పాకిస్తాన్ స్పీడ్‌స్టర్ హ్యారిస్ రవూఫ్ తనపై జరుగుతున్న ట్రోలింగ్ పట్ల స్పందించాడు. ఆటగాడిగా తనను విమర్శిస్తే పట్టించుకోనని.. అయితే.. తన కుటుంబం జోలికి వస్తే అస్సలు ఊరుకోనని స్పష్టం చేశాడు.
ఎదురుగా ఎవరు ఉన్నారన్న విషయంతో కూడా తన సంబంధం ఉండదని.. తన స్పందన ఇలాగే ఉంటుందని రవూఫ్ పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో పాకిస్తాన్ లీగ్ దశలోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే.
గ్రూప్-ఏలో ఉన్న బాబర్ ఆజం బృందం తొలుత అమెరికా, టీమిండియా చేతిలో ఓడింది. ఆ తర్వాత కెనడా, ఐర్లాండ్ జట్లపై గెలిచినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లీగ్ మ్యాచ్‌లన్నీ అమెరికాలోనే ఆడిన పాక్.. సూపర్-8 రేసు నుంచి అప్పటికే అవుటై పోయింది.
పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపై విమర్శలు
ఈ క్రమంలో మాజీ క్రికెటర్లు సహా సొంత అభిమానులు సైతం పాకిస్తాన్ ఆటగాళ్ల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. జట్టులో ఐక్యత లేకుండా గ్రూపులు కట్టి.. సర్వనాశనం చేశారని మండిపడుతున్నారు
ఈ నేపథ్యంలో హ్యారిస్ రవూఫ్ తన భార్యతో కలిసి అమెరికా వీధుల్లో వెళ్తుండగా ఓ వ్యక్తి అతడిని విమర్శిస్తూ మాటల యుద్ధానికి దిగాడు. దీంతో రవూఫ్ సైతం గట్టిగానే కౌంటర్ ఇస్తూ.. అతడి పైకి దూసుకెళ్లాడు.
భార్య వద్దని వారిస్తూనే ఉన్నా.. కోపాన్ని నియంత్రించుకోలేక సంమయనం కోల్పోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ నేపథ్యంలో హ్యారిస్ రవూఫ్ తొలిసారిగా స్పందించాడు.
నా తల్లిదండ్రులు, కుటుంబం జోలికి రానంతవరకే
‘‘సోషల్ మీడియా వరకు ఈ విషయం రావొద్దని అనుకున్నా. కానీ వీడియో ఎలాగో బయటకు వచ్చింది. కాబట్టి నేను స్పందించక తప్పడం లేదు.
పబ్లిక్ ఫిగర్లుగా ఉన్న కారణంగా పబ్లిక్ నుంచి అన్ని రకాల ఫీడ్‌బ్యాక్‌ను మేము తీసుకోవాల్సి ఉంటుంది. వాళ్లే మమ్మల్ని సమర్థిస్తారు. ఒక్కోసారి విమర్శిస్తారు కూడా!
కానీ.. నా తల్లిదండ్రులు, కుటుంబం జోలికి రానంతవరకే నేను వాటన్నింటినీ భరిస్తాను. ఒకవేళ ఈ విషయంలో వాళ్లు హద్దు దాటితే నేను కూడా వారికి తగ్గట్లుగానే బదులిస్తాను.
ప్రొఫెషన్లకు అతీతంగా ప్రతి ఒక్కరి కుటుంబాన్ని మనం గౌరవించాల్సి ఉంటుంది’’ అని హ్యారిస్ రవూఫ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. కాగా టీ20 ప్రపంచకప్-2024లో ఈ రైటార్మ్ పేసర్ ఏడు వికెట్లు తీశాడు.
— Haris Rauf (@HarisRauf14) June 18, 2024
Comments
Please login to add a commentAdd a comment