డిప్యూటీ సీఎం భట్టి ఇంట్లో బాంబు పెట్టానని 100కి అపరిచితుడి ఫోన్
ఉరుకులు, పరుగులతో పోలీసుల తనిఖీలు
నాలుగు గంటలకి పైగా క్షుణ్ణంగా పరిశీలన.. ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు
పంజగుట్ట: ‘‘ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఇంట్లో బాంబు పెట్టాం.. మరో కొద్దిసేపట్లో అది పేలబోతుంది..’’ అంటూ ఒక అగంతకుడు పోలీస్ కంట్రోల్‌రూం డయల్ 100కు ఫోన్ చేసి చెప్పడంతో పోలీసులు ఒక్కసారిగా ఉరుకులు పరుగులు పెట్టారు. సుమారు నాలుగు గంటలపాటు మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ మొత్తం తనిఖీ చేసి ఎలాంటి బాంబు లేదని తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసుల కథనం మేరకు.. మంగళవారం మధ్యాహ్నం 12:06 నిమిషాలకు పోలీస్ కంట్రోల్‌రూం 100కు ఓ అగంతకుడు ఫోన్ చేసి ప్రజాభవన్‌లోని మల్లు భట్టి విక్రమార్క ఇంటివద్ద బాబు పెట్టామని ఫోన్ చేశాడు. కంట్రోల్‌రూం సిబ్బంది 12:15కు పంజగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు.
వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇంటలిజెన్స్ సెక్యురిటీ వింగ్, సిటీ సెక్యురిటీ వింగ్ అధికారులను రంగంలోకి దింపారు. హుటాహుటిన నాలుగు డాగ్ స్క్వాడ్ బృందాలు, 10 బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్స్ బృందాలు రంగంలోకి దిగాయి. పంజగుట్ట ఏసీపీ మోహన్ కుమార్ నేతృత్వంలో అణువణువూ తనిఖీ చేశారు.
ఇకపై అక్కడ భారీ బందోబస్తు..: భట్టి ఇంటితోపాటు మంత్రి సీతక్క ఇంటిని, పరిసర ప్రాంతాలనూ చెక్ చేశారు. తరువాత ప్రజాభవన్ లోపల, పక్కనే ఉన్న మరోభవనం, అమ్మవారి ఆలయం సహా అన్నీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సుమారు 4 గంటలకు పైగా తనిఖీలు చేసి ఎక్కడా ఏమీ లేకపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇకపై ప్రజాభవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయించిన అధికారులు.. సందర్శకులను క్షుణంగా పరిశీలించాలని సిబ్బందికి ఆదేశించారు. కాగా, ప్రజాభవన్‌లో బాంబు ఉందని ఫోన్ చేసిన వ్యక్తి గురించి పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment