బీఆర్‌ఎస్‌ ప్రక్షాళన.. కేసీఆర్‌ బిగ్‌ ప్లాన్‌ ఇదేనా? | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ ప్రక్షాళన.. కేసీఆర్‌ బిగ్‌ ప్లాన్‌ ఇదేనా?

Published Sat, Jun 15 2024 2:40 PM

What Kind Of Decisions Is Kcr Going To Take To Strengthen Brs Party

తెలంగాణలో అధికారమార్పిడి జరిగి ఆరు నెలలు పూర్తయింది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రతిపక్షంలోకి మారింది. ఎంపీ ఎన్నికల్లో ఒక్కటి కూడా దక్కకపోవడంతో గులాబీ శ్రేణుల్లో నిరాశ ఆవరించింది. దీంతో పార్టీని అట్టడుగు స్థాయినుంచి బలోపేతం చేయాలని కేసీఆర్‌ నిర్ణయించారనే వార్తలు వినిపిస్తున్నాయి. సంస్థాగతంగా జరిగే మార్పుల్లో ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి? అసలు కేసీఆర్ ఆలోచన ఏంటి?

గులాబీ శ్రేణుల్లో తిరిగి ఉత్సాహం నింపాలని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పరిస్థితిపై గులాబీ పార్టీ అధిష్టానం ఓ అంచనాకు వచ్చింది. పూర్తి స్థాయి కమిటీలు లేకపోవడంతో నష్టం జరుగుతోందని, పార్టీ కోసం మొదటి నుండి పని చేస్తున్నవారికి బాధ్యతలు అప్పగించాలనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.

పార్టీ అనుబంధ కమిటీలను సైతం పూర్తి స్థాయిలో నియమించి క్యాడర్ ను యాక్టీవేట్ చేయాలని చూస్తోంది. క్యాడర్‌కు శిక్షణ ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేయబోతోంది. జిల్లాల్లో బలమైన నేతల్ని గుర్తించి బాధ్యతలు అప్పగించేందుకు గులాబీ పార్టీ కసరత్తు చేస్తోంది.

బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీలను 2022 జూన్ లో ప్రకటించారు. ఇందులో ఆసీఫాబాద్‌, నిర్మల్ జిల్లాల అధ్యక్షులు పార్టీ మారడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. జిల్లాల్లో పూర్తి స్థాయి కమిటీలను సైతం నియమంచలేదు. 19 జిల్లాల్లో అధ్యక్ష బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించడంతో పార్టీలోని సీనియర్లు, ఉద్యమకారులు అసంతృప్తికి గురి అయ్యారు.

కొంతమంది నేతలు పార్టీని వీడారు. ఈ పరిణామం పార్టీని డ్యామేజ్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు పార్టీ అనుబంధ కమిటీలైన మహిళ, యువత, రైతు, కార్మిక, విద్యార్థి, సోషల్ మీడియా కమిటీలను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదు. బాధ్యతలు లేకుండా పార్టీలో పనిచేస్తున్న నేతలు సైతం అసంతృప్తితోనే ఉన్నారు. అదే విధంగా నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిలో సైతం అధ్యక్షుడిని మాత్రమే నియమించి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో పార్టీ ఇచ్చే కార్యక్రమాలు నామమాత్రంగా జరుగుతున్నాయి.

ఆరేళ్ల క్రితం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీని 69 మంది సభ్యులతో ప్రకటించింది. ఆ కమిటీలో వున్న వారిలో కొంతమంది పార్టీ మారారు. దీంతో అధిష్టానం రాష్ట్ర కమిటీ కూర్పుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు. సీనియర్ నేతలకు అవకాశం కల్పించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశం ఇప్పటివరకు నిర్వహించలేదని చెబుతున్నారు. విస్తృతస్థాయి సమావేశం పేరుతో రాష్ట్ర కమిటీ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లను పిలిచి సమావేశాలు నిర్వహిస్తున్నారు.

లోపాలను సరిదిద్దే క్రమంలో త్వరలోనే రాష్ట్రంలోని పార్టీ కమిటీలన్నీ రద్దు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. యాక్టీవ్ గా పనిచేసే వారికే బాధ్యతలు అప్పగించేందుకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో యాక్టీవ్ గా పనిచేసిన నేతల వివరాలను కేసీఆర్ తెప్పించుకుంటున్నారు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలకు రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లాల బాధ్యతలను అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు నేతలకు కేసీఆర్ హింట్ కూడా ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది.

అనుబంధ కమిటీలను సైతం నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఉద్యమకాలం నుంచి పార్టీలో పనిచేస్తున్నవారికి పెద్దపీట వేయాలని, పార్టీలో ఉన్న కోవర్టులకు చెక్ పెట్టాలని అధిష్టానం భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపట్టింది. వాటిలో పార్టీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నాయకత్వం భావిస్తోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తేనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది.

క్యాడర్‌ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు గులాబీ దళపతి కేసీఆర్. అన్ని జిల్లాల్లోనూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్టీ శిక్షణా కార్యక్రమాలతో పాటు జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టబోయే నిరసన కార్యక్రమాల్లో కేటీఆర్ ప్రత్యక్షంగా పాల్గొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర పార్టీ ఆఫీస్ కు వచ్చినా అగ్రనేతలను కలిసే అవకాశం వుండటం లేదని ఇప్పటికే కార్యకర్తలు అసంతృప్తితో వున్నారు. దీంతో కార్యకర్తల సమస్యలను నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పరిష్కరించే విధంగా చర్యలుంటాయనే చర్చ జరుగుతోంది.

ప్రతిపక్షంలో వున్నప్పుడు సంస్థాగతంగా పార్టీ బలంగా వుంటేనే అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోగలమని గులాబీ పార్టీ భావిస్తోంది. అందుకోసం సమర్ధవంతమైన నేతలకు పార్టీ పదవులు ఇవ్వాలని నాయకత్వం భావిస్తోంది. సంస్థాగత నిర్మాణం, కమిటీల పునర్నిర్మాణం బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తుందా అనేది చూడాలి.

Advertisement
 
Advertisement

తప్పక చదవండి

 
Advertisement