బినామీ కనుకే ‘నారాయణ’ను రక్షిస్తున్నారా?
చంద్రబాబుకు ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ప్రశ్న
⇒ టెన్త్ ప్రశ్నపత్రాల లీకేజీని ప్రభుత్వం కప్పిపుచ్చుతోంది...
⇒ ప్రాథమిక సాక్ష్యాధారాలున్నా సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించరు?
⇒ యాజమాన్యాన్ని వదిలేసి చిరుద్యోగులపై చర్యలేమిటి?
సాక్షి, అమరావతి: పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారాన్ని కప్పిపుచ్చుతూ చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసును తప్పుదోవ పట్టిస్తోందని ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన శాసనసభ లాబీల్లోని తన ఛాంబర్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రశ్నపత్రం లీకేజీ జరిగిన పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకునే బదులుగా చిరుద్యోగులను బలి చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. చంద్రబాబుకు నారాయణ బినామీ అన్న ప్రచారం జరుగుతోందని, అందుకే ప్రభుత్వం నారాయణను కాపాడుతోందా అన్న అనుమానాలు న్నాయని ఆయన చెప్పారు. ప్రాథమిక సాక్ష్యాధారా లున్నా ఈ లీకేజీ వ్యవహారంపై సీబీఐ విచారణను ఎందుకు జరిపించడం లేదని జగన్ ప్రశ్నించారు. వివరాలు ఆయన మాటల్లోనే.....
‘‘ఈ ఏడాది ఆరున్నర లక్షల మంది పరీక్షలు రాస్తున్న పదోతరగతి ప్రశ్నపత్రాలు లీక్ అయ్యాయి. కానీ ప్రభుత్వం ఏ మాత్రం లెక్కలేనట్లుగా వ్యవహరి స్తోంది. ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని స్పష్టంగా తెలిసి పోయింది. ప్రాథమిక సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ఇచ్చిన రోజు వారీ నివేదికను శాసనసభలో చూపిస్తూ ప్రస్తావించే ప్రయత్నం చేశాం. ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ ప్రభుత్వానికి పంపిన నివేదికలో.. ‘నెల్లూరు జిల్లా విద్యా శాఖాధికారి ప్రశ్నపత్రం లీకయినట్లుగా పేర్కొన్నారు’ అని ప్రస్తావించారు. ప్రశ్నపత్రం 4,238వ కేంద్రం, నారాయణ హైస్కూలు– నెల్లూరు నుంచి లీకైనట్లు తెలిపారు.
అంతే కాదు, ఆ కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటల్ ఆఫీసర్, ఇన్విజిలేటర్‌పై విచారణకు ఆదేశించామని టెలీకాన్ఫ రెన్స్‌లో వెల్లడించినట్లు పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్ కూడా ఫైల్ చేస్తున్నామని చెప్పారు. అయినా ప్రభు త్వం అంగీకరించలేదు. మేం అసెంబ్లీలో ఈ అంశం పై గొడవ చేసి, నివేదిక ప్రతిని చూపించాక మంత్రి గంటా ఢిల్లీ నుంచి విలేకరుల సమావేశంలో మా ట్లాడారు. లీకేజికి వాడిన సెల్ ఫోన్ ఒక అటెండర్‌దని తేల్చినట్లు వివరించారు.
నేనడుగుతున్నది ఒక్కటే.. ఆ అటెండరు ఏ స్కూలు యాజమాన్యానికి చెందిన వాడు? ఆ సెల్‌ఫోను ఏ యాజమాన్యానిది? అసలు అటెండర్ ఇలాంటి పని ఎందుకు చేస్తాడు? అటెండ ర్‌కు ఉన్న ఆసక్తి ఏమిటి? తన ఉద్యోగాన్ని పణంగా పెట్టి అతనెందుకు రిస్క్ తీసుకుంటాడు? యాజమా న్యాలు చెప్పాయి కాబట్టి, సెల్‌ఫోన్లు పరీక్షా కేంద్రం లోకి అనుమతించారు కాబట్టి దాని సాయంతో ప్రశ్నపత్రం ఫొటో తీసి వాట్సాప్‌లో మిగిలిన వీరి ప్రతినిధులకు ఆ డేటాను పంపించి ఉంటాడు. వారు ఆ ప్రశ్నలకు సమాధానాలు రూపొందించి పంపార నేది స్పష్టంగా తెలిసిపోతోంది.
ఫలితాలను తారుమారు చేసే కార్యక్రమం కాదా?
ఇలా చేయడం అంటే యాజమాన్యాలు పరీక్షా ఫలితా లను తారుమారు చేయడమే కదా? రాత్రింబవళ్లు కష్టపడిన విద్యార్థులకు ర్యాంకులు రావు. ఇంత అడ్డ గోలుగా వ్యవహారం జరిగింది. ఒక్క నెల్లూరులోనే కాదు, మడకశిరలో కూడా పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో హిందూపురంలోని నారాయణ పాఠశాలకు చెందిన ముత్యాలును అదుపులోకి తీసుకున్నారు. (ఫోటోలు చూపుతూ) చూడండి ఇది పోలీసు స్టేషను.. ఇందులో ముత్యాలు స్టేషన్ దగ్గర ఉన్న దృశ్యం కనిపిస్తోంది. ముత్యాలును అదుపులోకి తీసుకుని తరువాత వదలి వేశారు. తెలుగు, హిందీ, సైన్సు పరీక్షా పత్రాలు లీక్ అయినట్లు మనకు తెలిశాయని, జరుగుతున్నది వాస్తవమేనని ఏకంగా ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కూడా నివేదిక ఇచ్చారు.
నారాయణ, చంద్రబాబుకు బినామీ అంటున్నారు!
నారాయణ విద్యా సంస్థల అధినేత, రాష్ట్ర మంత్రి అయిన నారాయణ సీఎం చంద్రబాబుకు బినామీ అని, వైద్య కళాశాలలో ఆయనకు భాగస్వామ్యం ఉందనే ప్రచారం బలంగా ఉంది. నారాయణ, విద్యా మంత్రి గంటా శ్రీనివాసరావుకు వియ్యంకుడనే విషయం అందరికీ తెలుసు. అసలు నారాయణను ఎందుకు మంత్రి చేశారో తెలియదు. నారాయణకు, చంద్రబాబుకు ఉన్న సన్నిహిత సంబంధాలు ఎలాంటివి అంటే.. ఆయన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ గా లేకపోయినా బాబు ఏకంగా మంత్రిని చేశారు. ఆ తరువాతనే ఎమ్మెల్సీ పదవిని ఇచ్చారు. బాబుకు నారాయణ బినామీ అనే ప్రచారం ఉంది. ఎవరినడి గినా ఇదే చెబుతున్నారు.
అంతా కలిసి నారాయణను ఇంత దారుణంగా రక్షిస్తూ విద్యావ్యవస్థను దిగజారు స్తున్నారు. ఆరున్నర లక్షల మంది విద్యార్థులు, వారి కుటుంబాలకు సంబంధించిన ఇంత ముఖ్యమైన ఉదంతంపై తక్షణం స్పందించాల్సిన సీఎం 30వ తేదీ తరువాత సభలో ప్రకటన చేస్తారట. అప్పటికి పరీక్షలన్నీ పూర్తిగా అయిపోతాయి. ఇదెలా ఉందంటే.. ఇల్లు తగుల బడుతూ ఉంటే ఫైర్‌ఇంజన్ తక్షణమే రాదు, ఇల్లంతా తగులబడిన తరువాత వస్తుందన్నట్లుగా ఉంది. ఈ విషయంలో యాజమాన్యాలను వదలి వేసి అటెండర్లు, ఇన్విజిలేటర్లు వంటి చిన్న ప్రాణుల మీద క్రమశిక్షణా చర్యలు తీసుకుని మొత్తం కేసును తప్పు దోవ పట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు.
యాజమాన్యాలపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?
లీకేజీ చేయాల్సిన అవసరం చిరుద్యోగులకు ఏముంటుంది అని ప్రభుత్వం ఆలోచించడం లేదు. ఈ వ్యవహారాన్ని మొత్తం యాజమాన్యాలే నడిపిస్తున్నాయి. అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి ఎందుకు అనిపించడం లేదు? అటెండర్ల మీదనో ఇన్విజిలేటర్ల మీదనో కేసులు పెట్టి వ్యవహారాన్నంతా మూసేసే కార్యక్రమం చేస్తున్నారు. ఇలా చేస్తే విద్యా వ్యవస్థ బాగుపడుతుందా? ఫలితాలన్నీ ప్రకటించేశాక నారాయణ పాఠశాలకు 1 మొదలు 100 ర్యాంకులు వచ్చేశాక అపుడు దయదలచి స్టేట్‌మెంట్ ఇస్తానని ముఖ్యమంత్రి చెప్పడం చూస్తే.... రోమ్ నగరం తగులబడి పోతోంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయిస్తున్నట్లుగా ఉంది. తగులబడి పోతున్న ఈ అంశంపై చర్చ పెడితే ఒక సానుకూల సందేశం ప్రజల్లోకి వెళుతుందని మేం ఎంత చెప్పినా వినలేదు.
గతంలో మంత్రులు రాజీనామాలు చేశారు
గతంలో ప్రశ్నపత్రాలు లీకైనపుడు అప్పటి మంత్రులు రాజీనామాలు చేసిన సంఘటనలున్నాయి. అంతే కాదు, ముఖ్యమంత్రులు సీబీఐ విచారణకు కూడా ఆదేశించారు. ఇపుడెందుకు జరుగడం లేదు? చంద్రబాబుకు ఈ వ్యవహారంలోని వారిపై ఆసక్తి లేకపోతే ఎందుకు మంత్రులను బర్తరఫ్ చేయరు? సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించరు? మేం ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చాం, 344 నిబంధన కింద స్వల్ప వ్యవధి చర్చనూ కోరాం. ఆ సమయంలో సభలో ముఖ్యమంత్రి లేరు. ఇద్దరు మంత్రులూ లేరు. నారాయణ మాత్రం కొంత సేపు ఉండి వెళ్లి పోయారు.
విచారణలు ఫార్సుగా మారాయి.. దేవుడే రాష్ట్రాన్ని కాపాడాలి
రాష్ట్రంలో అనేక ఉదంతాలపై వేసిన విచారణలు ఒక ఫార్సుగా తయారయ్యాయి. పుష్కరాల్లో మరణాలపై ఓ విచారణ కమిషన్‌ను వేశారు. అది కూడా సిటింగ్ జడ్జి ఆధ్వర్యంలో వేయలేదు. వీళ్లకు కావల్సిన మనిషితో రిటైర్డు జడ్జితో వేశారు. అది ఏమైందో ఇప్పటి వరకూ తేలలేదు. ఎందుకు తేల్చరు అంటే ఇందులో చంద్రబాబే దోషి అని తేలుతుంది కాబట్టి. అగ్రిగోల్డ్ కుంభకోణం విషయంలోనూ అంతే. హైకోర్టు సిటింగ్ న్యాయమూర్తి ఆధ్వర్యంలో సీబీఐ విచారణ జరిపించాలని మేం డిమాండ్ చేస్తే దాన్ని పట్టించుకోలేదు. లీకేజి వ్యవహారాన్ని కూడా సీబీఐకి అప్పగిస్తేనే లోతు పాతులు తెలుస్తాయన్నాం. అసలు ఈ అంశం చర్చకే రానివ్వకుండా దారుణంగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ ఆంధ్రప్రదేశ్‌ను ఆ దేవుడే కాపాడాలి.... (సభలో ఉండి ఈ విషయం చెప్పవచ్చు కదా అని జర్నలిస్టులు ప్రశ్నించినపుడు) మీరే చూస్తున్నారుగా... అసలు మమ్మల్ని మాట్లాడినిస్తే కదా!
సీబీఐ విచారణ ఎందుకు జరిపించరు?
ఇన్ని ప్రాథమిక సాక్ష్యాధారాలున్నా సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించరు? సీబీఐ విచారణకు ఆదేశిస్తేనే కదా వారు లోతుల్లోకి వెళ్లి సెల్‌ఫోన్ల నుంచి ఎవరెవరికి మెసేజ్‌లు పెట్టారు, వీళ్లంతా ఎన్ని కేంద్రాల్లో ఇలా చేశారు అనేది తెలిసేది?