కాంగ్రెస్‌ ఓ దొంగల ముఠా! | KCR to offer 'gold moustache' worth Rs 75000 at Kuravi | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ ఓ దొంగల ముఠా!

Published Sat, Feb 25 2017 3:04 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌ ఓ దొంగల ముఠా! - Sakshi

కాంగ్రెస్‌ ఓ దొంగల ముఠా!

ప్రాజెక్టులను అడ్డుకుంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: కేసీఆర్‌
కురవిలో వీరభద్రుడికి కోరమీసాల మొక్కు చెల్లింపు
సాక్షి, మహబూబాబాద్‌: రాష్ట్రంలో తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటూ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు మండిపడ్డారు. గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టుల్లో కేసులు వేస్తున్నారని.. ప్రాజెక్టులను అడ్డుకునేం దుకు ఓ దొంగల ముఠా తయారైందని విమర్శించారు. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని.. రూ.36 వేల కోట్లతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని కేసీఆర్‌ చెప్పారు.

రాష్ట్రంలో గుంట పొలం కూడా ఎండిపోకుండా ఉండేందుకు ఇప్పటికే 9,500 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసి పంటలకు విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని.. మరో 500 మెగావాట్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ‘తెలంగాణ’ మొక్కుల్లో భాగంగా సీఎం కేసీఆర్‌ శుక్రవారం మహబూబాబాద్‌ జిల్లా కురవిలోని శ్రీవీరభద్ర స్వామిని దర్శించు కున్నారు. రూ.62,908 వ్యయంతో 20.28 గ్రాముల బరువుతో తయారు చేయించిన కోర మీసాలను వీరభద్రుడికి సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన్నగూడురు మండలం ఉగ్గంపల్లిలోని డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ ఇంట్లో భోజనం చేశారు. తర్వాత అక్కడే విలేకరులతో మాట్లాడారు.

కాంగ్రెస్‌ నేతలవి బానిస బతుకులు..
ప్రజలు 40 నుంచి 44 ఏళ్లు కాంగ్రెస్‌ నాయకులకు అవకాశమిస్తే ఏమీ చేయలేదని.. ఇప్పుడు తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడుతున్నారని కేసీఆర్‌ మండిపడ్డారు. కాంగ్రెస్‌ తరఫున కొల్లాపూర్‌ నుంచి పోటీ చేసిన హర్షవర్దన్ రెడ్డి కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని, వాటిపై స్పష్టమైన ఆధారా లతో అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు.

‘‘ఆంధ్రా ముఖ్యమంత్రులకు సంచులు మోసిన చరిత్ర కాంగ్రెస్‌ నేతలది. వారివి బానిస బతుకులు. కాంగ్రెస్‌ కల్చర్‌ చీప్‌ లిక్కర్‌ పంచే కల్చర్‌. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు దొంగల ముఠా తయారైంది. చిల్లర రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్‌ నేతలు రైతుల నోట్లో మట్టికొడుతున్నారు..’’అని కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి మొక్కుల విషయంలో కొందరు సన్నాసులు రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాలం చెల్లిన కమ్యూనిస్టులు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని.. ప్రజలందరూ బాగుండాలని తలపెట్టిన యాగంపై సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

త్వరలోనే టెక్స్‌టైల్‌ పార్కుకు శంకుస్థాపన
వరంగల్‌ రూరల్‌ జిల్లాలో త్వరలోనే టెక్స్‌టైల్‌ పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. సూరత్, భీవండికి వలస వెళ్లిన వారంతా తిరిగి వచ్చేలా ఈ టెక్స్‌టైల్‌ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని.. దీనికి భూసేకరణ కూడా పూర్తయిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాత వరంగల్‌ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. డోర్నకల్‌ నియోజకవర్గానికి తాత్కాలికంగా పాలేరు నుంచి నీరందిస్తామని హామీ ఇచ్చారు. మల్కాపూర్‌ దగ్గర రిజర్వాయర్‌ కావాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య కోరారని.. దానికి కేబినెట్‌ ఓకే చెప్పిందని వెల్లడించారు.

ఈసారి బీసీల బడ్జెట్‌
ఈ ఏడాది రూ.10–12 వేల కోట్లతో బీసీల బడ్జెట్‌ ఉంటుందని కేసీఆర్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో 64 లక్షల మంది సంచార జాతుల వారు ఉన్నారని, వారి కోసం రూ.వెయ్యి కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్  ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని యాదవుల కోసం రూ.4 వేల కోట్లతో 88 లక్షల గొర్రెలు పంపిణీ చేయబోతున్నామని తెలిపారు. నాయీ బ్రాహ్మణులు చెట్ల కింద, చెరువు కట్ట మీద క్షవరాలు చేసే పద్ధతి పోవాలని, రాష్ట్రవ్యాప్తంగా 40 వేల వరకు హైజెనిక్‌ సెలూన్లను ఏర్పాటు చేస్తామని కేసీఆర్‌ పేర్కొన్నారు. ఇక రజకులకు డ్రైయింగ్‌ మిషన్, వాషింగ్‌ మిషన్లు అందజేసి అత్యాధునిక లాండ్రీ షాపులు ఏర్పాటు చేయిస్తామన్నారు.

వీరభద్రుడి ఆలయానికి రూ.5 కోట్లు..
డోర్నకల్‌ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ఫండ్‌ నుంచి రూ.28.25 కోట్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. అందులో కురవి వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు, డోర్నకల్, మరిపెడ మండల కేంద్రాలకు రూ.కోటి చొప్పున, మిగతా 4 మండల కేంద్రాలకు రూ.50 లక్షల చొప్పున ఇస్తామ ని నియోజకవర్గంలోని 77 గ్రామ పంచాయ తీలకు రూ.25 లక్షల చొప్పున మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం, మంత్రులు ఇంద్రక రణ్‌రెడ్డి, అజ్మీరా చందూలాల్, ఎంపీలు సీతారాం నాయక్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, కోరం కనకయ్య, కొండా సురేఖ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీలు కొండా మురళీ, బోడకుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement