‘దిగిపోవాల్సిందే’.. సుందర్‌ పిచాయ్‌కు ‘జెమినీ’ గండం! | Sakshi
Sakshi News home page

‘దిగిపోవాల్సిందే’.. సుందర్‌ పిచాయ్‌కు ‘జెమినీ’ గండం!

Published Tue, Feb 27 2024 5:09 PM

Sunder Pichai Should Be Fired or Resign Says Investor Samir Arora - Sakshi

గూగుల్ (Google) తన బార్డ్ చాట్‌బాట్‌ని ఇటీవల జెమినీ (Gemini)గా పేరు మార్చింది. అట్టహాసంగా దీన్ని ప్రారంభించినప్పటికీ వరుస వైఫల్యాలు, వివాదాలతో ఈ సెర్చ్ ఇంజిన్ దిగ్గజంలో గందరగోళం చెలరేగింది. ఈ వ్యవహారం ఇప్పుడు కంపెనీ సీఈఓ సుందర్ పిచాయ్ మెడకు చుట్టుకున్నట్లు కనిపిస్తోంది. 

జెమిని వివాదం నేపథ్యంలో ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ తొలగింపును ఎదుర్కోవాల్సి ఉంటుందని లేదా త్వరలో పదవీ విరమణ చేయవచ్చని అంచనా వేస్తున్నట్లు ప్రముఖ ఇన్వెస్టర్‌, హెలియోస్ క్యాపిటల్ వ్యవస్థాపకుడు సమీర్ అరోరా తెలిపారు.

ఏఐ చాట్‌బాట్ జెమిని చుట్టూ తిరుగుతున్న వివాదాలపై ఒక యూజర్‌ తన అభిప్రాయాన్ని అడిగినప్పుడు అరోరా మైక్రో-బ్లాగింగ్ సైట్ ‘ఎక్స్‌’ (గతంలో ట్విటర్)లో తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. “నా అంచనా ప్రకారం ఆయన్ను (సుందర్‌ పిచాయ్‌) తొలగించాలి లేదా ఆయనే రాజీనామా చేయాలి. ఏఐ విషయంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. బాధ్యతలను ఇతరులకు అప్పగించాలి" అన్నారు.

ఏంటీ జెమినీ?
గూగుల్ ఇటీవల తన చాట్‌బాట్ బార్డ్‌ను జెమినీగా రీబ్రాండ్ చేసింది. గ్లోబల్ యూజర్ల కోసం ఈ కృత్రిమ మేధస్సు (AI) సాధనాన్ని అధికారికంగా ప్రారంభించింది. 230 కంటే ఎక్కువ దేశాలు, భూభాగాలలో విస్తరించి ఉన్న 40 భాషలలో యూజర్లు ఇప్పుడు జెమిని ప్రో 1.0 మోడల్‌తో ఇంటరాక్ట్‌ అవ్వొచ్చని టెక్ దిగ్గజం పేర్కొంది.

వివాదాలు
ప్రారంభించిన వారంలోపే జెమినీ ఏఐకి లింక్ చేసిన గూగుల్‌ కొత్త ఏఐ ఇమేజ్-జనరేటర్ చుట్టూ వివాదాలు తలెత్తాయి. ఏపీ నివేదిక ప్రకారం.. ఈ ఏఐ టూల్‌ వైఫల్యాన్ని అంగీకరిస్తూ ఫిబ్రవరి 23న గూగుల్‌ క్షమాపణ చెప్పింది. ఈ ఆందోళనలను పరిష్కరించడానికి చాట్‌బాట్ ఇమేజ్ జనరేషన్‌ను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. 

గూగుల్ సెర్చ్ ఇంజన్, ఇతర వ్యాపారాలను పర్యవేక్షిస్తున్న సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్ రాఘవన్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో యూజర్లకు క్షమాపణలు తెలిపారు. ఇక భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురించిన ఒక ప్రశ్నకు జెమినీ ఇచ్చిన సమాధానాల్లో పక్షపాతం ఉందన్న ఆరోపణలపై ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గూగుల్‌కు నోటీసు జారీ చేయాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం.

 
Advertisement
 
Advertisement