Bharat NCAP
-
క్రాష్ టెస్ట్‌లో తడాఖా.. ప్రముఖ ఈవీలకు 5 స్టార్ రేటింగ్
క్రాష్ టెస్ట్‌లో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటాకు చెందిన ఎలక్ట్రిక్ కార్లు తడాఖా చూపించాయి. టాటా పంచ్ ఈవీ, నెక్సాన్ ఈవీ 5 స్టార్ భారత్-ఎన్సీఏపీ సేఫ్టీ రేటింగ్ సాధించాయని టాటా మోటార్స్ అనుబంధ సంస్థ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ (టీపీఈఎం) ప్రకటించింది.అడల్ట్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ (ఏఓపీ)లో 31.46/32 పాయింట్లు, చైల్డ్ యాక్సిడెంట్ ప్రొటెక్షన్ (సీఓపీ)లో 45/49 పాయింట్లు సాధించడం ద్వారా పంచ్ ఈవీ ఇప్పటివరకు ఏ వాహనం సాధించని అత్యధిక స్కోర్లను అందుకోవడం ద్వారా ఒక ప్రధాన మైలురాయిని నిర్దేశించింది. ఇక నెక్సాన్ ఈవీ కేఓపీలో 29.86/32 పాయింట్లు, సీఓపీలో 44.95/49 పాయింట్లను సాధించింది. దీంతో టాటా మోటార్స్ ఇప్పుడు భారత్-ఎన్సీఏపీ, గ్లోబల్-ఎన్సీఏపీ పరీక్షలలో 5-స్టార్ స్కోర్ చేసిన సురక్షితమైన శ్రేణి ఎస్యూవీ పోర్ట్‌ఫోలియో కలిగిన ఏకైక ఓఈఎంగా నిలిచింది.'భారత్-ఎన్సీఏపీ కింద నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీలకు 5 స్టార్ రేటింగ్ లభించడంపై టాటా మోటార్స్‌కు నా హృదయపూర్వక అభినందనలు. ఈ సర్టిఫికేషన్ దేశంలో సురక్షితమైన వాహనాల పట్ల భారత ప్రభుత్వ దార్శనికతకు అనుగుణంగా ఉంటుంది. భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమను 'ఆత్మనిర్భర్'గా మార్చడంలో భారత్-ఎన్సీఏపీ పాత్రను నొక్కి చెబుతుంది" అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.పంచ్ ఈవీ లాంచ్ అయినప్పటి నుంచి విశేష ఆదరణను సొంతం చేసుకుంది. గ్రామీణ మార్కెట్ల నుంచి 35 శాతానికి పైగా కస్టమర్లు ఉన్నారు. పంచ్ ఈవీని 10,000 మందికి పైగా కొనుగోలు చేశారు. భారతదేశ ఎలక్ట్రిక్ వాహనాల విప్లవానికి నాంది పలికిన నెక్సాన్ ఈవీ 2020 లో లాంచ్ అయినప్పటి నుంచి 68,000 యూనిట్లకు పైగా అమ్ముడుపోయాయి. ఈ ఎస్‌యూవీని అప్డేటెడ్ వర్షన్‌ను 2023లో ఆవిష్కరించారు. -
'భారత్ ఎన్సీఏపీ'లో 5 స్టార్ రేటింగ్ రావాలంటే.. ఈ స్కోర్ తప్పనిసరి!
రోడ్డు రవాణా & రహదారుల మంత్రిత్వ శాఖ ఇటీవలే న్యూ భారత్ ఎన్సీఏపీ (Bharat NCAP) నిబంధనలను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ కొత్త నియమాలు 2023 అక్టోబర్ 01 నుంచి అమలులోకి రానున్నాయి. భారత్ ఎన్సీఏపీ క్రాష్ టెస్ట్ అనేది దాదాపు గ్లోబల్ ఎన్సీఏపీ టెస్ట్ మాదిరిగానే ఉన్నప్పటికీ ఇందులో కొన్ని వ్యత్యాసాలను గమనించవచ్చు. గ్లోబల్ ఎన్సీఏపీ కింద, అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్ (AOP)లో వాహనం గరిష్టంగా 34 పాయింట్లు స్కోర్ చేయగలదు. కానీ భారత్ ఎన్సీఏపీ కింద 32 పాయింట్స్ మాత్రమే ఉంటాయి. రెండు టెస్టింగ్ ప్రోటోకాల్‌లు ఫ్రంట్ అండ్ సైడ్ ఇంపాక్ట్ టెస్ట్ కోసం ఒక్కొక్కటి 16 పాయింట్లను అందిస్తాయి. భారత్ ఎన్సీఏపీ విధానములో 5 స్టార్ రేటింగ్ పొందాలంటే ఎంత స్కోర్ చేయాలి? ఎంత స్కోర్ చేస్తే 1 స్టార్ రేటింగ్ లభిస్తుందనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. ఇదీ చదవండి: అద్దె భవనంలో ప్రపంచ కుబేరుడు 'జెఫ్ బెజోస్' - రెంట్ ఎన్ని కోట్లో తెలిస్తే షాక్ అవుతారు! ఒక కారు భారత్ ఎన్సీఏపీ విధానములో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకోవాలంటే.. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 27 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 41 పాయింట్లు స్కోర్ చేయాల్సి ఉంటుంది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 22 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 35 పాయింట్లు స్కోర్ చేస్తే 4 స్టార్ రేటింగ్ లభిస్తుంది. చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 27 పాయింట్లు, అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 16 పాయింట్లు సాధిస్తే 3 స్టార్ రేటింగ్ లభిస్తుంది. అడల్ట్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో వరుసగా 10, 4 పాయింట్లు, చైల్డ్ ఆక్యుపెంట్ ప్రొటెక్షన్‌లో 18, 9 పాయింట్లు స్కోర్ చేస్తే 2 స్టార్ రేటింగ్ & 1 స్టార్ రేటింగ్ లభిస్తుంది. -
భారత్ ఎన్సీఏపీ ప్రారంభం నేడే.. దీనివల్ల ఉపయోగాలెన్నో తెలుసా?
భారతదేశంలో మోటారు వాహనాల భద్రతా ప్రమాణాలను మరింత పెంచడానికి ఈ రోజు కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ మంత్రి 'నితిన్ గడ్కరీ' 'న్యూ కార్ అసెస్మెంట్ ప్రోగ్రామ్' (Bharat NCAP) ప్రారంభించనున్నారు. వాహనాలలో సేఫ్టీ పెరిగితే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతుందనే భావనతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఈ ప్రోగ్రామ్ కింద కార్ల తయారీదారులు ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (AIS) 197 ప్రకారం.. కార్లను స్వచ్ఛందంగా టెస్ట్ చేయడానికి అందించవచ్చు. దీని ద్వారా వాహనాలు సేఫ్టీ రేటింగ్ పొందుతాయి. ఇంతకీ భారత్ ఎన్సీఏపీ వల్ల ఉపయోగాలేమిటనేది ఈ కథనంలో తెలుసుకుందాం. ఇదీ చదవండి: మెగాస్టార్ ఆస్తులు ఎన్ని కోట్లో తెలిస్తే.. ఆశ్చర్యపోతారు! కార్లు, ప్రైవేట్ జెట్ ఇంకా.. భారత్ ఎన్సీఏపీ ఉపయోగాలు.. ➤ ఒక కంపెనీ తమ ఉత్పత్తులను టెస్ట్ చేయడానికి అందించినప్పుడు.. వాటి పనితీరు ఆధారంగా అడల్ట్ ఆక్యుపెంట్స్ ప్రొటక్షన్, చైల్డ్ ఆక్యుపెంట్స్ ప్రొటక్షన్ కోసం రేటింగ్ అనేది అందివ్వడం జరుగుతుంది. ➤ భద్రతా ప్రమాణాలను దృష్టిలో ఉంచుకుని కొనుగోలుదారులు కార్లను ఎంచుకునే అవకాశం ఉంది. ఇది అధిక సేఫ్టీ కలిగిన కార్లను ఎంచుకోవడంలో ఉపయోగపడుతుందని రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. ➤ ఆధునిక కాలంలో భద్రత ఎక్కువగా ఉన్న కార్లను కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కార్ల తయారీ సంస్థలు కూడా లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్స్ అందిస్తున్నాయి. అయితే దేశీయ కార్లు అంతర్జాతీయ మార్కెట్లో కూడా గుర్తింపు పొందటానికి భారత్ ఎన్సీఏపీ చాలా ఉపయోగపడుతుంది. ➤ భారత్ ఎన్సీఏపీ గుర్తించిన కార్లు తప్పకుండా విదేశాలకు ఎక్కువ సంఖ్యలో ఎగుమతి అవుతాయని, తద్వారా భారత ఆర్థిక వ్యవస్థ కూడా వృద్ధి చెందుతుందని తెలుస్తోంది. ➤ ఇప్పటికే రోడ్లపై 'బ్లాక్ స్పాట్స్' తొలగించడానికి ప్రభుత్వం సుమారు రూ. 40,000 కోట్లు ఖర్చు చేస్తోందని నితిన్ గడ్కరీ ఇదివరకే వెల్లడించారు. దీంతో ఉద్యోగాలు కూడా లభించే అవకాశం ఉంటుందని తెలిపారు. ➤ ఒక్క 2021లో రోడ్డు ప్రమాదాలలో సుమారు 1.54 లక్షలమంది ప్రాణాలు కోల్పోగా.. 3.84 లక్షల మంది గాయపడినట్లు నివేదికలు చెబుతున్నాయి. ➤ ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకి, టయోటా వంటి కంపెనీలు న్యూ కార్ అసెస్మెంట్ కార్యక్రమానికి మద్దతు తెలిపినట్లు సమాచారం. మొత్తం మీద 2024నాటికి రోడ్డు ప్రమాదాలు, మరణాల సంఖ్యను సుమారు 50 శాతం తగ్గించాలని గడ్కరీ పిలుపునిచ్చారు.