ఇజ్రాయెల్‌పై కొత్త ఒత్తిళ్లు | Sakshi Guest Column On New pressures on Israel | Sakshi
Sakshi News home page

ఇజ్రాయెల్‌పై కొత్త ఒత్తిళ్లు

Published Wed, May 29 2024 5:22 AM | Last Updated on Wed, May 29 2024 5:22 AM

Sakshi Guest Column On New pressures on Israel

విశ్లేషణ

పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ కొత్తగా నార్వే, స్పెయిన్, ఐర్లాండ్‌ ప్రకటన చేయడం ఇజ్రాయెల్‌ మీద ఒత్తిడిని పెంచింది. ప్రస్తుతం రఫా మీద భీకర దాడులు చేస్తున్న ఇజ్రాయెల్‌ ఇప్పటివరకూ సుమారు 36,000 మంది పాలస్తీనియన్ల మరణానికి కారణమైంది. అంతర్జాతీయ నేర న్యాయస్థానం ప్రాసిక్యూటర్‌ కరీం ఖాన్‌ ఏకంగా గాజా నేరాలపై విచారణ కోసం నెతన్యాహూకు అరెస్టు వారెంట్లు జారీ చేయవలసిందిగా కోర్టుకు ప్రతిసాదించారు. నిరుడు అక్టోబర్‌ 7న హమాస్‌ మిలిటెంట్ల దాడిలో సుమారు 1200 మంది యూదులు మృతి చెందడానికి ప్రతీకారంగా తమ ఆత్మ రక్షణ కోసం హమాస్‌ను పూర్తిగా నిర్మూలించటం తమ లక్ష్యమనీ, తమను నిందించవలసింది లేదనీ ఇజ్రాయెల్‌ వాదిస్తున్నది. దీన్ని ప్రపంచం నిరాకరిస్తున్నది.

పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తున్నట్లు మూడు యూరోపియన్‌ రాజ్యాలు ఈ నెల 22న ప్రకటించటంతో ఇజ్రాయెల్‌కు కొత్త చిక్కులు మొదలవుతున్నాయి. అమెరికా ఒత్తిళ్లను సైతం తోసిపుచ్చి నార్వే, స్పెయిన్, ఐర్లండ్‌లు ఈ ప్రకటన చేయటం గమనార్హం. పైగా వీటిలో నార్వే, స్పెయిన్‌ నాటో సభ్య దేశాలు. పాలస్తీనాను ప్రపంచంలో ఇప్పటికే 143 దేశాలు గుర్తించినందున ఆ జాబితాలో ఈ మూడు కూడా చేరటం వల్ల సాధారణంగానైతే విశేషం ఉండదు. కానీ ఇజ్రాయెల్‌ సైన్యం గాజాలో గత ఆరు మాసాలుగా సాగిస్తున్న మారణహోమం పట్ల ప్రపంచ వ్యాప్తమైన తీవ్ర నిరసనల మధ్య సైతం అమెరికన్‌ ప్రభుత్వం ఇజ్రాయెల్‌కు అడుగడుగునా మద్దతునిస్తున్న స్థితిలో, ఈ మూడు దేశాల ప్రకటనకు తగిన ప్రాముఖ్యత ఏర్పడుతున్నది. 

వీరి నిర్ణయంతో ఇజ్రాయెల్‌పై కలిగిన ఒత్తిడికి రుజువు కొద్ది గంటలలోనే కనిపించింది. నార్వే, ఐర్లండ్, స్పెయిన్‌ల నుంచి తమ రాయబారులను నెతన్యాహూ ప్రభుత్వం వెనక్కి రప్పించింది. తమ రాజధాని టెల్‌ అవీవ్‌లో గల ఆ మూడు దేశాల రాయబారులను పిలిపించి నిరసనను తెలియజేసింది. వారు పాలస్తీనియన్ల తీవ్రవాదాన్ని సమర్థిస్తున్నారనీ, తమకు గల ఆత్మ రక్షణ హక్కును గుర్తించటం లేదనీ, సమస్య పరిష్కారానికి ఆటంకాలు సృష్టిస్తున్నారనీ వ్యాఖ్యానించింది. అదే సమయంలో, గాజాపై తమ యుద్ధం యథావిధిగా కొనసాగగలదని స్పష్టం చేసింది. దీనిని బట్టి, మూడు యూరోపియన్‌ దేశాల ప్రకటన ఇజ్రాయెల్‌పై ఏవిధంగా ప్రత్యేకమైన ఒత్తిడిని సృష్టించిందో గ్రహించవచ్చు. 

ఈ విధమైన తీవ్ర ఒత్తిడి ఇది మూడవది కావటం మరొక గమనించదగ్గ పరిణామం. గతవారం ద హేగ్‌ లోని అంతర్జాతీయ నేర న్యాయస్థానం (ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు) ప్రాసిక్యూటర్‌ కరీం ఖాన్, గాజా నేరాలపై విచారణ కోసం నెతన్యాహూకు అరెస్టు వారెంట్లు జారీ చేయవలసిందిగా కోర్టుకు ప్రతిసాదించారు. అది ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంచలనమైంది. ఇజ్రాయెల్‌ అయితే భూమ్యాకాశాలను ఏకం చేయటం మొదలుపెట్టింది. అమెరికన్‌ బైడెన్‌ ప్రభుత్వమైతే కోర్టును ఖండించటమే గాక, ఆ న్యాయమూర్తులపై ఆంక్షలు విధించగలమనే స్థాయికి వెళ్ళింది. 

విశేషమేమిటంటే, స్వయంగా నాటో సభ్య దేశాలైన ఫ్రాన్స్, బెల్జియం మొదలైనవి కరీం ఖాన్‌ ప్రతిపాదనలను బలపరిచాయి. ఇందులో మరో విశేషం ఉన్నది. ఈ నాటో రాజ్యాలు ఒకవైపు అమెరికాతో పాటు ఇజ్రాయెల్‌కు ఆయుధ సరఫరా చేస్తున్నాయి. మరొకవైపు ఐక్యరాజ్య సమితిలో, భద్రతా సమితిలో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా అమెరికా ఓటు వేస్తున్నా అవి మాత్రం ఓటు వేయటం లేదు. పైగా ఇప్పుడు కరీం ఖాన్‌ చర్యను సమర్థిస్తున్నాయి. ఇది ఒక స్థాయిలో పరస్పర విరుద్ధమైన వైఖరి. కానీ వారనేది, ఇజ్రాయెల్‌ ఆత్మరక్షణ చేసుకోవలసిందే గానీ అంతర్జాతీయ నియమ నిబంధనలను ఉల్లంఘించకూడదని!

మొత్తానికి క్రిమినల్‌ కోర్టు పరిణామం ఇజ్రాయెల్‌పై ఇటీవలనే ఏర్పడిన మరొక ఒత్తిడి. ప్రాసిక్యూషన్‌ వారంట్ల జారీ ముగ్గురు హమాస్‌ అగ్ర నేతలకు కూడా జరగాలని కరీం ఖాన్‌ సిఫారసు చేశారు. దానిని హమాస్‌ కూడా ఖండించింది. కానీ ఇజ్రాయెల్‌ స్పందనలు విపరీత స్థాయిలో ఉన్నాయి. అమెరికాతో పాటు ఆ శిబిరానికి చెందిన కొన్ని దేశాలు అందుకు తోడయ్యాయి. ఇంతకూ కరీం ఖాన్‌ ప్రతిపాదనను చివరికి కోర్టు ఆమోదిస్తుందా, మార్పులు చేస్తుందా, తిరస్కరిస్తుందా తెలియదు. ఒకవేళ ఆమోదిస్తే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. హమాస్‌ నేతలు అజ్ఞాతంలో ఉన్నందున వారి అరెస్టు సాధ్యం కాదు. నెతన్యాహూ ఇజ్రాయెల్‌లో ఉన్నంతకాలం ఆయన అరెస్టూ వీలుకాదు. 

ఇందులో మరొక మెలిక ఉంది. కోర్టులో సభ్యత్వం గల దేశాలకు వెళ్లినట్టయితే మాత్రమే వారంట్లు వర్తిస్తాయి. ఆ యా ప్రభుత్వాలు వారిని అరెస్టు చేయక తప్పదు. ప్రస్తుతం ఆ సభ్య దేశాల సంఖ్య 124. వాటిలో అమెరికా, రష్యా, చైనా, ఇండియా వంటివి లేవు. సభ్య దేశాలలో అమెరికా లేదు గాని యూరోపియన్‌ యూనియన్‌లోని మొత్తం 27 దేశాలకూ సభ్యత్వం ఉంది. ఇది నెతన్యాహూకే గాక అమెరికాకు కూడా చాలా చిక్కులు తెచ్చి పెట్టే స్థితి. 

నెతన్యాహూకు వారంట్లు జారీ కావచ్చుననే చర్చ ఇప్పటికే వారం రోజులుగా సాగుతున్నది. దానితో, ఏమి చేయాలంటూ అమెరికా, యూరోప్‌ ఇప్పటికే తలలు పట్టుకుంటున్నాయి. కొందరు అటు, కొందరు ఇటుగా చీలిపోయారు. వారికి సంకట పరిస్థితి ఏమంటే, ప్రపంచ వ్యవహారాలన్నీ నియమ నిబంధనల ప్రకారం సాగాలని పట్టుదలగా వాదించేది వారే. అటువంటప్పుడు, తామే ఒప్పందంపై సంతకాలు చేసిన అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు వారంట్లను ఎట్లా తిరస్కరించగలరు? ఈ స్థితి నెతన్యాహూను గత పదిరోజులుగా భయపెడుతున్నది. 

ఆయనపై తీవ్రమైన ఒత్తిడిని సృష్టించిన మూడవ పరిణామం అంతర్జాతీయ న్యాయస్థానం గత జనవరిలో చెప్పిన వ్యతిరేక తీర్పు. గాజాలో ఇజ్రాయెల్‌ అమాయక పౌరుల సామూహిక హననానికి, విధ్వంసానికి పాల్పడుతున్నదనీ, వేలాదిమంది స్త్రీ పురుషులు, పిల్లలు, వృద్ధులు, రోగులు ప్రాణాలు కోల్పోయారనీ, ప్రజలకు ఆహార పానీయాలు, మందులు సైతం అందకుండా నిర్బంధాలు విధిస్తున్నారనీ దక్షిణాఫ్రికా ప్రభుత్వం ఆ న్యాయస్థానంలో కేసు వేసింది. అప్పుడు కూడా ఇజ్రాయెల్‌ నానా హంగామా సృష్టించింది. అయినా కోర్టు ఇజ్రాయెల్‌కు వ్యతిరేక తీర్పునిచ్చింది. 

అయినప్పటికీ ఇజ్రాయెల్‌ మారణకాండ ఆగలేదు. దక్షిణాఫ్రికా ఆరోపణలు నిజమైనట్లు అనేక స్వతంత్ర సంస్థల నివేదికలే గాక, సాక్షాత్తూ ఐక్యరాజ్య సమితి, ప్రపంచ ఆహార సంస్థ, ప్రపంచ ఆరోగ్య సంస్థ, మానవ హక్కుల సంస్థల నివేదికలు కూడా ధ్రువీకరించాయి. అయినప్పటికీ, నిరుడు అక్టోబర్‌ 7న హమాస్‌ మిలిటెంట్ల దాడిలో సుమారు 1200 మంది యూదులు మృతి చెందడానికి ప్రతీకారంగా తమ ఆత్మ రక్షణ కోసం హమాస్‌ను పూర్తిగా నిర్మూలించటం తమ లక్ష్యమనీ, ఆ క్రమంలోనే ఇప్పటికి దాదాపు 35,000 పాలస్తీనియన్లు మరణించారనీ, అందులో తమను నిందించవలసింది లేదనీ ఇజ్రాయెల్‌ వాదిస్తున్నది. ఈ వాదనలను అత్యధిక ప్రపంచం నిరాకరిస్తున్నది.

ఇక్కడ రెండు సమస్యలున్నాయి. మొదటిది, ఇజ్రాయెల్‌కు అమెరికా మద్దతు. రెండవది, మౌలికంగా పాలస్తీనా సమస్య దశాబ్దాల పాటు పరిష్కారం కాకుండా పెచ్చరిల్లుతుండటం. ఇటీవల ఇంత జరుగుతున్నా అమెరికన్లు ఇజ్రాయెల్‌కు వేలకు వేల కోట్ల డాలర్ల ఆయుధాలు సరఫరా చేస్తూ, ఆర్థికసాయం కూడా పంపుతున్నారు. ఐక్యరాజ్య సమితిలో ఇజ్రాయెల్‌కు అనుకూలంగా ఓటు వేస్తూ, భద్రతా సమితిలో వీటోను ఉపయోగిస్తున్నారు. పాలస్తీనా రాజ్యం ఏర్పాటును వ్యతిరేకిస్తూ, అటువంటి ఒప్పందం అంటూ జరిగితే అది ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య చర్చల ద్వారా జరగవలసిందే తప్ప బయటి జోక్యంతో కాదని విచిత్రమైన వాదన చేస్తున్నారు. 

మరొకవైపు ఇజ్రాయెల్‌ మాత్రం పాలస్తీనా ప్రసక్తే లేదనీ, తామే ఆ భూభాగాలను నియంత్రించగలమనీ అంటున్నది. గాజా బయట వెస్ట్‌ బ్యాంక్‌ ప్రాంతంలో  యూదు సెటిలర్లు క్రమక్రమంగా పెరిగిపోతూ అక్కడి పాలస్తీనియన్లను నిర్మూలిస్తున్నారు. అయినప్పటికీ అమెరికా ఈ విధమైన వైఖరి తీసుకోవటానికి ఏకైక కారణం వారి సామ్రాజ్యవాద ప్రయోజనాలు. మొదటి నుంచి ఇప్పటి వరకూ అంతే. కనుకనే తాము స్వయంగా నిర్వహించిన క్యాంప్‌ డేవిడ్, ఓస్లో ఒప్పందాల ప్రకారం గానీ, ఐక్యరాజ్యసమితి తీర్మానాల ప్రకారం గానీ పాలస్తీనా దేశాన్ని ఏర్పడనివ్వటం లేదు. వారిని ధిక్కరించి ఇప్పుడు నార్వే, స్పెయిన్, ఐర్లండ్‌లతో కలిపి (ఇండియా సహా) 146 ప్రపంచ దేశాలు స్వతంత్ర పాలస్తీనాను గుర్తిస్తున్నాయి.

టంకశాల అశోక్‌ 
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకులు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement