
ఉడిపి: కర్ణాటకలోని ఉడిపి జిల్లా కర్కల తాలూకాలోని కబ్బినలే గ్రామంలో సోమవారం రాత్రి యాంటీ నక్సల్ ఫోర్స్ (ఏఎన్‌ఎఫ్), మావోయిస్టుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు నేత విక్రమ్ గౌడ్ హతమయ్యాడు.
సీతాంబేలు ప్రాంతంలో నిర్వహిస్తున్న యాంటీ నక్సల్స్ సెర్చ్ ఆపరేషన్‌లో నక్సల్స్-ఏఎన్‌ఎఫ్ బృందానికి మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి. నక్సల్ యూనిట్ అనుమానాస్పద కార్యకలాపాలపై సమాచారం అందుకున్న ఏఎన్‌ఎఫ్ బృందం ఈ ఆపరేషన్‌ను ముమ్మరం చేసింది. మీడియాకు అందిన వివరాల ప్రకారం చిక్‌మగళూరు జిల్లా జయపుర పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక ఇంటిని నక్సల్ యూనిట్ సందర్శించింది. తరువాత వారు కొప్ప తాలూకాలోని యెడగుండ గ్రామంలోకి కూడా చొరబడ్డారు. అక్కడ వారు అటవీ ఆక్రమణ, కస్తూరిరంగన్ నివేదికకు సంబంధించిన అంశాలపై చర్చించారు.
దీనిపై వివరాలు అందిన దరిమిలా ఏఎన్‌ఎఫ్ ఆ ప్రాంతంలో నక్సల్ వ్యతిరేక ఆపరేషన్‌ను ముమ్మరం చేసింది. సోమవారం రాత్రి ఐదుగురు మావోయిస్టులు కిరాణా సామాన్లు కొనుగోలు చేసేందుకు కబ్బినలే గ్రామంలోకి వచ్చారు. ఈ నేపధ్యంలో ఏఎన్‌ఎఫ్ బృందం, మావోయిస్టుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో మావోయిస్టు నేత విక్రమ్ గౌడ్ మృతి చెందగా, మిగిలిన మావోయిస్టులు తప్పించుకున్నారు.
కర్ణాటకలో యాక్టివ్‌గా ఉన్న మావోయిస్టు నేతల్లో విక్రమ్ గౌడ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. విక్రమ్ గౌడ్ పలు హింసాత్మక ఘటనల్లో పాల్గొన్నాడు. ఈ ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టులకు చెందిన ఇతర గ్రూపులు యాక్టివ్‌గా మారే అవకాశాన్ని నిరోధించేందుకు పోలీసులు ఆ ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లను మరింత పటిష్టం చేశారు.
ఇది కూడా చదవండి: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి వెయ్యి రోజులు
Comments
Please login to add a commentAdd a comment