శశికళపై తిరుగుబాటు.. వేటుకు రంగం సిద్ధం?
చెన్నై: తమిళనాట రాజకీయాలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. క్షణక్షణం మారుతున్న సమీకరణాలతో ఊహకందనంత వేగంగా మారుతున్నాయి. నిన్నటివరకు అన్నాడీఎంకేపై శశికళ వర్గానికి తిరుగులేని ఆధిపత్యం. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుపాలైనా.. కటకటాల నుంచి ఆమె మంత్రాంగం నడిపించిన పరిస్థితి. కానీ ఇప్పుడంతా తలకిందులైంది. శశికళ పేరు ఎత్తితేనే అధికార అన్నాడీఎంకే నేతలు మండిపడుతున్నారు. సీనియర్ మంత్రులు ఏకంగా తిరుగుబాటు బావుటా ఎగురవేశారని సమాచారం. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి చిన్నమ్మ శశికళకు ఉద్వాసన పలికేందుకు వేగంగా పావులు కదుతుపున్నట్టు తెలుస్తోంది.
తాజాగా తెరపైకి వచ్చిన అన్నాడీఎంకే, పన్నీర్ సెల్వం (ఓపీఎస్) వర్గాల విలీనం వెనుక ఉన్న అసలు మంత్రాంగం ఇదేనని తాజాగా ప్రచారం జోరందుకుంది. ఒకప్పుడు శశికళకు వీరవిధేయుడిగా ఉన్న సీఎం ఎడపాటి పళనిస్వామి (ఈపీఎస్) తాజాగా ఓపీఎస్‌తో చేతులు కలిపేందుకు ముందుకొచ్చారు. ఇందుకోసం అర్ధరాత్రి వరకు సీనియర్ మంత్రులు, ఓపీఎస్ నేతలు చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. అయితే, ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు చేతులు కలిపి.. మన్నార్‌గుడి మాఫియాను పూర్తిగా అన్నాడీఎంకే నుంచి బయటకు తరిమేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.
ఓపీఎస్-ఈపీఎస్ వర్గాల పునరేకీకరణ వెనుక ఉన్న అసలు మంత్రాంగం ఇదేనని సమాచారం. ఇప్పటికే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవి నుంచి చిన్నమ్మ శశికళను తప్పుకోవాలని ఆ పార్టీ స్పష్టం చేసినట్టు సమాచారం. శశికళ తప్పుకోకుంటే తాము పదవికి రాజీనామా చేస్తామని ఇప్పటికే సీనియర్ మంత్రులు అల్టిమేటం ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోవైపు శశికళ కొడుకు, ప్రస్తుతం పార్టీని నడిపిస్తున్న దినకరన్ కూడా అరెస్టయ్యే అవకాశముందని తెలుస్తోంది. రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘం అధికారికి రూ. 50 కోట్లు లంచం ఇచ్చేందుకు ప్రయత్నించి దినకరన్ మధ్యవర్తి సుఖేష్ అరెస్టైన సంగతి తెలిసిందే.
ఈ కేసులో దినకరన్‌ను కూడా అరెస్టు చేయనున్నారని సమాచారం. ఇప్పటికే ఆయన పలు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఢిల్లీ క్రైబ్రాంచ్ పోలీసులు చెన్నై చేరుకొని.. ఈ కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో సోమవారం బెంగళూరు పరప్పన అగ్రహారం జైలులో శశికళను కలువకుండానే దినకరన్ వెనుదిరిగారు. మరోవైపు ఇన్నాళ్లు తన గుప్పిట్లో ఉన్న అన్నాడీఎంకేలో తనకు వ్యతిరేకంగా తిరుగుబావుటా ఎగురవేస్తుండటంతో శశికళ తీవ్రంగా ఆందోళనకు గురవుతున్నట్టు తెలుస్తోంది. పార్టీ పూర్తిగా చిన్నమ్మ అదుపు దాటిపోయిందని సన్నిహితవర్గాలు ఆమెకు చేరవేసినట్టు సమాచారం.