కొరియాతో తల గోక్కుంటారా?!
- కొరియా ద్వీపకల్పంపై యుద్ధ మేఘాలు
- ఉత్తర కొరియా అణు కార్యక్రమాలపై అమెరికా ఆందోళన
- నియంత్రించకపోతే ఏకపక్ష చర్యలు చేపడతామన్న ట్రంప్
- ఉత్తర కొరియా దిశగా పయనమైన అమెరికా యుద్ధనౌక
- చైనా ఆందోళన.. శాంతియుత పరిష్కారం కోసం పిలుపు
- కొరియా సరిహద్దులో భారీగా చైనా సైన్యం మోహరింపు
‘పిచ్చోడి చేతిలో రాయి...’ అనే సామెత అర్థం తెలుసు కదా! ఆ పిచ్చోడు ఒక దేశానికి నియంత అయితే.. అతడి చేతిలో ఓ పది అణ్వస్త్రాలు ఉంటే.. అమెరికా సహా ఏ దేశాన్నైనా మసి చేసేయగలం అంటూ హెచ్చరికలు జారీచేస్తుంటే.. చుట్టూ ఉన్న దేశాల పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఉత్తర కొరియా అణ్వస్త్రాల విషయంలో అమెరికా, దక్షిణ కొరియా, జపాన్, చైనాలు ఆ పరిస్థితులోనే ఉన్నాయి. కొరియా ద్వీపకల్పం కేంద్రంగా వేగంగా జరుగుతున్న పరిణామాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇప్పటికే అణ్వస్త్రాలు సమకూర్చుకున్న ఉత్తర కొరియా త్వరలో ఆరోసారి అణ్వస్త్ర పరీక్ష నిర్వహించే అవకాశం ఉందన్న ఆందోళనలు.. ఆ పొరుగునే దక్షిణ కొరియాతో కలిసి అమెరికా యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తుండటం.. ఆ విన్యాసాల పర్యవసానాలు విధ్వంసకరంగా ఉంటాయని, అమెరికా కోరుకునే ఏ తరహా యుద్ధానికైనా తాము సిద్ధమని ఉత్తర కొరియా ప్రకటించడం.. ఆ దేశాన్ని చైనా నియంత్రించలేకపోతే తాము ఏకపక్షంగా చర్యలు చేపడతామని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హెచ్చరించడం.. అమెరికా యుద్ధవిమాన వాహక నౌక విన్సన్‌ను ఆ దేశం వైపు పంపించడం.. వరుస పరిణామాలతో పరిస్థితి అకస్మాత్తుగా సంక్షోభం స్థాయికి దిగజారింది. కొరియా ద్వీపకల్పం యుద్ధానికి అతి దగ్గరగా చేరుకుందని పరిశీలకులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
ఉత్తర కొరియా అంటే ఎందుకంత భయం?
రెండో ప్రపంచ యుద్ధానికి ముందు కొరియా ద్వీపకల్పం జపాన్ వలస పాలనలో ఉండేది. ఆ యుద్ధంలో జపాన్ లొంగిపోయిన తర్వాత.. ఉత్తర భూభాగాన్ని పొరుగు దేశమైన సోవియట్ రష్యా, దక్షిణ భూభాగాన్ని అమెరికా ఆక్రమించడంతో అది రెండు దేశాలుగా విడిపోయింది. సోవియట్ రష్యా, అమెరికాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కారణంగా కొరియా ఏకీకరణ కలగానే మిగిలిపోయింది. అమెరికా సాయంతో దక్షిణ కొరియాలో స్వేచ్ఛా మార్కెట్ ప్రభుత్వం ఏర్పాటైతే.. సోవియట్ రష్యా సాయంతో కొరియాలో కిమ్-2 సంగ్ నేతృత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటైంది. రెండు అగ్ర దేశాల ప్రచ్ఛన్న యుద్ధం కొరియాలో అగ్గిని రాజేస్తూనే ఉంది. 1950లో ఉభయ కొరియాల మధ్య యుద్ధం చెలరేగినపుడు.. దక్షిణ కొరియాకు మద్దతుగా అమెరికా రంగంలోకి దిగి ఉత్తర కొరియాలోకి చొచ్చుకువచ్చింది. ఉత్తర కొరియాకు రష్యా అండగా నిలిచింది. అమెరికా సైన్యం చైనా సరిహద్దుల వరకూ రావడంతో ఉత్తర కొరియాకు మద్దతుగా కమ్యూనిస్టు చైనా కూడా బరిలోకి దిగింది. ఎట్టకేలకు యుద్ధం ముగిసి ఎవరికి వారు మునుపటి స్థానాలకు వెళ్లారు.
అప్పటి నుంచి కొరియా ద్వీపకల్పం రగులుతూనే ఉంది. అమెరికా, దక్షిణ కొరియాల భయంతో ఉత్తర కొరియా సైనిక దేశంగా కరడుగట్టిపోయింది. సైనిక పాటవాన్ని అణ్వాయుధాలను పెంపొందించుకోవడానికి ప్రాధాన్యమిచ్చింది. తొలిసారిగా 2009లో విజయవంతంగా అణ్వస్త్రాన్ని పరీక్షించింది. అప్పటి నుంచి ఆ దేశ అణ్వస్త్ర, ఖండాంతర క్షిపణి కార్యక్రమాన్ని నిలువరించేందుకు అమెరికా వ్యూహాత్మకంగా ప్రయత్నిస్తోంది. ఉత్తర కొరియాకు సరఫరాలను అడ్డుకోవడం నుంచి ఖండాంతర క్షిపణులను గాలిలోనే ఛేదించడం వరకూ ఈ వ్యూహంలో భాగం. ప్రస్తుతం ఉత్తర కొరియా వద్ద 8 నుంచి 10 వరకూ అణ్వస్త్రాలు ఉన్నాయని వివిధ అంతర్జాతీయ సంస్థల అంచనా.
ఉత్తర కొరియాకు పాకిస్తాన్ నుంచి అణ్వస్త్ర సాంకేతిక పరిజ్ఞానం లభించింది. అలాగే పాక్ తన ఖండాంతర క్షిపణుల అభివృద్ధికి ఉత్తర కొరియా నుంచి సాంకేతిక సాయం తీసుకుంది. తమ వద్ద అణ్వస్త్రాలు, ఖండాంతర క్షిపణులు ఉన్నాయని అమెరికా సహా ఏ దేశాన్నైనా మసి చేయగలమని తరచుగా హెచ్చరికలు జారీచేస్తోంది. అత్యంత క్రూరమైన నియంతగా పేరున్న కొరియా పాలకుడు కిమ్-జోంగ్-ఉన్ చేతిలో ఉన్న అణ్వస్త్రాలతో ఎప్పుడు ఎవరికి మూడుతుందోననే భయం దక్షిణకొరియా, అమెరికా, జపాన్లలో నెలకొంది. పొరుగుదేశమైన చైనా కూడా ఆందోళన చెందుతోంది.
- సాక్షి నాలెడ్జ్ సెంటర్