పూర్వీకుల ఆత్మలతో మాట్లాడుతా
► చేతబడి, వశీకరణ విద్యలతో భుక్తి
► చెక్కపెట్టెలో యువతి మృతదేహం.. పెరంబలూరులో దారుణం
► నరబలి అనుమానంతో మంత్రవాది కార్తికేయన్, భార్య సహా నలుగురు అరెస్ట్
► మంత్రులు, మాజీ మంత్రులు, బడా రాజకీయనేతలూ పూజలు చేయించుకున్నట్లు విచారణలో వెల్లడి
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘మీ పూర్వీకుల ఆత్మలతో మాట్లాడతా, వారు ఆశపడిన కోర్కెలు తీరకుండానే మరణించి ఉన్నట్లయితే వారి నుంచే తెలుసుకుంటా...పరిహారాలు చేయించాలని బంధువుల నుంచి సొమ్ము తీసుకుంటా...’ పెరంబలూరులో పోలీసులకు పట్టుబడిన ఒక మంత్రవాది చెప్పిన భయానక మాటలు ఇవి.
మానవుని బలహీనతలే అతనికి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. మూఢనమ్మకాలే పొట్ట నింపుతున్నాయి. నరబలులు చేసే మాంత్రికుడిగా అనుమానిస్తూ కార్తికేయన్ అనే మంత్రవాదిని, అతని భార్య నశీమా అలియాస్ దీపిక, ఇద్దరు సహచరులను పోలీసులు శుక్రవారం రాత్రి అరెస్ట్ చేశారు. కార్తికేయన్ వద్దకు మంత్రపూజల నిమిత్తం తమిళనాడు, పుదుచ్చేరీలకు చెందిన మంత్రులు, మాజీ మంత్రులు, బడా రాజకీయనేతలు వస్తున్నట్లు విచారణలో తేలింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి...
తమిళనాడులోని పెరంబలూరు మున్సిపాలిటీ కార్యాలయానికి వెళ్లే దారిలోని ఎంఎంనగర్‌లో శెట్టికుళం గ్రామానికి చెందిన శరవణన్‌కు రెండస్థుల భవనం ఉంది. ఈ భవనంలో పెరంబలూరు కల్యాణనగర్‌కు చెందిన కార్తికేయన్ (32) నెలకు రూ.20వేల అద్దె చెల్లిస్తూ గత మూడేళ్లుగా కాపురం ఉంటున్నాడు. కార్తికేయన్‌తోపాటు ఆయన భార్య, ఇద్దరు పనివాళ్లు కూడా అక్కడే నివసిస్తున్నారు. అతని ఇంటి నుంచి దుర్వాసన రావడంతో గుర్తు తెలియని వ్యక్తి శుక్రవారం సాయంత్రం పోలీసులకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడు. పెరంబలూరు ఎస్పీ సోనాల్ చంద్ర నేతృతంలో పోలీసు బృందం అక్కడికి చేరుకుని ఇంటిని తనిఖీ చేయగా, ఒక గదిలో రెండు అడుగుల వెడల్పు, ఆరు అడుగుల పొడవుతో తెల్లని వస్త్రంతో చుట్టబడిబడి ఉన్న శవపేటికలో కుళ్లిపోయిన స్థితిలో యువతి శవం ఉంది. శవపేటిక పక్కనే సుమారు 20కి పైగా మానవ పుర్రెలు, పెద్ద సంఖ్యలో ఎముకలు పడి ఉన్నాయి. ఇతర గదుల్లో పూజసామగ్రి చిందరవందరగా పడి ఉంది.
ఇంటిలో కాపురం ఉంటున్న కార్తికేయన్‌ను శుక్రవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా, రూ.5వేలు చెల్లించి చెన్నై నుంచి ఈ శవాన్ని తెచ్చుకున్నానని, దెయ్యాలతో సంబంధం ఉండే అఘోరీ పూజలు చేస్తూ మంత్రవాదిగా జీవిస్తున్నానని తెలిపాడు. అర్ధరాత్రి వేళల్లో పూజలు నిర్వహించి తన వద్దకు వచ్చే వ్యక్తుల కోర్కెమేరకు గతించిన వారి పూర్వీకుల ఆత్మలతో సంభాషిస్తానని, చనిపోయిన వారి కోర్కెలను అడిగి తెలుసుకుంటానని చెప్పాడు. కోర్కెలు తీరకుండానే ప్రాణాలు విడిచిన వారి ఆత్మలు చెప్పిన వివరాలను బంధువుల దృష్టికి తీసుకెళ్లి పరిహారం చేయిస్తానని చెప్పి డబ్బులు పుచ్చుకుంటానని పోలీసులకు వివరించాడు. అంతేగాక చేతబడి, పురుషులు, స్త్రీల వశీకరణం తదితర పూజలు కూడా నిర్వహిస్తానని అన్నాడు.
కార్తికేయన్ చెప్పిన వివరాలను నమోదు చేసుకున్న అనంతరం ఎస్పీ స్వర్ణలత క్లూస్‌టీమ్‌ను పిలిపించారు. శవపేటికలో ఉన్న మృతదేహానికి పోస్టుమార్టం చేసి ఉందని క్లూస్‌టీమ్ తెలిపారు. రీపోస్టుమార్టం నిమిత్తం యువతి మృతదేహాన్ని పెరంబలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కార్తికేయన్, ఆయన భార్య నశీమాభాను, సుమారు 40 ఏళ్ల వయస్సున్న వారి సహచరులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంట్లో మంత్రతంత్రాలు చేయడం, ఒక చిన్నారిని నరబలి ఇచ్చాడనే ఆరోపణపై కార్తికేయన్‌ను పోలీసులు అరెస్ట్ చేసినా ఇటీవలే బెయిల్‌పై బైటకు వచ్చిరాగానే తన వైఖరిని మార్చుకోకుండా అదే వృత్తిని కొనసాగించడంపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.