12వ తేదీలోగా రండి... | Sakshi
Sakshi News home page

12వ తేదీలోగా రండి...

Published Thu, May 9 2024 12:00 AM

12వ త

నిర్మల్‌ఖిల్లా: ప్రస్తుతం విద్యా సంస్థలకు వేసవికాలం సెలవులు కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ కూడా జరగనుంది. అయితే వేసవి సెలవుల్లో విద్యార్థులు, ఉద్యోగులు విహారయాత్రలు, తీర్థయాత్రలకు వెళ్లడానికి ప్రణాళికలు వేసుకుంటారు. ఉద్యోగ ఉపాధ్యాయులు శీతల ప్రాంతాలైన ఊటీ, గోవా, కొడైకెనాల్‌, జమ్మూ తదితర ప్రాంతాలకు వెళ్తున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 13న సోమవారం రోజున లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ జరగనుంది. అయితే ఇప్పటికే జిల్లా నుండి చాలామంది విహారయాత్రలకు కుటుంబ సమేతంగా వెళ్లారు. అయితే పోలింగ్‌ రోజు కంటే ముందే స్వస్థలాలకు చేరుకుని ఓటుహక్కు వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారులు పిలుపునిస్తున్నారు. ఇదే అంశంపై మంగళవారం స్వీప్‌ ఆధ్వర్యంలో 5కే రన్‌ కూడా నిర్వహించారు.

విహారయాత్రల నుండి తిరుగుముఖం..

సెలవులను సంతోషంగా గడిపిన వారంతా పోలింగ్‌ రోజు కంటే ముందే ఇంటికి చేరుకునేలా ప్లాన్‌ చేసుకున్నారు. ఓటుహక్కు తప్పనిసరిగా వినియోగించుకోవాలని పోలింగ్‌ రోజు కల్లా స్వస్థలాలకు తరలిరానున్నారు. జిల్లా నుండి వేసవి సెలవుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లినవారు, ఉపాధి కోసం హైదరాబాద్‌, వరంగల్‌, ముంబై, ఢిల్లీ, గుజరాత్‌ తదితర ప్రాంతాల్లో స్థిరపడ్డ వారు కూడా ఓటుహక్కును వినియోగించుకోవడం కోసం స్వస్థలాలకు చేరుకుంటున్నారు. గతంలో కంటే ఈసారి ఓటింగ్‌ శాతం పెంచేందుకు జిల్లా ఎన్నికల అధికారులు కూడా ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. ఎన్నికల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కూడా అత్యధిక శాతం పోలింగ్‌ జరిగేలా అవగాహన కల్పిస్తున్నారు ఎన్నికల మహాక్రతువులో ఓటుహక్కు అత్యంత కీలకమని ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నారు.

ఈ ఉదంతం స్ఫూర్తివంతం

ఇంట్లో నుంచి కదల్లేని స్థితిలో ఉన్న వ్యక్తి ఓట్‌ ఫ్రమ్‌ హోమ్‌ ద్వారా ఓటుహక్కు వినియోగించుకున్న మరుసటి రోజే మృతి చెందిన ఘటన నిర్మల్‌ రూరల్‌ మండలంలోని వెంగ్వాపేటలో చోటు చేసుకుంది. ఈ నెల 3న హనుమంతరావు (68) ఎన్నికల అధికారుల సమక్షంలో ఇంటి వద్దనే ఓటు వేశారు. అనంతరం ఆరోగ్య పరిస్థితి విషమించి 4న తెల్లవారు జామున కన్నుమూశాడు. ఓటు వేయడంలో అలసత్వం ప్రదర్శించే పలువురిలో స్ఫూర్తిని రగిలించింది.

ఓటు హక్కు తప్పక వినియోగించుకోవాలి

ఓటింగ్‌ శాతం పెంచాలంటున్న ఎన్నికల అధికారులు

పోలింగ్‌కు ముందే వచ్చేస్తాం..

ఏటా వేసవి సెలవుల్లో నాలుగైదు కుటుంబాల మిత్రులంతా కలిసి విజ్ఞాన విహార యాత్రలకు వెళ్తుంటాం. ఈసారి నార్త్‌ ఇండియాలోని జమ్మూ తదితర శీతల కేంద్రాలను విహార స్థలాలను సందర్శించాం. మే 13న ఎన్నికలు ఉండడంతో అంతకంటే ముందుగానే టూర్‌ ముగిసేలా ప్లాన్‌ చేసుకున్నాం.

– స్వామిరెడ్డి,

ప్రభుత్వ ఉపాధ్యాయుడు, నిర్మల్‌

12వ తేదీలోగా రండి...
1/1

12వ తేదీలోగా రండి...

Advertisement
 
Advertisement
 
Advertisement