న్యూఢిల్లీ, సాక్షి: ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 400 సీట్లతో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మధురలోని కృష్ణ జన్మభూమి స్థలంలో, వారణాసిలోని జ్ఞానవాపి మసీదు ప్రాంతంలో దేవాలయాలు నిర్మిస్తామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ చెప్పారు.
“డబుల్, ట్రిపుల్ సెంచరీలు ఎందుకు సాధించావని సచిన్ టెండూల్కర్‌ని ఎవరైనా అడుగుతారా? మనకు 300 సీట్లు ఉన్నప్పుడు రామమందిరాన్ని నిర్మించాం. ఇప్పుడు మనకు 400 సీట్లు వస్తే మధురలో కృష్ణ జన్మభూమి సాక్షాత్కరిస్తుంది. వారణాసిలోని జ్ఞానవాపి మసీదు స్థానంలో విశ్వనాథుని ఆలయాన్ని కూడా నిర్మిస్తాం” అని మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన బహిరంగ సభలో అసోం సీఎం పేర్కొన్నారు.
బీజేపీ తూర్పు ఢిల్లీ అభ్యర్థి హర్ష్ మల్హోత్రా తరపున ప్రచారం చేసేందుకు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ దేశ రాజధానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోదీ మూడోసారి ప్రధాని అయిన తర్వాత ఆయన నాయకత్వంలో పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూకశ్మీర్ భారత్‌లో అంతర్భాగం అవుతుందన్నారు. ‘కశ్మీర్ భారత్, పాకిస్థాన్ రెండింటిలోనూ భాగమని కాంగ్రెస్ హయాంలో చెప్పాం. మోదీకి 400 సీట్లు వస్తే పీఓకేని భారత్‌కు తీసుకువస్తాం. 400 సీట్లతో మా ప్రణాళికలను కొనసాగిస్తూ పోతాం.. కాంగ్రెస్ ఐసీయూకి చేరుతుంది" అని హిమంత బిస్వా శర్మ వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment