దేశంలోని ఈ నగరాల్లో చుక్కలు చూపిస్తున్న అద్దె ఇళ్లు.. మరి హైదరాబాద్‌లో | Sakshi
Sakshi News home page

దేశంలోని ఈ నగరాల్లో చుక్కలు చూపిస్తున్న అద్దె ఇళ్లు.. మరి హైదరాబాద్‌లో

Published Sat, Nov 11 2023 8:24 AM

Bengaluru,hyderabad Rental Hikes Of Up To 30 Percent In 2023 - Sakshi

దేశంలో అద్దె ఇళ్ల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. దీంతో నెల సంపాదనలో సగం అద్దింటికే చెల్లించాల్సి వస్తుందని చిరుద్యోగులు వాపోతున్నారు. పైగా పెరిగిపోతున్న అద్దె ఇళ్ల ధరలు సంపాదనలో కొంత మొత్తాన్ని దాచి పెట్టుకోవాలనుకునే వారి ఆశలపై నీళ్లు చల్లుతున్నాయి. 

తాజాగా రియల్​ ఎస్టేట్​ కన్సల్టెంట్​ కంపెనీ అనరాక్ ఓ నివేదికను విడుదల చేసింది. అందులో దేశంలోని ప్రముఖ మెట్రో నగరాలైన బెంగళూరు,హైదరాబాద్‌, పూణేతో పాటు మిగిలిన ప్రాంతాల్లో ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్‌ మధ్య కాలంలో అద్దె ఇళ్ల ధరలు పెరిగినట్లు తెలిపింది. 

🏘️వెయ్యి చదరపు అడుగులో డబుల్‌ బెడ్రూం ఇల్లు సగటున నెలవారీ అద్దె గత ఏడాది రూ.24,600 ఉండగా.. ఇప్పుడు అదే రెంట్‌ 2023 సెప్టెంబర్‌ నెల ముగిసే సమయానికి రూ28,500కి చేరింది. 

🏘️ముఖ్యంగా బెంగళూరులోని ప్రముఖ ప్రాంతాల్లో రెసిడెన్షియల్‌ రెంట్లు దాదాపూ 30 శాతం పెరగ్గా.. వైట్‌ ఫీల్డ్‌ ఏరియాలో 31శాతం పెరిగాయి. ఆ తర్వాతి స్థానంలో సర్జాపూర్‌ రోడ్డు ప్రాంతంలోని అద్దె ఇళ్ల ధరలు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించినట్లు అనరాక్‌ తన నివేదికలో వెల్లడించింది.   

🏘️సర్జాపూర్‌ రోడ్‌లో నెలవారీ సగటు అద్దె ఇల్లు ధర 2022 ఏడాది ముగిసే సమయానికి రూ.24,000 ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌ నెల ముగిసే సమయానికి అదే రెంట్‌ ధర రూ.30,500కి చేరింది. 

🏘️ఇక 9 నెలల కాలంలో హైదరాబాద్‌లో రెంట్‌ ధరలు 24 శాతం పెరగ్గా.. పూణేలో 17 శాతం పెరిగాయి. హైదరాబాద్‌ గచ్చీబౌలి ప్రాంతంలో అద్దె ఇల్లు ధరలు 2022 ముగిసే సమయానికి రూ.23,400 ఉండగా.. ఈ ఏడాది సెప్టెంబర్‌ నెల ముగిసే సమయానికి రూ.29,000కి చేరింది. 

🏘️ అదే పూణేలో 2022 ముగిసే సమయానికి రూ.21,000 ఉన్న అద్దె ఇల్లు ధర ఈ ఏడాది సెప్టెంబర్‌ నెల ముగిసే సమయానికి రూ.24,500కి చేరింది. 

🏘️బళ్లారిలో 2బీహెచ్‌కే అద్దె రూ.24,600 నుంచి రూ.28,500కు పెరిగింది.

🏘️వైట్ ఫీల్డ్‌ ప్రాంతంలో వెయ్యి చదరపు చదరపు అడుగుల్లో ఉన్న 2 బీహెచ్‌కే ఇంటి సగటు నెలవారీ అద్దె 2022 ఏడాది చివరి నాటికి రూ.24,600 ఉండగా  2023, సెప్టెంబర్‌ నెల ముగిసే సయానికి రూ.28,500కి పెరిగింది. ఢిల్లీ ఎన్‌సీఆర్‌, ముంబై, చెన్నై, కోల్‌కతాలో అద్దె ఇల్లు ధర 9 శాతంనుంచి 14 శాతానికి చేరుకున్నాయి.

ఈ సందర్భంగా ‘ప్రస్తుత త్రైమాసికంలో చాలా నగరాల్లో అద్దె ఇంటి ధరలు స్థిరంగా ఉండొచ్చు. ఎందుకంటే? అద్దె సాధారణంగా సంవత్సరం అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు తక్కువగా ఉంటాయి. కొత్త ఆర్థిక సంవత్సరంలో నియామకాలు పెరిగిన నేపథ్యంలో భారతీయులు మెరుగైన ఉద్యోగావకాశాల కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళుతుంటారు. కాబట్టే జనవరి-మార్చి కాలంలో అద్దెలు మళ్లీ పెరుగుతాయి' అని అనరాక్ గ్రూప్ చైర్మన్ అనూజ్ పురి అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement