ని ఎక్కాం. తర్వాత లఢఖ్‌లో చలిని తట్టుకుని, జారుడు రాళ్లపై నడవడం నేర్చుకున్నాక మాలో పట్టుదల పెరిగింది.
ఆ ఉత్సాహంతోనే ఎవరెస్ట్ ఎక్కేందుకు సిద్ధమయ్యాం. చాలా క్లిష్ట వాతావరణంలో, అంతకన్నా ప్రమాదకర పరిస్థితిలో ప్రయాణం సాగింది. మైనస్ 40 డిగ్రీల చలిలో, జారుడు మంచును దాటుకుంటూ వెళ్లేందుకు చాలా కష్టపడ్డా. ఒక్కో అడుగు వేస్తూ ముందుకు వెళ్లాం. కొద్దిదూరం వెళ్లాకఆరు శవాలు కనిపించాయి. వాటిని చూడగానే భయంతో వణికిపోయాం. అయితే, దేనికీ వెరవకుండా, వె నక్కి చూడకుంగా ముందుకు సాగడమే సాహసం, అదే జీవితం అన్న మా గురువు ప్రవీణ్‌కుమార్ మాటలు గుర్తొచ్చి మరింత దృఢ విశ్వాసంతో ముందుకు సాగాం. మా దృఢ సంకల్పం ముందు ఎవరెస్ట్ చిన్నగా అయిపోయింది. అన్నీ దాటుకుంటూ చివరికి ఎవరెస్ట్ శిఖరాగ్రాన్ని చేరుకున్నాం. నేను ఈ రోజు అందరికన్నా ఎత్తై ప్రదేశంలో ఉన్నాను అనే భావన కలిగి చాలా గర్వంగా ఫీలయ్యా.
నా తల్లిదండ్రులు, ప్రవీణ్‌కుమార్ సార్ గుర్తొచ్చి ఆనందంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయాను. అక్కడే జాతీయ జెండా, తెలంగాణ జెండాను ఎగురవేసి.. బీఆర్ అంబేద్కర్, సాంఘిక సంక్షేమ శాఖకు వన్నెతెచ్చిన ఐఏఎస్ అధికారి ఎస్‌ఆర్ శంకరన్‌ల ఫోటోలను అక్కడ ఉంచాం. బాలికలు ఏదైనా చేయగలరు. బాలుర కంటే ఎక్కువ చేయగలరు. నాకు మళ్లీ అవకాశం ఇస్తే మరోమారు ఎవరెస్ట్ ఎక్కడానికి సిధ్దంగా ఉన్నా. ఈ విజయాన్ని మా స్వేరోస్ టీమ్ మొత్తానికి అంకితమిస్తున్నా. ఇక మీదట చదువుపై దృష్టిపెడతా. ముందు పదో తరగతి పాసవ్వాలి. ఐపీఎస్ అయి, పేదలకు సేవ చేయాలన్నదే నా సంకల్పం’’.
ఓ సవాల్‌గా తీసుకుని ముందుకెళ్లా: ఆనంద్
‘‘ముందుగా భవనగిరి రాక్‌లైన్ స్కైల్‌లో పెద్ద రాయిని ఎక్కడానికే ఎంతో భయమేసింది. అయితే మా ట్రైనర్స్ ఇచ్చిన ధైర్యంతో దాన్ని ఎక్కగలిగా. తర్వాత పీనాక్ శిఖరాన్ని ఎక్కడంతోపాటు లడఖ్‌లో కఠిన శిక్షణ తీసుకున్నాం. మొదట్లో చాలా కష్టంగా అనిపించినా అన్నీ తట్టుకోగలిగాం. ఇక 20 కేజీల బరువును భుజాన వేసుకొని, మంచు రాళ్ల మధ్య ముందుకు సాగడం అంటే ఆషామాషీ కాదు. ప్రతి అడుగూ భయానకమే. వాతావరణం ఏమాత్రం సహకరించదు. ఆ సమయంలో.. ‘నేను ఎంత కష్టమొచ్చినా వెనక్కి వెళ్లను’, ‘దేనికీ భయపడను’, ‘నీవు ఎవరికీ తక్కువ కాదు’, ‘ముందుకు సాగడమే జీవితం’ అని మాకు శిక్షణలో నేర్పిన సూత్రాలు గుర్తొచ్చాయి. అవి నాపై బాగా ప్రభావం చూపించాయి.
దీంతో ఎవరెస్ట్ అధిరోహణను ఓ సవాల్‌గా తీసుకున్నా. 7,400 మీటర్ల ఎత్తు చేరాక ఊపిరి సరిగా అందేది కాదు. అక్కడికి వచ్చేసరికే ప్రాణం పోయినంత పనైంది. చివరి క్యాంపు చేరాలంటే రాత్రిపూట లోయల మధ్య నుంచి ప్రయాణం చేయాలి. కొద్దిగా అదుపు తప్పినా కనీసం శవం కూడా దొరకదు. ఓ సమయంలో కిందపడ్డా. చాలా భయమేసింది. అయినా ధైర్యం తెచ్చుకొని, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాం. ఎవరెస్ట్ చేరాక జాతీయజెండా, తెలంగాణ జెండా ఎగురవేశాం. ఎంతో గర్వంగా అనిపించింది. ఆత్మవిశ్వాసం, దృఢ సంకల్పం ఉంటే పేదవారు దేనికీ తక్కువ కారని నిరూపించామనిపించింది. తిరిగి వస్తున్న సమయంలో రెండుమార్లు కిందపడ్డా. తల్లిదండ్రులు, గురువులు, దేవుడి ఆశీర్వాదాలతో క్షేమంగా వచ్చా. ఇక ఇంటర్మీడియట్ పూర్తి చేయాల్సి ఉంది. ఐపీఎస్ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. భవిష్యత్తులో అవకాశాలు వస్తే మరిన్ని శిఖరాలు ఎక్కుందుకు నేను రెడీ’’.
Advertisement
Advertisement