పోస్టల్‌ బ్యాలెట్‌కు.. ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం! | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్‌కు.. ఇబ్బందులు తప్పవనే అభిప్రాయం!

Published Sun, Nov 12 2023 12:00 AM

- - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచడంతో పాటు అర్హులైన ప్రతిఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో కేంద్ర ఎ న్నికల సంఘం కొత్తగా ప్రవేశపెట్టిన పోస్టల్‌ బ్యాలెట్‌ కు జిల్లాలో స్పందన అంతంతగానే కనిపించింది. పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లలేని ఓటర్ల కు సంబంధించి అందిన దరఖాస్తులను పరిశీలి స్తే ఈ విషయం స్పష్టమవుతుంది. పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగంపై అధికార యంత్రాంగం తగు ప్రచారం కల్పించకపోవడం, దరఖాస్తు విధానంపై అవగాహన లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఈ నెల 30న నిర్వహించే ఎన్నికల్లో ఆయా వర్గాల వారు పోలింగ్‌ కేంద్రాలకు వచ్చి ఓటు వినియోగం కోసం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి తప్పేలా కనిపించడం లేదు.

పోలింగ్‌ శాతం పెంచడమే లక్ష్యంగా..
ఓటు వినియోగంపై అధికారులు ఎన్ని చర్యలు చేపట్టినా పోలింగ్‌ శాతం 70 నుంచి 80శాతానికి మించి దాటడం లేదు. ఓటు వేసేందుకు గాను ఆయా కేంద్రాలకు వచ్చేందుకు వృద్ధులు, వైకల్యంతో దివ్యాంగులు ఎక్కువగా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి.

ఈ క్రమంలో వారితో పాటు అత్యవసరమైన సేవలందించే వైద్యారోగ్య, విద్యుత్‌, రైల్వే, ఆర్టీసీ, పౌరసరఫరాలు, బీఎస్‌ఎన్‌ఎల్‌, ఫైర్‌,ఎయిర్‌పోర్టు అధార్టీ ఆఫ్‌ ఇండియా, ఫుడ్‌ కార్పొరేషన్‌, పీఐబీ, దూరదర్శన్‌, ఆలిండియారేడియా ఉద్యోగులు, మీడియా ప్రతినిధులకు ఇంటి నుంచే ఓటు వేసేలా సీఈసీ పోస్టల్‌ బ్యాలెట్‌ సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. తద్వారా ఓటింగ్‌ శాతం పెంచవచ్చని భావించింది. ఆయా వర్గాలకు దీనిపై అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా తగు ప్రచారం కల్పించాలని ఎన్నికల అధికారులను ఆదేశించింది.

స్పందన రాలే..
ఈసీ ఆదేశాలు బాగానే ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వినియోగంపై అవగాహన క ల్పించడంలో యంత్రాంగం అంతగా దృష్టిసారించలేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. జిల్లా వ్యాప్తంగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఫాం–12డీ కోసం కేవలం 727 మంది మాత్రమే దరఖాస్తు చేసుకోవడం నిదర్శనంగా నిలుస్తోంది.

ఈ అవకాశాన్ని వినియోగించుకో వాల్సిన వృద్ధులు, దివ్యాంగులుతో పాటు ఈసీ నిర్దేశించిన ఆయా కేటగిరీల వారు వేలల్లో ఉన్నపటికీ దరఖాస్తులు వందల్లో రావడం గమనార్హం. రిటర్నింగ్‌, అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ అఽధికారులు అవగా హన కల్పించేలా ఎలాంటి చర్యలు తీసుకోకపోవ డం, క్షేత్రస్థాయిలో ఆయావర్గాల వారు పోస్టల్‌ బ్యా లెట్‌కు దరఖాస్తు చేసుకునేలా చూడాల్సిన బీఎల్‌వోలు తమకేం సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ఓటు వినియోగానికి వృద్ధులు, దివ్యాంగులు మరోసారి ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఈసీ ఇంటి వద్ద నుంచే ఓటేసే అవకాశం కల్పించిన దాన్ని తెలియజేయాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో వారు పోలింగ్‌ కేంద్రాలకు వెళ్లక తప్పని దుస్థితి. ఫలితంగా ఆయా వర్గాలకు ఇబ్బందులు పునరావృతమయ్యే అవకాశం లేకపోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇవి చదవండి: విభిన్న తీర్పు! ప్రస్తుత ఎన్నికల ట్రెండ్‌పై సర్వత్రా ఆరా..

Advertisement
Advertisement