టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్‌ల్లో భాగంగా నిన్న (మే 30) పసికూనల మధ్య సమరం జరిగింది. ట్రినిడాడ్ వేదికగా పపువా న్యూ గినియా, నమీబియా జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో నమీబియా డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 3 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది.
తొలుత బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. నమీబియా బౌలర్లు మూకుమ్మడిగా సత్తా చాటి గినియాను కట్టడి చేశారు. ట్రంపెల్మన్, వీస్. టంగెని లుంగనమెనీ తలో 2 వికెట్లు పడగొట్టగా..బెర్నాల్డ్ స్కోల్జ్ అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి ఓ వికెట్ పడగొట్టాడు. గినియా ఇన్నింగ్స్‌లో సెసె బౌ (29) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన నమీబియా.. తొలుత గినియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో (9/3) ఇబ్బందులు ఎదుర్కొంది. ఇదే సమయంలో మ్యాచ్‌కు వరుణుడు అడ్డుతగిలాడు. దీంతో అంపైర్లు డక్‌వర్త్ లూయిస్ పద్దతిన నమీబియాకు 93 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు.
ఫ్రైలింక్ (36), జీన్ పియెర్ కొట్జీ (30) బాధ్యతాయుతంగా ఆడటంతో నమీబియా అతి కష్టం మీద 16.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి సవరించిన లక్ష్యాన్ని చేరుకుంది. గినియా బౌలర్లలో అస్సద్ వలా, అలెయ్ నావ్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. కబువా మొరియా, నార్మన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. నిన్ననే జరగాల్సిన మరో మూడు వార్మప్ మ్యాచ్‌లు వర్షం కారణంగా తుడిచిపెట్టుకుపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment