8 మంది మావోయిస్టులు, ఒక ఎస్టీఎఫ్ జవాను మృతి
మరో ఇద్దరు జవాన్లకు గాయాలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో 8 మంది మావోయిస్టులు, స్పెషల్ టాస్‌్కఫోర్స్(ఎస్టీఎఫ్) జవాను నితీశ్ ఎక్కా మృతిచెందినట్లు అధికారులు వెల్లడించారు. లేఖారమ్ నేతమ్, కైలాశ్ నేతమ్ అనే మరో ఇద్దరు జవాన్లు గాయపడినట్లు తెలిపారు. ఘటనా స్థలంలో పెద్ద సంఖ్యలో ఆయుధాలు, బ్యారెల్ గ్రనేడ్ లాంచర్‌తోపాటు ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.
అబూజ్‌మడ్ అడవిలో ఈ నెల 12న ప్రారంభమైన ప్రత్యేక ఆపరేషన్‌లో భాగంగా శనివారం ఉదయం భద్రతా సిబ్బంది గాలింపు కొనసాగిస్తుండగా, మావోయిస్టులు తారసపడ్డారని, ఇరువర్గాల మధ్య చాలాసేపు కాల్పులు కొనసాగాయని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ పోలీసులతోపాటు ఐటీబీపీ, బీఎస్‌ఎఫ్ సిబ్బంది సైతం ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నారని వివరించారు. మావోయిస్టుల వైపునుంచి కాల్పులు ఆగిపోయిన తర్వాత వెళ్లి పరిశీలించగా 8 మృతదేహాలు కనిపించాయని స్పష్టం చేశారు.
గాయపడిన ఇద్దరు జవాన్లను చికిత్స కోసం హెలికాప్టర్‌లో రాయ్‌పూర్‌కు తరలించారు. ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవలి కాలంలో భద్రతా సిబ్బంది దూకుడుగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టులపై ఉక్కుపాదం మోపుతున్నారు. కాంకేర్, కొండగావ్, నారాయణపూర్, బస్తర్, బీజాపూర్, దంతెవాడ, సుక్మా జిల్లాలో కూడిన బస్తర్ డివిజన్‌లో ఈ ఏడాది ఇప్పటివరకు జరిగిన వేర్వేరు ఎన్‌కౌంటర్లలో 131 మంది మావోయిస్టులు మరణించారు. ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఏకంగా 29 మంది మావోయిస్టులు మృతిచెందిన సంగతి తెలిసిందే. నక్సలైట్లను పూర్తిగా ఏరివేయడమే తమ లక్ష్యమని ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment