అవమాన భారం ఉసురు తీసింది!
► ఏసీబీ కస్టడీలో ఉన్న మున్సిపల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు ఆత్మహత్య
► అపార్టుమెంట్ ఐదో అంతస్తు నుంచి దూకిన వైనం
► నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం ఘటన
► రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఉదయమే పట్టుకున్నామన్న ఏసీబీ
► బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ ఉద్యోగ సంఘాల ఆందోళన
సాక్షి, నిజామాబాద్: అవమాన భారం ఓ అధికారి ఉసురు తీసింది.. తాను తప్పు చేయకున్నా కావాలనే ఏసీబీకి పట్టించారనే మనస్తాపంతో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో ఇంజనీర్‌గా పనిచేస్తున్న సీహెచ్ వెంకటేశ్వర్లు(56) ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాను నివసిస్తున్న అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తు నుంచి కిందకు దూకేశారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారుల కస్టడీలో ఉన్న సమయంలోనే జరిగిన ఈ ఘటన కలకలం సృష్టించింది. దీనిపై ఉద్యోగ సంఘాలు మండిపడతుండగా.. ఏసీబీ అధికారుల వ్యవహార శైలిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఉదయం దాడి.. సాయంత్రం ఆత్మహత్య
హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతానికి చెందిన సీహెచ్ వెంకటేశ్వర్లు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌లో మున్సిపల్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. నిజామాబాద్‌లో కంఠేశ్వర్ ప్రాంతంలోని సత్యం అపార్ట్‌మెంట్ ఐదో అంతస్తులో ఉన్న ఓ ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నారు. నిజామాబాద్‌లో కొద్ది రోజులుగా జరుగుతున్న డ్రైనేజీ, రోడ్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. అయితే శనివారం ఉదయం ఆ పనులకు సంబంధించి బిల్లు మంజూరు కోసం రాములు అనే సబ్ కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా.. వెంకటేశ్వర్లును రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ నరేందర్‌రెడ్డి ప్రకటించారు. తర్వాత ఆయనను స్థానిక మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి తీసుకువచ్చి విచారణ చేపట్టారు.
ఈ క్రమంలో తనకు మధుమేహం వ్యాధి ఉందని, మందుల కోసం ఇంటికి వెళ్లాలని వెంకటేశ్వర్లు ఏసీబీ అధికారులను కోరారు. దీంతో అధికారులు సాయంత్రం 4 గంటల సమయంలో వెంకటేశ్వర్లును ఆయన నివాసానికి తీసుకెళ్లారు. ఈ సమయంలో బెడ్‌రూంలోకి వెళ్లిన ఆయన బాల్కనీ నుంచి కిందికి దూకేశారు. ఐదో అంతస్తు నుంచి పడడంతో ఆయన తలకు, ఇతర శరీరభాగాలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే ఆయన మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వెంకటేశ్వర్లుకు భార్య నారాయణమ్మ, కుమార్తె ప్రవళిక, కుమారుడు కృష్ణ చైతన్య ఉన్నారు. కృష్ణ చైతన్య జీహెచ్‌ఎంసీలో సబ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నారు. వెంకటేశ్వర్లు మరణవార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు నిజామాబాద్ జిల్లా కేంద్ర ఆసుపత్రికి చేరుకుని.. బోరున రోదించారు. తన భర్త లంచాలు తీసుకునే వ్యక్తి కాదని, ఎవరో ఇది కావాలనే చేసి ఉంటారంటూ నారాయణమ్మ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళనతో ఆసుపత్రిలోనే సొమ్మసిల్లి పడిపోయారు.
బాధ్యులైన అధికారులను అరెస్టు చేయాలి
వెంకటేశ్వర్లు మరణ వార్త తెలిసిన వెంటనే మున్సిపల్, ఇతర శాఖల ఉద్యోగులు, టీఎన్జీవో, ఇతర సంఘాల నేతలు పెద్ద సంఖ్యలో జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలివచ్చారు. ఏసీబీ అధికారుల తీరును నిరసిస్తూ బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఏసీబీ కస్టడీలో ఉన్న వెంకటేశ్వర్లు మృతికి కారణమైన ఏసీబీ డీఎస్పీని, సంబంధిత అధికారులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.
జ్యుడీషియల్ విచారణ చేపడతాం
ఏసీబీ కస్టడీలో ఉన్న వెంకటేశ్వర్లు ఆత్మహత్య ఘటనపై జ్యుడీషియల్ విచారణ చేపడతామని నిజామాబాద్ ఏసీపీ ఆనంద్‌కుమార్ పేర్కొన్నారు. ఆందోళన చేపట్టిన ఉద్యోగులతో ఆయన మాట్లాడారు. ఈ ఘటనపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా వెంకటేశ్వర్లు భౌతికకాయానికి ఆదివారం న్యాయమూర్తి సమక్షంలో పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రకటించారు.
నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా సేవలు
వెంకటేశ్వర్లు స్వస్థలం ఏపీలోని గుంటూరు జిల్లా చీరాల. చాలా ఏళ్లుగా వారి కుటుంబం హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో స్థిరపడింది. ఆయన గతంలో నల్లగొండ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఇంజనీర్‌గా, కమిషనర్‌గా పనిచేశారు. ప్రజారోగ్యశాఖలో నిజామాబాద్‌లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేశారు. సుమారు ఏడాదిన్నర నుంచి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు మున్సిపల్ ఇంజనీర్‌గా బదిలీ అయ్యారు. ఆయన రెండేళ్లలో పదవీ విరమణ చేయాల్సి ఉంది.
సమగ్ర విచారణ చేపట్టాలి: కోమటిరెడ్డి
మున్సిపల్ ఇంజనీర్ వెంకటేశ్వర్లు ఆత్మహ త్య ఘటనపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. వెంకటేశ్వర్లు నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా చాలా ఏళ్లు ఉత్తమ సేవలు అం దించారని గుర్తు చేసుకున్నారు. వెంకటేశ్వర్లు మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.
కుట్ర చేసి పట్టించారా?
వెంకటేశ్వర్లు ఆయా అభివృద్ధి పనుల నాణ్యత విషయంలో నిబంధనల ప్రకారం వ్యవహరిస్తారనే పేరుందని మున్సిపల్ ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. పనులు జరుగుతున్న చోటుకు వెళ్లడం, ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షించడంలో నిక్కచ్చిగా ఉంటారని చెబుతున్నాయి. ఈ క్రమంలో కొందరికి అది మింగుపడలేదని... అందువల్ల వ్యూహాత్మకంగా ఆయనను ఏసీబీ అధికారులకు పట్టించారని చర్చించుకుంటున్నాయి.
వెంకటేశ్వర్లు మృతదేహం వద్ద రోదిస్తున్న భార్య, కుటుంబ సభ్యులు