నేలకొరిగిన సాహితీ దిగ్గజం
విరసం వ్యవస్థాపకులు చలసాని ప్రసాద్ అస్తమయం
సాక్షి, విశాఖపట్నం/కూచిపూడి(భట్లపెనుమర్రు): తెలుగునాట మరో సాహితీ దిగ్గజం నేలకొరిగింది. ఒళ్లంతా కలిసి ఒక పిడికిలిగా సాగిన సుదీర్ఘ విప్లవ ప్రస్తానం తన కొనసాగింపును వర్తమాన తరాలకు వదిలిపెట్టి వీడ్కోలు తీసుకుంది. విలువలకు, ఆదర్శానికి, నిబద్ధతకు ఉన్నతమైన తార్కాణంగా నిలిచిన వ్యక్తిత్వం ఒక తిరుగులేని స్ఫూర్తిని మిగిల్చి మరి సెలవంటూ దిగంతాలకు ఎగసిపోయింది. ‘ఈ విప్లవాగ్నులు ఎచటివని అడిగితే’....
అని పాడుతూ ఎర్రజెండా కనిపిస్తే పులకించిపోయే ఆ కళ్లు ప్రజాహిత వెలుగులను ప్రసరింపజేసి ధన్యత నిండిన విశ్రాంతిలోకి జారుకున్నాయి. రచయిత చలసాని ప్రసాద్ (83) మరి లేరు.
రాజకీయ ఉద్దేశాలు ఏవైనా, సాహితీ తాత్త్వికతలు వేరైనా తెలుగు రాష్ట్రంలో ప్రతి సాహితీ బృందం గౌరవంగా అభిమానించే, పెద్ద దిక్కుగా భావించే చలసాని ప్రసాద్ శనివారం ఉదయం విశాఖపట్నంలో తుదిశ్వాస విడిచారు. సీతమ్మధార హెచ్‌బీ కాలనీలో స్వగృహంలో గుండెపోటు రాగా ఆస్పత్రికి తరలించేలోగానే మరణించారు.
చలసాని చివరి కోరిక మేరకు ఆయన కళ్లను మొహిసిన్ ఐ బ్యాంక్‌కు దానం చేశారు. వైద్య విద్యార్థుల ప్రయోజనార్థం భౌతికకాయాన్ని ఆదివారం ఆంధ్ర మెడికల్ కళాశాలకు అప్పగిస్తారు. చలసానికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె ఉద్యమంలో పాల్గొంటూ అజ్ఞాతంలో ఉన్నారు. రెండో కుమార్తె వివాహమై విశాఖపట్నంలో స్థిరపడ్డారు. భార్య విజయలక్ష్మి కొన్నేళ్ల క్రితం మృతి చెందారు.
కృష్ణా జిల్లా భట్ల పెనుమర్రులో 1932 డిసెంబర్ 8న జన్మించిన చలసానిది వామపక్ష కుటుంబం. ఆయన కూడా ఐదో ఏట నుంచే కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితులయ్యారు. చివరి వరకూ దానికే నిబద్ధులై ఉన్నారు. ఆంధ్ర వర్సిటీలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేసిన ఆయన తొలుత మత్స్యశాఖలో ఎల్‌డీసీ ఉద్యోగిగా చేరి ఆ తర్వాత రైల్వేలో క్లర్క్‌గా పనిచేశారు. కొన్నాళ్లు సినిమాల్లో పనిచేసి దర్శకుడు ప్రత్యగాత్మకు సహాయకుడిగా వ్యవహరించారు. తర్వాత ఏవీఎన్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేశారు.
చలసాని ప్రసాద్ విరసం వ్యవస్థాపకుల్లో ఒకరు. శ్రీశ్రీ, కొ.కు, కాళోజీ, కారా, వరవరరావు, కృష్ణాబాయి వంటి సాహితీమూర్తులతో ఆయనకు గాఢమైన స్నేహం, సహచర్యం ఉంది. ముఖ్యంగా శ్రీశ్రీ రచనలు వెలికి తీయడంలో చలసాని సాగించిన కృషి అసామాన్యం. శ్రీశ్రీ జన్మదినం నిర్థారణ చేయడంలో కూడా ఆయన కీలకపాత్ర పోషించారు. విరసం తరఫున చలసాని ప్రసాద్ సంపాదకత్వంలో వెలువడిన శ్రీశ్రీ సమగ్ర సాహిత్యం కొత్తతరాలకు రిఫరెన్స్ గ్రంథాలుగా మారాయి.
కేవలం కలాన్ని నమ్ముకోకుండా గళంతో చైతన్యవంతమైన ఉపన్యాసాలతో ఆయన విప్లవ భావజాలానికి అండగా నిలిచారు. బూటకపు ఎన్‌కౌంటర్లను నిరసించి అనేకసార్లు జైలు కూడా వెళ్లారు. చలసాని ప్రసాద్ మరణవార్త తెలియగానే ఆయన అభిమానులు, విప్లవ సాహితీవేత్తలు, కవులు, రచయితలు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఎంపీ కె.హరిబాబు, మాజీ ఎంపీ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, కాళీపట్నం రామారావు (కారా మాస్టారు) తదితరులు చలసాని పార్థివదేహానికి నివాళులర్పించారు. ప్రసాద్ మరణంతో స్వగ్రామం భట్లపెనుమర్రులో విషాదం అలుముకుంది.
భాషా ప్రేమికుడు: అన్నిటికీ మించి తెలుగు భాషా ప్రేమికుడాయన. వయసుతో పాటే తెలుగు భాషపై పిచ్చీ పెరుగుతోందనే వారు. చలసాని తన ఇంట్లో నిక్షిప్తం చేసిన 35 వేలకు పైగా పుస్తకాలను అత్యంత ఖరీదుకు కొనడానికి ఓ ప్రముఖుడు, అమెరికా సంస్థలు ముందుకొచ్చాయి. అయినా పుస్తకాలు, తెలుగు భాషపై ఉన్న మమకారంతో ఆయన అందుకు సమ్మతించలేదు. భావి తరాల వారికి పనికొచ్చేలా ఆ పుస్తకాలను కంప్యూటరీకరించే యజ్ఞాన్ని కొన్నాళ్లుగా సాగిస్తున్నారు.
చలసాని విప్లవ నేతగాను, రచయితగాను, సంకలనకర్తగానే చాలామందికి తెలుసు. కానీ ఆయనో హాస్యప్రియుడని ఎంతమందికి తెలుసు? నగరంలోని క్రియేటివ్ కామెడీ క్లబ్ నిర్వహించే నెలవారీ కార్యక్రమాలకు హాజరయ్యే వారు.
ప్రముఖుల సంతాపం
సాక్షి,హైదరాబాద్: విరసం వ్యవస్థాపకులు చలసాని ప్రసాద్ మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ విపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, సీపీఐ నేత కె.నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి పి.మధు, పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వై.వెంకటేశ్వరరావు, ‘సాహితీ స్రవంతి’ అధ్యక్షుడు తెలకపల్లి రవి, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షుడు ఆచార్య జయధీర్ తిరుమలరావు తదితరులు సంతాపం ప్రకటించారు.