రొయ్యకు బీమా.. రైతుకు ధీమా | Sakshi
Sakshi News home page

రొయ్యకు బీమా.. రైతుకు ధీమా

Published Sun, Jan 28 2024 3:50 AM

Insurance awareness seminar for aqua farmers - Sakshi

సాక్షి, భీమవరం: ఆక్వా రైతుకు అడుగడుగునా అండగా నిలుస్తున్న రాష్ట్ర ప్రభుత్వం బీమా సదుపాయంతో సాగులో వారికి ధీమా కల్పించే దిశగా అడుగులు వేస్తోంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చొరవతో బీమా పాలసీ కల్పనకు ఇప్పటికే రాష్ట్రాన్ని కేంద్రం పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. బీమా పాలసీలపై రైతులకు అవగాహన కల్పించి, వారి అభిప్రాయాలు తీసుకునేందుకు ఆలిండియా ప్రాన్‌ ఫెడరేషన్, స్టేట్‌ ప్రాన్‌ ఫెడరేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో ఏపీ స్టేట్‌ ఆక్వా డెవలప్‌మెంట్‌ అథారిటీ (అప్సడా) అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది.

అందులో భాగంగా శనివారం పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరంలో అప్సడా వైస్‌ చైర్మన్‌ వడ్డి రఘురాం అధ్యక్షతన జరిగిన సమావేశానికి ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి 200 మందికి పైగా ఆక్వా రైతు సంఘాల నాయకులు, రైతులు హాజరయ్యారు. ఓరియంటల్, అగ్రికల్చర్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, అలయన్స్‌ ఇన్సూరెన్స్‌ బ్రోకర్స్‌ కంపెనీలకు చెందిన ప్రతినిధులు హాజరై వారు అందించే పాలసీల వివరాలను రైతులకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. సాగు కాలం, ప్రీమియం రేట్లు, సైక్లోన్‌ జోన్, నాన్‌ సైక్లోన్‌ జోన్‌లలో పాలసీ కవరేజీ వివరాల గురించి అవగాహన కల్పించారు.

రైతులు తమ ఎంపిక ప్రకారం 135 రోజుల నుంచి 180 రోజుల వరకు ప్రాథమిక కవర్‌ను ఎంచుకోవడం ద్వారా ప్రకృతి వైపరీత్యాల నుంచి పంట నష్టాన్ని కవర్‌ చేసుకోవచ్చునని తెలిపారు. పాలసీలపై రైతులు లేవనెత్తిన సందేహాలను బీమా సంస్థల ప్రతినిధులు నివృత్తి చేశారు. వ్యాధులు, వాతావరణ పరిస్థితులు, పెరుగుతున్న ఖర్చులు, మార్కెట్‌ సమస్యలు, ఇతర సవాళ్లను ఆక్వా రైతులు అధిగమించేందుకు ప్రభుత్వం బీమా పాలసీ తెచ్చిందని ఫిషరీస్‌ అడిషనల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అంజలి ఈ సందర్భంగా తెలిపారు.

ఫిష­రీస్‌ జేడీ మాధవీలత, డిప్యూటీ డైరెక్టర్‌ ఆనందరావు, జిల్లా మత్స్యశాఖ అధికారి ఆర్‌వీఎస్‌వీ ప్రసాద్, నేషనల్‌ ప్రాన్‌ ఫార్మర్స్‌ అధ్యక్షుడు ఐపీఆర్‌ మోహనరావు, ఏపీ ప్రాన్‌ ఫార్మర్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ జీకేఎఫ్‌ సుబ్బరాజు, రాష్ట్ర జాయింట్‌ సెక్రటరీ మల్ల రాంబాబు, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, కృష్ణా ఆక్వా ఫార్మర్స్‌ అధ్యక్షుడు నాగభూషణం, వత్సవాయి కుమార్‌రాజా తదితరులు పాల్గొన్నారు.

రైతుల ప్రయోజనాల కోసమే బీమా
ఈ సదస్సులో అప్సడా వైస్‌ చైర్మన్‌ వడ్డి రఘురాం మాట్లాడుతూ ఆక్వా రైతుల ప్రయోజనాలకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధిక ప్రాధాన్యమిస్తున్నారని చెప్పారు. ఏదోక పాలసీని తెచ్చి రైతులపై రుద్దకుండా వారి సూచన మేరకు ప్రయోజనకరమైన పాలసీ తేవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తోందన్నారు.

ఫిబ్ర­వరి 10 నాటికి సద­స్సులు పూర్తి చేసి పాలసీలపై రైతుల నుంచి వచ్చిన సూచనలను సీఎం జగన్‌ దృష్టికి తీసుకు­వెళ­తామని తెలిపారు. గత ఎన్నిక­లకు ఆరు నెలల ముందు చంద్రబాబు ఆక్వా రైతులకు పెట్టిన రూ. 340 కోట్ల విద్యుత్‌ బకాయిలను వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెల్లించిందని వివరించారు. అప్సడా ఏర్పడిన ఏడాదిన్నర కాలంలో రైతులకు మూడు లక్షలకు పైగా సబ్సిడీ విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చామన్నారు.

రాష్ట్రంలో బ్రూడల్‌ స్టాక్‌ మెయింటెనెన్స్‌ సెంటర్‌ (బీఎంసీ) ఏర్పాటులో గత ప్రభుత్వాలు విఫలమయ్యా­యని విమర్శించారు. విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం బంగారుపేటలో రూ. 36 కోట్లతో బీఎంసీ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించిందని, ఆగస్టు నాటికి ప్రారంభించే విధంగా సీఎం జగన్‌ యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారని రఘురాం తెలిపారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement