IPOs in 2024: కోట్లు కురిపిస్తాయా? కొత్త ఏడాదిలో ఊరిస్తున్న ఐపీవోలు ఇవే.. | Sakshi
Sakshi News home page

IPOs in 2024: కోట్లు కురిపిస్తాయా? కొత్త ఏడాదిలో ఊరిస్తున్న ఐపీవోలు ఇవే..

Published Sun, Dec 24 2023 7:51 PM

Most Anticipated IPOs Of 2024 In India - Sakshi

ఈ ఏడాది మరికొన్ని రోజల్లో ముగిసిపోతోంది. కొత్త ఏడాది కోసం ప్రతిఒ‍క్కరూ నూతన ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. సామాన్యులే కాదు మార్కెట్‌ వర్గాలు, మదుపర్లు, కంపెనీలు కొత్త సంవత్సరంపై ‘కోట్ల’ ఆశలు పెట్టుకున్నాయి.

నెమ్మదిగా ప్రారంభమైనప్పటికీ, భారతీయ ప్రైమరీ మార్కెట్లు 2023లో మొత్తంగా విజయాన్ని సాధించాయి. ఐపీవోల ద్వారా సేకరించిన నిధులు 2022 సంవత్సరం కంటే తక్కువగా ఉన్నప్పటికీ, మునుపటి సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది పబ్లిక్ ఇష్యూలు ఎక్కువగానే మార్కెట్‌కి వచ్చాయి.  

2023లో మొత్తంగా 57 ఇష్యూలు క్యాపిటల్ మార్కెట్‌లోకి ప్రవేశించాయి. అంతకుముందు ఏడాది కంటే ఇవి 40 పెరిగాయి. అయితే సేకరించిన మొత్తం నిధులు మాత్రం గతేడాది కంటే 17 శాతం తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది ఐపీవోలలో సేకరించిన తాజా మూలధనం వాటా ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది.

రానున్న ఏడాదిలో రూ. 28,440 కోట్ల విలువైన ఇష్యూలు పబ్లిక్ మార్కెట్‌లలోకి ప్రవేశించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఎక్స్చేంజ్‌ డేటా, నివేదికలు, మార్కెట్ ఊహాగానాల ఆధారంగా 2024లో అత్యధికంగా ఎదురుచూస్తున్న ఐపీవోలు ఇవే..

ఓలా ఎలక్ట్రిక్ : 700 నుంచి 800 మిలియన్‌ డాలర్ల సేకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సఫలమైతే కంపెనీ విలువ 7 నుంచి 8 బిలియన్‌ డాలర్లకు చేరుకుంటుంది.

ఫోన్‌పే: దేశంలో డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా ఉన్న ఫోన్‌పే 2024-2025లో ఐపీవో కోసం చూస్తోంది. వాల్‌మార్ట్ నుంచి 200 మిలియన్‌ డాలర్ల మూలధనాన్ని అందుకున్న అనంతరం దీని విలువ 12 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఐపీవో ద్వారా 2 బిలియన్‌ డాలర్ల మేర నిధులు సేకరించాలని భావిస్తోంది.

ఆకాష్‌: బైజూస్‌ అనుబంధ సంస్థ అయిన ఎడ్‌టెక్‌ మేజర్ 2024 మధ్య నాటికి ఐపీవోకి రావాలని యోచిస్తోంది. బైజూస్‌ కొన్న ఆకాష్ ఆదాయంలో మూడు రెట్లు పెరుగుదల కనిపించింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి రూ.4,000 కోట్ల ఆదాయం, రూ.900 కోట్ల ఎబీటాకి చేరుకుంటుందని అంచనా.

ఓయో రూమ్స్: చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఐపీవో ఇది. కంపెనీ రుణాల చెల్లింపుపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో చాలా ఆలస్యమైంది. ఇప్పటికే ఐపీవో కోసం దాఖలు చేసినప్పటికీ తర్వాత తన పబ్లిక్ లిస్టింగ్ ఇష్యూ పరిమాణాన్ని దాదాపు సగానికి తగ్గించి మళ్లీ ఫైల్‌ చేసింది.

ఫార్మ్‌ ఈజీ: టాటా యాజమాన్యంలోని ఈ కంపెనీ ఇటీవల రైట్స్‌ ఇష్యూలో రూ.3,950 కోట్లకు పైగా సమీకరించింది. ఈ పనితీరు ఇలాగే కొనసాగితే పబ్లిక్‌ ఇష్యూకి వస్తుందని భావిస్తున్నారు.

మొబీక్విక్‌: డీఏఎం క్యాపిటల్ అడ్వైజర్స్, ఎస్‌బీఐ క్యాపిటల్ మార్కెట్స్‌తో కలిసి సుమారు 84 మిలియన్‌ డాలర్ల సేకరించే లక్ష్యంతో ఐపీవో వస్తోంది. గతంలోనే ఐపీవో రావాలని భావించినా ఆ ప్రణాళికలను వాయిదా వేసుకుని ఇప్పుడు 2024లో లిస్టింగ్‌కు వస్తోంది. 

పేయూ ఇండియా: ఇది కూడా 2024 ద్వితీయార్ధం నాటికి ఐపీవోకి సిద్ధంగా ఉంటుందని భావిస్తున్నారు. ప్రోసస్‌ యాజమాన్యంలో పేయూ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో భారతదేశ కార్యకలాపాల ద్వారా 211 మిలియన్‌ డాలర్ల ఆదాయాన్ని ఆర్జించింది.

స్విగ్గీ: ఫుడ్ డెలివరీ పరిశ్రమలో ప్రముఖ కంపెనీ అయిన స్విగ్గీ 2024లో పబ్లిక్‌కి వచ్చే అవకాశం ఉంది. 10.7 బిలియన్‌ డాలర్ల విలువ కలిగిన ఈ కంపెనీ పబ్లిక్ మార్కెట్‌లలోకి దూసుకుపోతే, జొమాటో తర్వాత అలా చేసిన రెండవ ఫుడ్ అగ్రిగేటర్ అవుతుంది.

Advertisement
Advertisement