క్రాష్ టెస్ట్‌లో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటాకు చెందిన ఎలక్ట్రిక్ కార్లు తడాఖా చూపించాయి. టాటా పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ 5 స్టార్ భారత్-ఎన్‌సీఏపీ సేఫ్టీ రేటింగ్ సాధించాయని టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (టీపీఈఎం) ప్రకటించింది.
అడల్ట్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ (ఏఓపీ)లో 31.46/32 పాయింట్లు, చైల్డ్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ (సీఓపీ)లో 45/49 పాయింట్లు సాధించడం ద్వారా పంచ్ ఈవీ ఇప్పటివరకు ఏ వాహనం సాధించని అత్యధిక స్కోర్లను అందుకోవడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని నిర్దేశించింది. ఇక నెక్సాన్ ఈవీ కేఓపీలో 29.86/32 పాయింట్లు, సీఓపీలో 44.95/49 పాయింట్లను సాధించింది. దీంతో టాటా మోటార్స్ ఇప్పుడు భారత్-ఎన్‌సీఏపీ, గ్లోబల్-ఎన్‌సీఏపీ పరీక్షలలో 5-స్టార్ స్కోర్ చేసిన సురక్షితమైన శ్రేణి ఎస్‌యూవీ పోర్ట్‌ఫోలియో కలిగిన ఏకైక ఓఈఎంగా నిలిచింది.
'భారత్-ఎన్‌సీఏపీ కింద నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీలకు 5 స్టార్ రేటింగ్ లభించడంపై టాటా మోటార్స్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఈ సర్టిఫికేషన్ దేశంలో సురక్షితమైన వాహనాల పట్ల భారత ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమను 'ఆత్మనిర్భర్'గా మార్చడంలో భారత్-ఎన్‌సీఏపీ పాత్రను నొక్కి చెబుతుంది" అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.
పంచ్ ఈవీ లాంచ్ అయినప్పటి నుంచి విశేష ఆదరణను సొంతం చేసుకుంది. గ్రామీణ మార్కెట్ల నుంచి 35 శాతానికి పైగా కస్టమర్లు ఉన్నారు. పంచ్ ఈవీని 10,000 మందికి పైగా కొనుగోలు చేశారు. భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి నాంది పలికిన నెక్సాన్ ఈవీ 2020 లో లాంచ్ అయినప్పటి నుంచి 68,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఈ ఎస్‌యూవీని అప్‌డేటెడ్ వర్షన్‌ను 2023లో ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment