ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ ఫీల్డర్ అవతారమెత్తాడు. నమీబియాతో జరిగిన టీ20 వరల్డ్‌కప్ 2024 వార్మప్ మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. రెగ్యులర్ ఆటగాళ్లు అందుబాటులో లేకపోవడంతో బెయిలీ బరిలోకి దిగాల్సి వచ్చింది. ఐపీఎల్ విధుల కారణంగా ఆరుగురు ఆసీస్ ఆటగాళ్లు (కమిన్స్, స్టార్క్, హెడ్, మ్యాక్స్‌వెల్, గ్రీన్, స్టోయినిస్) మ్యాచ్ సమయానికి అందుబాటులోకి రాలేకపోయారు.
అతి త్వరలో వీరు జట్టుతో కలుస్తారని సమాచారం. నబీమియాతో మ్యాచ్‌లో బెయిలీతో పాటు ఆసీస్ ఫీల్డింగ్ కోచ్ ఆండ్రీ బోరోవెక్ కూడా బరిలోకి దిగాల్సి వచ్చింది. వీరిద్దరే కాక ఆసీస్ బ్యాటింగ్ కోచ్ బ్రాడ్ హాడ్జ్, హెడ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్ కూడా కాసేపు ఫీల్డింగ్ చేశారు. మిచెల్ మార్ష్, హాజిల్‌వుడ్ విరామం తీసుకున్న సమయంలో వీరు బరిలోకి దిగారు.
ఇదిలా ఉంటే, ఆటగాళ్ల కొరత ఉన్నా నమీబియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన నమీబియా నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేయగా.. ఆస్ట్రేలియా కేవలం 10 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆసీస్ తరఫున తొలుత హాజిల్‌వుడ్.. ఆతర్వాత డేవిడ్ వార్నర్ రెచ్చిపోయారు.
హాజిల్‌వుడ్ నాలుగు ఓవర్లు బౌల్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టగా.. వార్నర్ 21 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో అజేయమైన 54 పరుగులు చేశాడు. హాజిల్‌వుడ్ తన నాలుగు ఓవర్ల స్పెల్‌లో ఏకంగా మూడు మెయిడిన్ ఓవర్లు వేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment