జనాదరణ పథకాలకు ఆర్‌బీఐ డబ్బు | Sakshi
Sakshi News home page

జనాదరణ పథకాలకు ఆర్‌బీఐ డబ్బు

Published Fri, Sep 8 2023 5:29 AM

RBI refused Rs 2-3 lakh crore transfer to NDA government in 2018 - Sakshi

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ వి. ఆచార్య తన పుస్తకం కొత్త ఎడిషన్‌ ‘ముందు మాట’గా రాసిన కొన్ని అంశాలు  తాజాగా ఆసక్తికరంగా మారాయి.  ‘‘ 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు 2018లో ఆర్‌బీఐ బ్యాలెన్స్‌ షీట్‌ నుంచి జనాదరణ పథకాల వ్యయాలకు రూ.  2 నుంచి 3 లక్షల కోట్లను పొందాలని కేంద్ర ప్రభుత్వంలోకి కొందరు  చేసిన ప్లాన్‌ (రైడ్‌)ను సెంట్రల్‌ బ్యాంక్‌ ప్రతిఘటించింది. ఇది స్పష్టంగా ప్రభుత్వం– ఆర్‌బీఐ మధ్య విభేదాలకు దారితీసింది. 

  సెంట్రల్‌ బ్యాంక్‌కు సంబంధిత ఆదేశాలు జారీ చేయడానికి భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ చట్టంలోని ఎన్నడూ ఉపయోగించని సెక్షన్‌ 7ను అమలు చేయాలని ఆలోచించే స్థాయికి పరిస్థితి వెళ్లింది’’ అని రాసిన అంశాలు ఆసక్తికరంగా మారాయి.‘క్వెస్ట్‌ ఫర్‌ రీస్టోరింగ్‌ ఫైనాన్షియల్‌ స్టెబిలిటీ ఇన్‌ ఇండియా’ శీర్షికతో ప్రజల ముందు ఉంచిన తన పుస్తకం తాజా ఎడిషన్‌ ముందు మాటలో  ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘కేంద్ర ఆర్థిక లోటు భర్తీకి బ్యాక్‌డోర్‌ మానిటైజేషన్‌’’ అని ఆయన ఈ వ్యవహారాన్ని అభివరి్ణంచడం గమనార్హం.  2017 జనవరి 20వ తేదీ నుంచి 2019 జూన్‌ వరకూ దాదాపు రెండున్నర సంవత్సరాల పాటు విరాల్‌ ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో ఆయన డిప్యూటీ గవర్నర్‌గా మానిటరీ పాలసీ, ఫైనాన్షియల్‌ మార్కెట్లు, ఫైనాన్షియల్‌ స్థిరత్వం–రిసెర్చ్‌ విభాగం ఇన్‌చార్జ్‌గా వ్యవహరించారు. ఆరు నెలల ముందుగానే ఆయన అప్పట్లో  రాజీనామా చేశారు.   

విరాల్‌ రాసిన అంశాల్లో కొన్ని...
► ఆర్‌బీఐ ప్రతి సంవత్సరం తన లాభంలో కొంత భాగాన్ని ప్రభుత్వానికి అందజేస్తుంది.  2016 డిమోనిటైజేషన్‌కు ముందు మూడేళ్లలో ప్రభుత్వానికి రికార్డు లాభాలను బదిలీ చేసింది.
► నోట్ల రద్దు సంవత్సరంలో కరెన్సీ ముద్రణకు అయ్యే ఖర్చును  కేంద్రానికి చేసిన బదిలీల నుంచి మినహాయించింది.   ఫలితంగా 2019 ఎన్నికలకు ముందు ప్రభుత్వ నిధుల అవసరాలు మరింత పెరిగాయి. ఈ మొత్తాలను ఆర్‌బీఐ నుంచి పొందాలని బ్యూరోక్రాట్లు  కొందరు ప్రయతి్నంచారు.  
► స్వల్పకాలిక ప్రజాకర్షక వ్యయాల కోసం సెంట్రల్‌ బ్యాంక్‌ బ్యాలెన్స్‌ షీట్‌పై దాడి చేసే ప్రణాళికలను పదేపదే ప్రతిపాదించినప్పుడు.. సహేతుకమైన సంస్థలతో కూడిన ప్రజాస్వామ్యయుతంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్‌ను కలిగి ఉన్న దేశంలోని ఏ ప్రభుత్వమైనా బలీయమైన ప్రతిఘటనను ఎదుర్కొనకుండా ముందుకు సాగలేదు. ఇలాంటి సందర్భాలే ఒక సహేతుక వ్యవస్థ ఏర్పాటుకు దారితీస్తాయి. ఆర్‌బీఐ బ్యాలెన్స్‌ షీట్ల నుండి ప్రభుత్వానికి భవిష్యత్తులో బదిలీల కోసం సహేతుకమైన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించడానికి మాజీ గవర్నర్‌ బిమల్‌ జలాన్‌ ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు కావడం ఇలాంటిదే. ఆర్‌బీఐ బ్యాలెన్స్‌ షీట్‌ నుంచి భారీ నిధులు పొందాలని భావించిన వ్యక్తుల్లో పలువురిని ప్రభుత్వం పక్కన బెట్టడం కూడా జరిగింది.  


2018లోనే ‘విరాల్‌’ వెల్లడి..
నిజానికి 2018 అక్టోబర్‌ 26న ఏడీ ష్రాఫ్‌ స్మారక ఉపన్యాసం సందర్భంగానే విరాల్‌ ‘కేంద్రం– ఆర్‌బీఐ మధ్య విభేదాల  విభేదాల అంశాన్ని మొదటిసారి సూచనప్రాయంగా ప్రస్తావించారు.  తాజాగా అందుకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించారు. ‘‘కేంద్ర బ్యాంకు స్వాతం్రత్యాన్ని గౌరవించని ప్రభుత్వాలు తక్షణం లేదా అటు తరువాత ఆర్థిక మార్కెట్ల ఆగ్రహానికి గురవడం ఖాయం. ఆయా పరిణామాలు ఆర్థిక అనిశి్చతికి, రెగ్యులేటరీ ఫ్రేమ్‌వర్క్‌ దెబ్బతినే ప్రమాదానికి దారితీస్తాయి’’ అని ఆయన అప్పట్లో పేర్కొన్నారు.  
ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా ఇందుకేనా..?
తాజా అంశాలను విశ్లేíÙస్తే...సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా 2018 డిసెంబర్‌లో ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామాకు.. తాజాగా విరాల్‌ లేవనెత్తిన అంశానికీ ఏదైనా సంబంధం ఉందా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అప్పట్లో ఉర్జిత్‌ పటేల్‌ ‘‘వ్యక్తిగత కారణాలతో’’ సెంట్రల్‌ బ్యాంక్‌ గవర్నర్‌ బాధ్యతలకు రాజీనామా చేశారు. అప్పట్లో కేంద్రం–ఆర్‌బీఐ మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయన్న వార్తలు గుప్పుమన్నప్పటికీ  దీనికి స్పష్టమైన కారణాలు తెలియలేదు. మూడేళ్ల పదవీ కాలం ముగిసేలోగా తన బాధ్యతలను మధ్యలోనే వదిలేసిన గవర్నర్‌గా పనిచేసిన అరుదైన సందర్భం ఆయనది.

Advertisement
 
Advertisement
 
Advertisement