గత కొన్నాళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఏదీ కలిసి రావడం లేదు. భారత్ వేదికగా వన్డే వరల్డ్‌కప్-2023లో సెమీస్ చేరకుండానే నిష్క్రమించిన బాబర్ ఆజం బృందం.. టీ20 ప్రపంచకప్-2024లోనూ ఘోర పరాభవం చవిచూసింది.
గ్రూప్-ఏలో టీమిండియా, కెనడా, ఐర్లాండ్, అమెరికాలతో కలిసి ఉన్న పాక్.. లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ గ్రూపు నుంచి టీమిండియాతో పాటు పసికూన, ఆతిథ్య అమెరికా సూపర్-8కు అర్హత సాధించింది.
ఈ క్రమంలో పాకిస్తాన్ జట్టుపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కెప్టెన్, కోచ్‌లు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు యాజమాన్యంలో తరచూ మార్పుల కారణంగానే తీరూ తెన్నూ లేకుండా పోయిందని.. అందుకు నిదర్శనమే ఈ వరుస వైఫల్యాలు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
అఫ్గన్, బంగ్లాదేశ్ కూడా
ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్-2024లో పాక్ గ్రూప్ స్టేజీలోనే ఇంటిబాట పట్టగా.. ఆసియా నుంచి టీమిండియాతో పాటు అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ సూపర్-8కు చేరుకున్న విషయం తెలిసిందే. నాలుగింట మూడు విజయాలతో గ్రూప్-సి నుంచి అఫ్గన్.. గ్రూప్-డి నుంచి నాలుగింట మూడు గెలిచి బంగ్లా తదుపరి రౌండ్‌కు అర్హత సాధించాయి.
ఈ నేపథ్యంలో బంగ్లాదే వెటరన్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ పాకిస్తాన్ జట్టును ఉద్దేశించి చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. పాక్ వైఫల్యాలపై సానుభూతి వ్యక్తం చేసిన ఈ బంగ్లా బ్యాటర్.. మాజీ కెప్టెన్ షాహిద్ ఆఫ్రిది వంటి వాళ్లు ప్రస్తుత జట్టుకు మార్గదర్శనం చేస్తే బాగుంటుందని హితవు పలికాడు.
‘‘టీ20 ప్రపంచకప్ నుంచి పాకిస్తాన్ ఎలిమినేట్ కావడం విచారకరం. వచ్చేసారి వాళ్లు గొప్పగా రాణించాలని ఆశిస్తున్నా. షాహిద్ ఆఫ్రిది వంటి సీనియర్లే వారికి సరైన మార్గం చూపాలి’’ అని తమీమ్ ఇక్బాల్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. ఇక్బాల్ ట్వీట్‌కు మద్దతుగా, వ్యతిరేకంగా.. ఇలా మిశ్రమ స్పందనలు వస్తున్నాయి.
కఠిన చర్యలకు సిద్ధం
వన్డే వరల్డ్‌కప్‌లో అవమానం తర్వాత పాకిస్తాన్ వరుసగా విఫలమైంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్, న్యూజిలాండ్, ఇంగ్లండ్‌లతో టీ20 సిరీస్‌లో పరాజయాలు చవిచూసింది.
తాజాగా ప్రపంచకప్ రేసు నుంచి లీగ్ దశలోనే వైదొలిగింది. అంతేగాక సీనియర్లు సైతం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేక చతికిలపడ్డారు. ఈ నేపథ్యంలో పాక్ బోర్డు ఆటగాళ్లపై కఠిన చర్యలకు ఉపక్రమించినట్లు సమాచారం.
సెంట్రల్ కాంట్రాక్టులు, జీతాల విషయంలో సమీక్ష నిర్వహించి.. కోతలు విధించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆటగాళ్ల తీరుపై గుర్రుగా ఉన్న పీసీబీ కొత్త చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఇందుకు సంబంధించిన నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment