అంతకంతకూ తీవ్రమవుతున్న పాలస్తీనా సంక్షోభం వారం రోజుల్లో అనేక మలుపులు తిరిగింది. దక్షిణాఫ్రికా వేసిన జాతి విధ్వంసం కేసులో అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) చేసిన ప్రాథమిక నిర్దేశం ఒకవైపు, పాలస్తీనా శరణార్థులకై ఏర్పాటైన ఐరాస సహాయ సంస్థ ‘యూఎన్‌ఆర్‌డబ్ల్యూఏ’ (అన్‌రా)కు నిధులు ఆపేస్తున్నట్టు అమెరికా, మరో 8 దేశాలు ప్రకటించడం మరోవైపు, అమెరికా శిబిరాలపై డ్రోన్ దాడులు ఇంకోవైపు... ఇలా అనేక పరిణామాలు సంభవించాయి. గాజా యుద్ధానికి దారి తీసిన అక్టోబర్ 7 నాటి ‘హమాస్’ ఆకస్మిక దాడి, అపహరణలు, హత్యల్లో ‘అన్‌రా’ సిబ్బంది కొందరు పాలుపంచుకున్నారని ఇజ్రాయెల్ ఆరోపణ. 190 మంది దాకా ‘అన్‌రా’ ఉద్యోగులు ఇస్లా మిక్ జిహాదీ తీవ్రవాదులైన ‘హమాస్’ వర్గీయులుగానూ వ్యవహరించారని అది అంటోంది. అయితే కొందరు తప్పు చేశారని గాజాలోని లక్షల మందికి ప్రాణాధారాన్ని ఆపేయరాదని ఐరాస అభ్యర్థన.
ఎప్పుడో 1948లో అరబ్ – ఇజ్రాయెలీ యుద్ధం సందర్భంగా దాదాపు 7 లక్షల మంది పాలస్తీనీయులు ఇప్పుడు ఇజ్రాయెల్ అంటున్న ప్రాంతంలోని తమ ఇల్లూ వాకిలీ వదిలేసి పోవాల్సొచ్చింది. ఆ శరణార్థుల సాయానికై 1949లో ‘అన్‌రా’ ఏర్పాటైంది. గాజా, ఇజ్రాయెల్ ఆక్రమిత వెస్ట్ బ్యాంక్, లెబనాన్, సిరియా, జోర్డాన్‌లలో విద్య, ఆరోగ్యం, సహాయ, సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టే ఈ సంస్థ ద్వారా సుమారు 59 లక్షల మంది పాలస్తీనా శరణార్థులు సాయం పొందుతున్నారు. ఇప్పటికే మానవీయ సంక్షోభంలో చిక్కుకున్న గాజాలోని ప్రజానీకానికి తిండి, నీళ్ళు అందిస్తున్నది ప్రధానంగా ఈ సంస్థే. అమెరికా లాంటి పలు దేశాల స్వచ్ఛంద విరాళాలతో నడిచే ఆ సంస్థపై ఆరోపణలు చేసి, నిరూపించకుండానే నిధులు ఆపేస్తే లక్షలాది అమాయకుల పరిస్థితి ఏమిటి?
ఐరాస శరణార్థి సహాయ సంస్థకు నిధులిచ్చే దేశాల మాట అటుంచితే, అసలు సామాన్య పౌరులకు కష్టం వాటిల్లకుండా చేయగలిగినదంతా చేయాలంటూ అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) నిర్దేశించింది. అయినా ఇజ్రాయెల్ పెడచెవిన పెడుతోంది. గాజా ప్రాంతంపై దాడులు కొనసాగిస్తూ, అమాయకుల ఆయువు తీస్తోంది. ఆ మధ్య కొద్దివారాల పాటు గాజాలోని ప్రధాన నగరం నుంచి వెనక్కి తగ్గినట్టే తగ్గిన ఇజ్రాయెల్ సోమవారం మళ్ళీ భీకర దాడులకు దిగింది. ఇజ్రాయెల్ అమానవీయ యుద్ధంలో ఇప్పటికే 26.5 వేల మంది పాలస్తీనీయులు మరణించారు. తీరం వెంట ధ్వంసమైన భవనాల శిధిలాల కింద ఇంకెన్ని వేల మృతదేహాలున్నాయో తెలీదు. అంతకంతకూ క్షుద్రమవుతున్న ఈ యుద్ధం ఎప్పటికి ముగుస్తుందో తెలియని పరిస్థితి. ఇక, గాజా ప్రకంపనలు ఇతర చోట్లకూ విస్తరించాయి. ఆదివారం సిరియా సరిహద్దు సమీపంలోని జోర్డాన్ ఈశాన్య ప్రాంతంలో డ్రోన్ దాడులు జరిగాయి. అమెరికా సైనికులు ముగ్గురు మరణించారు.
ఈ దాడులు ఇరాన్ అండతో సిరియా, ఇరాక్‌లలో నడుస్తున్న తీవ్రవాద వర్గాల పని అన్నది అమెరికా మాట. ఆ పాపంలో తమకేమీ భాగం లేదన్నది ఇరాన్ ఖండన. నిజానికి, ఇజ్రాయెల్ – హమాస్‌ల మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి పశ్చిమాసియాలో పలు ప్రాంతాల్లో ఉన్న అమెరికా సైనిక శిబిరాలపై పదులకొద్దీ దాడులు జరిగాయి. అమెరికాకు ప్రాణనష్టం మాత్రం ఇదే తొలిసారి. ఇజ్రాయెల్ భీకర ప్రతీకార యుద్ధాన్ని గుడ్డిగా సమర్థిస్తూ వస్తున్న అగ్రరాజ్య విస్తృత రక్షణ వ్యవస్థల్ని దాటుకొని మరీ ఈ దెబ్బ తగలడం గమనార్హం. దాంతో, అమెరికా అధినేత సైతం ఇరాన్ మద్దతున్న తీవ్రవాదవర్గాలపై ప్రతీకార దాడులు చేయాలని హూంకరించారు. అలాగని నేరుగా ఇరాన్‌పై దాడికి దిగలేదు. ఆ దేశాన్ని లక్ష్యంగా చేసుకోవాలని నేతలు కోరినా, అది తేనెతుట్టెపై రాయి వేయడమే. ఆ ప్రాంతంలో దీర్ఘకాలంగా నిలబడి కలబడుతున్న తీవ్రవాద బృందాలే అందుకు సాక్ష్యం.
ప్రాంతీయ పోరాటాల్లో తలదూర్చినప్పుడల్లా తలబొప్పి కడుతూనే ఉందని అగ్రరాజ్యం మర్చి పోకూడదు. పశ్చిమాసియాలో ఇప్పటికే దానికి అనేక శత్రువులున్నారు. ఇరాన్‌పై దుందుడుకుగా ప్రవర్తిస్తే పరిస్థితి చేయి దాటుతుంది. చివరకు ఈ యుద్ధం ప్రపంచ స్థాయిలో పెద్దదవుతుంది. ఇటీవల ఎర్రసముద్రంలోని దాడులతో అస్తుబిస్తు అవుతున్న ప్రపంచ వాణిజ్యానికి అది మరో అశని పాతం అవుతుంది. అది గ్రహించే అమెరికా అనివార్యంగా సంయమనం చూపాల్సి వచ్చింది.
ఇంకోపక్క మరో విడత కాల్పుల విరమణకై అరకొర ప్రయత్నాలు సాగుతున్నా, అవేవీ ఫలించడం లేదు. తాజాగా అమెరికా గూఢచారి సంస్థ సీఐఏ అధినేత ఆదివారం ప్యారిస్‌లో ఇజ్రాయెల్, ఈజిప్టు, ఖతార్‌కు చెందిన ఉన్నతాధికారులను కలిశారు. మిగిలిన బందీలను హమాస్ విడుదల చేస్తే, మరొక సారి కాల్పుల విరమణ పాటించేలా చర్చించి, ఒప్పించాలని ప్రయత్నం. కానీ, ఫలితం శూన్యం.
ఇజ్రాయెల్ సైనికచర్యను తప్పుబడుతూ దక్షిణాఫ్రికా వేసిన జాతి విధ్వంసం కేసు తేలేసరికి ఏళ్ళు పడుతుంది. ఈలోగా ఐసీజే గురువారం ఇచ్చిన ప్రాథమిక నిర్దేశం ఏ పక్షం వైపూ మొగ్గకుండా ఆచరణాత్మక ధోరణిలో సాగింది. గాజాలో అత్యవసర ప్రాథమిక సేవలు, మానవతా సాయం అందించాలని టెల్ అవీవ్‌ను కోరింది. అదే సమయంలో హమాస్ చేతిలోని బందీల పట్ల ఆందోళన వెలి బుచ్చుతూ, వారి విడుదలకు పిలుపునిచ్చింది.
ఇలాంటి సమతూక ధోరణినే ఆశ్రయిస్తూ అమెరికా, ఐరోపా సమాజం సహా పాశ్చాత్యదేశాలన్నీ చర్చలతో పరిష్కారానికి మనసు పెట్టాలి. అంతు లేని యుద్ధానికి ఇజ్రాయెల్‌ను అనుమతిస్తున్న తమ విధానాలపై పునరాలోచన చేయాలి. ఆచరణాత్మక పరిష్కార మార్గాన్ని అన్వేషించాలి. ఇరుపక్షాలనూ అంగీకరింపజేయాలి. కొందరు తప్పు చేశారని, ‘అన్‌రా’ నిధులను ఆపి అందరినీ శిక్షించడం శాంతిస్థాపనకు దోహదం చేయదని గ్రహించాలి.
తప్పొకరిది! శిక్ష అందరికా?
Published Wed, Jan 31 2024 3:17 AM | Last Updated on Wed, Jan 31 2024 3:17 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment