ఇక రెజ్లింగ్‌లోనూ ప్రొ లీగ్... | Sakshi
Sakshi News home page

ఇక రెజ్లింగ్‌లోనూ ప్రొ లీగ్...

Published Tue, Jul 28 2015 12:10 AM

ఇక రెజ్లింగ్‌లోనూ ప్రొ లీగ్...

నవంబరు 8 నుంచి 29 వరకు
భారత్‌లోని 6 నగరాల్లో పోటీలు  

 
న్యూఢిల్లీ: ఇప్పటికే క్రికెట్, హాకీ, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్, టెన్నిస్, కబడ్డీ లీగ్‌లను చూసిన భారత క్రీడాభిమానులకు మరో లీగ్ కనువిందు చేయనుంది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ), ప్రొ స్పోర్టీఫై సంస్థ ఆధ్వర్యంలో తాజాగా రెజ్లింగ్ క్రీడలోనూ ప్రొ లీగ్ ప్రారంభం కానుంది. ఈ ఏడాది నవంబరు 8 నుంచి 29 వరకు భారత్‌లోని ఆరు నగరాల్లో జరిగే ప్రొ రెజ్లింగ్ లీగ్ (పీడబ్ల్యూఎల్)కు సంబంధించిన ఆవిష్కరణ కార్యక్రమం సోమవారం అట్టహాసంగా జరిగింది.

భారత మేటి రెజ్లర్లు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్, బజరంగ్, అనూజ్ చౌదరీ, గీత ఫోగట్, బబితా కుమారి, గీతిక జక్కర్ పలువురు మోడల్స్‌తో కలిసి ఈ ఆవిష్కరణోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విఖ్యాత పాప్ సింగర్ అపాచీ ఇండియన్ పీడబ్ల్యూఎల్ థీమ్ సాంగ్‌ను పాడగా... పలువురు రెజ్లర్లు గ్రీకు యుద్ధవీరుల వేషాధారణలో ర్యాంప్‌పైకి వచ్చారు. ప్రొ రెజ్లింగ్ లీగ్ భారత క్రీడారంగంలో చారిత్రక క్షణం అని ఒలింపిక్ పతక విజేతలు సుశీల్ కుమార్, యోగేశ్వర్ దత్ అన్నారు. ప్రొ లీగ్ భారత రెజ్లింగ్‌ను కొత్త శిఖరాలకు తీసుకెళుతుందని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ అన్నారు.
 
►భారత్‌లోని ఆరు నగరాల్లో మూడు వారాలపాటు ప్రొ రెజ్లింగ్ లీగ్‌ను నిర్వహిస్తారు. ఉత్తర భారత్ నుంచి మూడు ఫ్రాంచైజీలు.. పశ్చిమ, దక్షిణ, ఈశాన్య భారత్ నుంచి ఒక్కో ఫ్రాంచైజీ ఉంటాయి.

►{పతి జట్టులో 11 మంది రెజ్లర్లు (పురుషులు-6, మహిళలు-5) ఉంటారు. ప్రతి జట్టులో ఆరుగురు భారత రెజ్లర్లు, ఐదుగురు విదేశీ రెజ్లర్లు ఉంటారు.

►  మొత్తం లీగ్ ప్రైజ్‌మనీ రూ. 5 కోట్లు. ఇప్పటికే ప్రపంచంలోని టాప్-20 మంది రెజ్లర్లు ఈ లీగ్‌లో పాల్గొనేందుకు తమ అంగీకారాన్ని తెలిపారు.

►  {పతి ఫ్రాంచైజీ కనీస ధర రూ. 3 కోట్లు. సె ప్టెంబరు 7లోపు ఆరు జట్లను ఖరారు చేస్తా రు. ఆగస్టు 30లోపు ఈ లీగ్ ప్రసారకర్తను ఎంపిక చేస్తారు. సెప్టెంబరు 15న రెజ్లర్ల వేలం నిర్వహిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా 150 దేశాల్లో ఈ లీగ్‌ను ప్రసారం చేస్తారు.

► మూడు వారాలు జరిగే ఈ లీగ్‌లో ప్రతి జట్టు అన్ని జట్లతో కనీసం ఒక్కసారైనా ఆడుతుంది. ‘బెస్ట్ ఆఫ్-9 బౌట్స్’ పద్ధతిలో మ్యాచ్‌లను నిర్వహిస్తారు. ఒక్కో బౌట్‌లో మూడు నిమిషాల నిడివిగల మూడు రౌండ్‌లు ఉంటాయి. ప్రతి రౌండ్ మధ్య నిమిషం విరామం ఉంటుంది. లీగ్ దశలో తొలి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు చేరుకుంటాయి. ఆ తర్వాత ఫైనల్ జరుగుతుంది.
 
 

Advertisement
 
Advertisement
 
Advertisement