'పీకే' సినిమాపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు
న్యూఢిల్లీ: బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన వివాదస్పద 'పీకే' (ప్యార్కే) సినిమాపై సుప్రీం కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనలు కళాకారులకు గొప్ప ఊరట కలిగించాయి. ఈ సినిమాలో అమీర్ ఖాన్ సగ్నత్వం ప్రదర్శించారని సినిమా నిర్మాతపై దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. కళలు, వినోదానికి సంబంధించిన విషయాలలో జోక్యం పనికిరాదని కోర్టు చెప్పింది. ఇష్టంలేకపోతే సినిమా చూడవద్దని అత్యున్నత న్యాయస్థానం పిటిషనర్ కు సలహా ఇచ్చింది. అంతేకాకుండా ఇటువంటి విషయాలలో మతపరమైన అంశాలు తీసుకురావద్దని కూడా సుప్రీం కోర్టు పిటిషనర్కు సలహా ఇచ్చింది. సినిమా విడుదలపై ఆంక్షలు విధిస్తే నిర్మాత హక్కులకు భంగం కలిగించినట్లు అవుతుందని కోర్టు తెలిపింది.
రాజ్కుమార్ హిరానీ దర్శకత్వంలో రూపొందిన 'పీకే' విడుదలకు ముందే వివాదాలు సృష్టించిన విషయం తెలిసిందే. సినిమా యూనిట్ వారు ఇటీవల విడుదల చేసి పీకే పోస్టర్పై అమీర్ ఖాన్ ఒంటిమీద నూలు పోగులేదు. పూర్తినగ్నంగా ఉన్నారు. రైలు పట్టాలపై నిలబడి కోపంగా చూస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్లో అమీర్ ఖాన్ ఒక పాత టేప్ రికార్డర్ను మాత్రమే అడ్డుపెట్టుకున్నారు. ఈ పోస్టర్పై దేశమంతటా విమర్శలు వెల్లువెత్తాయి. పార్లమెంటు సభ్యులు కూడా విమర్శించారు.
దీనిపై అమీర్ ఖాన్ స్పందిస్తూ, పబ్లిసిటీ కోసం ఆ పోస్టర్ను విడుదల చేయలేదని చెప్పారు. సినిమా చూస్తే ఆ పోస్టర్ ఏమిటో అర్థం అవుతుందన్నారు. దీనిని కళాత్మకంగా రూపొందించామేగానీ, ఇందులో అశ్లీలత ఏమీ లేదని తెలిపారు.