ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ కేసులో టెస్కాబ్ జీఎం, ఆమె భర్త, కుమారుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
24 శాతం వడ్డీ ఇస్తామని ఆశచూపి రూ. కోట్లలో డిపాజిట్ చేయించుకున్న కుటుంబం
కొన్ని నెలలుగా వడ్డీ చెల్లింపులు బంద్.. ‘ఐపీ’ పెట్టి పరారీ
మొత్తం బాధితుల సంఖ్య 532..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌లో (టెస్కాబ్) జనరల్ మేనేజర్‌గా పనిచేస్తూ శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ ముసుగులో రూ.200 కోట్ల మేర డిపాజిట్లు వసూలు చేసి మోసానికి పాల్పడిన నిమ్మగడ్డ వాణీబాల, ఆమె భర్త, కుమారుడిని హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ఈ సంస్థ చేతిలో మోసపోయిన 532 మందిలో 147 మంది టెస్కాబ్ ఉద్యోగులేనని డీసీపీ ఎన్.శ్వేత గురువారం తెలిపారు.వాణీబాలతోపాటు ఆమె భర్త మేక నేతాజీ, కుమారుడు మేక శ్రీహర్షలను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.
అధిక వడ్డీ ఆశచూపి..: ఏపీలోని ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందిన మేక నేతాజీ 1985లో హైదరాబాద్‌లోని తిలక్ రోడ్‌లో శ్రీ ప్రియాంక ఫైనాన్స్ అండ్ చిట్‌ఫండ్స్ పేరుతో సంస్థను ఏర్పాటు చేశారు. ఇతర వ్యాపారాలు కూడా చేసిన ఆయన.. వాటి నిర్వహణ కోసం ప్రియాంక సంస్థ ద్వారా డిపాజిట్లు సేకరించడం మొదలుపెట్టారు. తమ వద్ద నగదు డిపాజిట్ చేస్తే ఏడాదికి 24% చొప్పున వడ్డీ చెల్లిస్తానంటూ నమ్మబలికాడు.
అలాగే ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ పేరుతో మరో సంస్థ ఏర్పాటు చేసి ముద్రణ రంగంలో వినియోగించే ప్లేట్లు, రంగులు తదితరాలను కంపెనీల నుంచి కొని ప్రింటింగ్ ప్రెస్‌లకు విక్రయించడం మొదలెట్టారు. నేతాజీ భార్య నిమ్మగడ్డ వాణీబాల ఉమ్మడి రాష్ట్రంలో ఏపీ స్టేట్ కోఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్‌లో ఉద్యోగంలో చేరారు. రాష్ట్ర విభజన తర్వాత టెస్కాబ్‌గా మారిన ఈ సంస్థలో కొనసాగారు. రాష్ట్ర స్థాయి పోస్టు అయిన జనరల్ మేనేజర్ వరకు వెళ్లారు. శ్రీహర్ష తన తండ్రి నిర్వహిస్తున్న సంస్థలోనే డైరెక్టర్‌గా చేరా రు.
వాణీబాల టెస్కాబ్‌లో పనిచేసే ఉద్యోగులను భర్త సంస్థలో పెట్టుబడులు పెట్టాలని హుకుం జారీ చేసింది. దీంతో 147 మంది రూ. 26 కోట్ల డిపాజి ట్లు చేశారు. అలాగే టెస్కాబ్‌లో డిపాజిట్ చేయడానికి వచ్చే వారిని సైతం మాయమాటలతో నమ్మించి పెద్ద మొత్తంలో డిపాజిట్ చేయించుకుంది.
రశీదులన్నీ వేరే సంస్థ పేరుతో..: తమ వద్ద పె ట్టుబడులు పెట్టిన డిపాజిట్‌దారులకు ఇవ్వడానికి నేతాజీ, శ్రీహర్షలు ప్రత్యేకంగా శ్రీ ప్రియాంక ఎంటర్‌ప్రైజెస్ పేరుతో రసీదులు తయారు చేయించారు. దీనిపై వివరాలు రాసి రూపాయి విలువైన రెవెన్యూ స్టాంప్ అతికించి సంతకాలు చేసిచ్చారు. కరోనా తర్వాత కాస్త ఒడుదొడుకులు ఎదురైనా గతేడాది నవంబర్, డిసెంబర్ నుంచి వినియోగదారులకు వడ్డీ చెల్లింపులు ఆపేశారు. ఈ నెల 3న సిటీ సివిల్ కోర్టులో ఏకంగా దివాలా పిటిషన్ (ఐపీ) దాఖలు చేసి ముగ్గురూ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. దీనిపై బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న ఏసీపీ కేఎం కిరణ్‌కుమార్ నేతృత్వంలోని బృందం గురువారం ముగ్గురినీ అరెస్టు చేసి కోర్టు ఆదేశాలతో రిమాండ్‌కు తరలించింది. విచారణ నిమిత్తం 14 రోజుల కస్టడీకి కోరాలని నిర్ణయించింది.
Comments
Please login to add a commentAdd a comment