‘తల్లి’డిల్లిన తండా... యాడియే.. | 14 years old girl brutally raped and murderd | Sakshi
Sakshi News home page

‘తల్లి’డిల్లిన తండా... యాడియే..

Published Sat, May 23 2015 3:48 AM | Last Updated on Mon, Jul 30 2018 8:29 PM

‘తల్లి’డిల్లిన తండా... యాడియే.. - Sakshi

‘తల్లి’డిల్లిన తండా... యాడియే..

ఆడ కూతురుకు రక్షణలేదని మరోమారు రుజువైంది. చిట్టితల్లులపై పైశాచికత్వం కొనసాగుతూనే ఉందని జిల్లాలో గురు వారం రాత్రి ఓ గిరిజన బాలికపై జరిగిన అఘాయిత్యం కళ్లకు కట్టింది. నాన్నతోడు కూడా కామాంధుల కర్కశత్వం నుంచి కాపాడలేకపోవడం.. ఐదుగురు మృగాళ్ల చేతుల్లో చిన్నారి బలైపోవడం జిల్లా ప్రజలను కలచివేసింది. మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి తండాకు చెందిన సిమ్రాన్(14) తండ్రితో కలిసి గురువారం రాత్రి 8 గంటల సమయంలో గ్రామానికి వెళ్తుండగా బంట్వారం మండలం మోత్కుపల్లి గేటు వద్ద ఐదుగురు దుర్మార్గులు అటకాయించారు.

తండ్రిని చితకబాది బలవంతంగా బాలికను ఆటోలో అపహరించి అత్యాచారం చేసి.. పాశవికంగా చంపేశారు. అర్ధరాత్రి ఆడ కూతురుపై జరిగిన ఈ దారుణం శుక్రవారం జిల్లా అంతా దావానలంలా వ్యాపించింది. ఘటనా స్థలంలో బాలిక తల్లి దేవిక.. యాడియే (అమ్మా..) నీకు అప్పుడే నూరేళ్లు నిండాయా.. అంటూ రోదించిన తీరు కలచివేసింది.
 
అన్నెంపున్నెం ఎరుగని గిరిపుత్రికను వెంటాడి.. వేటాడి.. చంపేశారు..
తండ్రి సాక్షిగా కూతురిపైఅత్యాచారం చేసిన దుర్మార్గులు
మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి తండాలో విషాదం
ఐదుగురు దుండగుల దుశ్చర్య
బంట్వారం మండలం మోత్కుపల్లి సమీపంలో దారుణం

 
బంట్వారం:అమానుషం చోటుచేసుకుంది.. నలుగురు కామాంధులు ఓ గిరిజన బాలికను అపహరించి సామూహిక అత్యాచారం చేసి హత్య చేశారు. ముక్కుపచ్చలారని బాలిక దుండగుల కామానికి బలైంది. తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన బంట్వారం మండల పరిధిలోని మోత్కుపల్లి గేటు సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలు.. మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టెంపల్లి తండాకు చెందిన సిమ్రాన్(14) మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాలలో 8వ తరగతి పూర్తి చేసింది. నగరంలోని లింగంపల్లిలో బంధువుల ఇంటినుంచి తీసుకొచ్చేందుకు బాలిక తండ్రి మెగావత్ కమాల్ గురువారం తన మోపెడ్‌పై వెళ్లాడు.

రాత్రి 8 గంటలకు  తండ్రీకూతురు స్వగ్రామానికి వస్తున్నారు.  మార్గంమధ్యలోని మోత్కుపల్లి గేటు వద్ద ఉన్న చేతిపంపు వద్ద నీళ్లు తాగేందుకు వాహనం నిలిపారు. అక్కడే ఉన్న ఆటోలోంచి ఓ గుర్తు తెలియని దుండగుడు వచ్చి కమాల్‌పై దాడి చేశాడు. మరో నలుగురు దుండగులు చెట్ల పొదల్లోంచి వచ్చి బాలికను అపహరించి ఆటోలో మోత్కుపల్లి వైపు తీసుకెళ్లారు.  దాడిలో స్పృహ తప్పి పడిపోయిన కమాల్‌ను కోటపల్లి వైపు వెళ్తున్న డీసీఎం డ్రైవర్ గమనించి మంచి నీళ్లు తాగించాడు.

కొద్దిసేపటి తర్వాత ఆయన తన కూతురు కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. కమాల్ సమాచారంతో తండావాసులు, బం ధువులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ టోలో  మోమిన్‌పేట ఠాణాకు తీసుకెళ్లి జరి గిన ఘటనపై సీఐ రంగాకు ఫిర్యాదు చేశారు.
 
సామూహిక అత్యాచారం.. హత్య
పోలీసులు ఆలస్యంగా స్పందించడంతో జరగరానిదంతా జరిగిపోయింది. పోలీసు బృందాలు రాత్రంతా హల్‌చల్ చేసినా బాలిక జాడ తెలుసుకోలేకపోయారు. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో మోత్కుపల్లి గేటు సమీపంలో రోడ్డుపక్కనే సిమ్రాన్ మృతదేహం కనిపించింది.దుండగులు బాలి కపై సామూహిక అత్యాచారం చేసి అనంతరం గొంతు నులిమి చంపేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఎస్పీ శ్రీనివాసులు, అడిషనల్ ఎస్పీ చందనదీప్తి తదితరులు వివరాలు సేకరించారు. పోలీసు జాగిలం ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న బార్వాద్ గ్రామంలోని ఆరుగురి ఇళ్లలోకి వెళ్లి ఆగిపోయింది.  
 
పోలీసులతో వాగ్వాదం
బాలికపై అత్యాచారం, హత్య విషయం తెలుసుకున్న హతురాలి బంధువులు, తండావాసులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితులను పట్టుకునే వరకు మృతదేహాన్ని ఇక్కడి నుంచి తీసేది లేదని భీష్మించి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అనంతరం పో లీసులు ఆందోళనకారులకు సర్దిచెప్పారు.  అనంతరం మృతదేహాన్ని ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబీకులకు అప్పగిం చడంతో అంత్యక్రియలు నిర్వహించారు.  ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 
ఆదుకుంటావనుకున్నం తల్లీ..

చదువులో చురుకుగా ఉండే సిమ్రాన్ మృతితో తల్లిదండ్రులు హతాశులయ్యారు. ‘ఉన్నత చదువులు అభ్యసించి మమ్మల్ని ఆదుకుంటావనుకున్నం తల్లీ.. అంతలోనే దుండగులు నిన్ను కబళించారు’ అని బాలిక తల్లి దేవిక గుండెలుబాదుకుంటూ రోదించిన తీరు హృదయ విదారకం. కాగా, సిమ్రాన్‌కు చెల్లెలు చిట్టెమ్మ, తమ్ముళ్లు సతీష్, నితిన్ ఉన్నారు. బాలిక తండ్రి కమాల్ వ్యవసాయంతో పాటు కూలీపనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు.
 
వెంటనే అప్రమత్తం చేశాం: సీఐ రంగా
కిడ్నాప్‌కు సంబంధించిన సమాచారం అందిన వెంటనే జిల్లా పోలీస్ యంత్రాంగానికి సెట్లో అప్రమత్తం చేశాం. నాతో పాటు మోమిన్‌పేట, మర్పల్లి, బంట్వారం, నవాబుపేట ఎస్సైలు రాత్రంతా దుండగుల కోసం గాలించినా ఫలితం లేకుండా పోయింది. ఫి ర్యాదు చేయడంలో ఆలస్యం చేశారు. రాత్రి 12 తర్వాత స్టేషన్‌కు వచ్చారు.
 
కేసు దర్యాప్తునకు సహకరించండి: ఎస్పీ  
సీసీఎస్ ఇన్స్‌పెక్టర్ ఆధ్వర్యంలో 5 పోలీసు బృందాలు నిందితుల కోసం గాలిస్తున్నాయి. త్వరలోనే దుండగులను పట్టుకొని కఠిన చ ర్యలు తీసుకుంటాం. ఇలాంటి ఘటన జరగడం బాధాకరం. కేసు దర్యాప్తునకు అంద రూ  సహకరించాలి.
 
నిందితులను ఉరితీయాలి..
నన్ను కొట్టి నా కూతురును ఆటోలో తీసుకొని పారిపోయా రు. తెల్లారిచూస్తే నా బంగారు తల్లి శవంగా తేలింది. ఇంత దారుణం జరుగుతదనుకోలేదు. నా బిడ్డ గొప్పసదువు సదివి మమ్మల్ని ఆదుకుంటది అనుకున్నం. అంతలోనే ఇలా జరిగిపోయింది. నా బిడ్డను సంపినొళ్లను ఉరితీయాలి.. నా బిడ్డలాగే ఇంకో ఆడబిడ్డకు ఇట్ల జరుగొద్దు.                  
-కమాల్, బాలిక తండ్రి కమాల్
 
ప్రభుత్వ వైఫల్యమే..
చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు ఘోరం గా విఫలమవుతున్నాయి. దీంతో అధికంగా గిరిజను లు, వెనుకబడిన జాతుల వారిపై ఇలాంటి దారుణా లు చోటుచేసుకుంటున్నా యి. ప్రభుత్వం వెంటనే బాలిక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
 - సపావట్ చందు నాయక్, గిరిజన సంఘం నాయకుడు  
 
కఠినంగా శిక్షించాలి..
ఈ ఘటన హేయమైన చర్య. కచ్చితంగా పోలీ సుల వైఫల్యమే. దోషులు ఎంతటి వారైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి. గిరిజనులకు రక్షణ కల్పించడంలో ప్ర భుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయి. సర్కార్ హతురాలి కుటుంబాన్ని ఆదుకోవాలి.
-ఆంబోత్ శివ, లంబాడ సంఘం నాయకుడు
 
చాలా దారుణం..
తండ్రిపై దాడి చేసి కూతురిని అపహరించి అత్యాచారం.. హత్య చేయడం దారుణం. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చినా ప్రయోజనం శూన్యం. పోలీసులు నిందితులను పట్టుకొని బహిరంగంగా  ఉరి తీయాలి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
-మేఘావత్ బాబురావు, డివిజన్ నాయకుడు( గిరిజన సంఘం)
 
ఘటన సిగ్గు చేటు..
గిరిజన బాలికపై అత్యాచారం, హత్య జరగడం దారుణం. ఇది ముమ్మాటికీ సర్కార్ వైఫల్యమే. సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటన ఇది. పోలీసులు వెంటనే నిందితులను అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి. లేదంటే పెద్దఎత్తున ఆందోళ న కార్యక్రమాలు చేపడతాం.
- కొర్ర శ్రీనివాస్ నాయక్,గిరిజన సంఘం రాష్ట్ర నాయకుడు.
 
రక్షణ లేకుండా పోయింది
ఎన్ని చట్టాలు తీసుకొచ్చిన బా లికలు, మహిళలకు పూర్తి రక్షణ లేకుండా పోయింది. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే నిందితులను కఠినంగా శిక్షించాలి. ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది. దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించినప్పుడే ఇలాంటి దారుణాలు మళ్లీ జరుగవు.
-కిషన్ నాయక్, గిరిజన సంఘం నాయకుడు
 
ఢిల్లీ ఘటన మరువక ముందే మరో దారుణం
ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన మరిచిపోకముందే గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి ఘటన జరుగడం దారుణం. ఇలాంటి చర్యలపై చట్టాల్లో ఇంకా మార్పులు తేవాల్సిన అవసరం ఉంది. బాలికలు, మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వం బాలిక కుటుంబాన్ని ఆదుకోవాలి.
- గోవర్ధన్‌రెడ్డి, న్యాయవాది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement