YSRCP MP Vijaya Sai Reddy Analysis On India-USA Immigration - Sakshi
Sakshi News home page

అమెరికా నుంచి ఇండియాకు తిరిగొస్తున్నవారు ఎక్కువా?

Published Mon, Jul 3 2023 12:05 PM

Ysrcp Mp Vijayasai Reddy Analysis On India, America Immigration - Sakshi

అమెరికా నుంచి ఇండియాకు తిరిగొస్తున్నవారు ఎక్కువా? దేశం వదలి పాశ్చాత్య దేశాలకు వలసపోతున్న జనం ఎక్కువా? వృత్తి నిపుణుల వలసలపై ఎడతెగని చర్చ 

ఇండియా నుంచి సంపన్నులు భారత పౌరసత్వం వదులుకుని పాశ్చాత్య దేశాల్లో ఎందుకు స్థిరపడుతున్నారు? అమెరికా వంటి పారిశ్రామిక దేశాల్లో చదువుకుని, కొన్నేళ్లు ఉద్యోగం చేశాక ఇండియా వచ్చేసి కొత్త వ్యాపారాలు పెట్టుకునే నిపుణులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నారా? దేశం విడిచి అభివృద్ధిచెందిన దేశాలకు పోతున్నవారు, స్వదేశానికి తిరిగొస్తున్న భారతీయుల్లో...ఎవరు ఎక్కువ? ఈ రెండు రకాల వలసలపై మధ్య తరగతి ప్రజల్లో చర్చ జరుగుతోంది. ఏ దేశంలోనైనా చదువు, సంపద, పారిశ్రామికీకరణ, మరీ ముఖ్యంగా జనాభా పెరిగినప్పుడు ఆ దేశం నుంచి సంపన్నులు, ఉన్నత విద్యావంతులు అత్యున్నత ప్రగతి సాధించిన దేశాలకు పోయి స్థిరపడతారు.

‘రవి అస్తమించని సామ్రాజ్యం’ నెలకొల్పిన గ్రేట్‌ బ్రిటన్‌ నుంచే పెద్ద సంఖ్యలో జనం అమెరికాకు 19వ శతాబ్దం నుంచి వలసపోవడం భారీగా మొదలైంది. 1820–1957 మధ్యకాలంలో అంటే 137 ఏళ్లలో ఇంగ్లండ్‌ నుంచి అమెరికా వెళ్లి స్థిరపడిన ఆంగ్లేయుల సంఖ్య 45 లక్షలు. బ్రిటన్‌ నుంచి జనం పెద్ద సంఖ్యలో 1860లు, 70లు, 80ల్లో అట్లాంటిక్‌ మహాసముద్రం దాటి అతిపెద్ధ వైశాల్యం ఉన్న అమెరికాకు వలసపోయారు. ఒక్క 1888లోనే ఇంగ్లండ్‌ నుంచి 11 లక్షల మంది అమెరికా వెళ్లిపోయారు.

మరి, అప్పటికి ఎంతో ప్రగతి సాధించిన సామ్రాజ్యవాద శక్తి బ్రిటన్‌ నుంచే అంత మంది ప్రజలు ఎందుకు వెళ్లిపోయారు? 19వ శతాబ్దంలో అమెరికా అభివృద్ధిపథంలో వేగంగా పయనిస్తూ అందించే మెరుగైన అవకాశాలను అందిపుచ్చుకోవడానికే వారు వలసపోయారు. అంతేగాని స్వదేశంలో వేధింపులు ఉన్నాయనో, భవిష్యత్తు లేదనే నిరాశతోనో ఇంగ్లిష్‌ ప్రజలు దేశం వదలిపోలేదు. ఇప్పుడు 21వ శతాబ్దం ప్రథమార్ధంలో అన్ని రంగాల్లో పరుగులు పెడుతున్న ఇండియా నుంచి జనం అమెరికా, ఐరోపా, ఇతర అభివృద్ధిచెందిన దేశాలకు వలసపోవడం కూడా అత్యుత్తమ అవకాశాల కోసమే. ఇండియాలో తమకు గొప్ప జీవనశైలి, భద్రత ఉండదనే నైరాశ్యంతో కాదు.

బ్రిటిష్‌ వారి హయాంలోనే ఇండియా నుంచి వలసలు
బ్రిటిష్‌ వారి వలస పాలనలోని గయానా, మారిషస్, ఫిజీ, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లోని చెరకు తోటలు, ఇతర వ్యవసాయ క్షేత్రాల్లో ఒప్పంద కార్మికులుగా పనిచేయడానికి ఇండియా నుంచి జనం పెద్ద సంఖ్యలో వెళ్లడం 1834లో ఆరంభమైంది. ఆ తర్వాత బ్రిటిష్‌ పాలకుల వేధింపులు తట్టుకోలేక కొందరు, మెరుగైన విద్యార్హతలతో ఉత్తమ ఉపాధి అవకాశాల కోసం మరి కొందరు పాశ్చాత్య దేశాలకు వలసపోయారు. ఇలా ఇతర దేశాలకు వెళ్లినవారిలో కొందరు నాయకత్వ లక్షణాలు అలవర్చుకుని కొన్ని ప్రజాస్వామ్య రాజ్యాల్లో దేశాధినేతలు అయ్యారు.

ప్రస్తుతం దాదాపు 200 మందికి పైగా భారత సంతతికి చెందిన ప్రముఖులు కనీసం 15 దేశాల్లో ఉన్నత పదవుల్లో నేడు కొనసాగుతున్నారు. వారిలో అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, ఇంగ్లండ్‌ ప్రధాని రిషి సునాక్, గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్‌ అలీ, ప్రపంచ బ్యాంక్‌ అధ్యక్షుడు అజయ్‌ పాల్‌ సింగ్‌ బంగా ప్రముఖులు. ఇప్పుడు చరిత్రలోకి తొంగి చూసి పై విషయాలన్నీ చెప్పడానికి కారణాలున్నాయి. ఇండియా నుంచి మిలియనీర్లు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఇతర దేశాలకు వెళ్లిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. 2011 నుంచీ 16 లక్షల మంది సంపన్నులు భారత పౌరసత్వం వదులుకున్నారని ప్రభుత్వ గణాంకాలు చెబతున్నాయి. ద్వంద్వ పౌరసత్వానికి వీలులేనందు వల్ల ఇతర దేశాల పౌరసత్వం తీసుకునే ప్రజలు తమ భారత పౌరసత్వం వదులుకోవాల్సివస్తోంది. ఒక్క 2022లోనే 2,25,62 మంది భారతీయులు ఇతర దేశాల పౌరసత్వం తీసుకున్నారని ఈ గణాంకాలు చెబుతున్నాయి.

పైన చెప్పుకున్నట్టు మెరుగైన అవకాశాలు, భిన్నమైన జీవనశైలి కోసం 140 కోట్ల జనాభా దాటిన ఇండియా నుంచి కొన్ని లక్షల సంఖ్యలో ధనికులు ఇతర దేశాలకు వలసపోవడం ఆందోళన కలిగించే అంశమేమీ కాదని సామాజిక, ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అదీకాక, అమెరికాలో ఉన్నత విద్యనభ్యసించి పదేళ్లకు పైగా అక్కడ ఉద్యోగం చేసిన పలువురు భారతీయలు అనేక కారణాలతో స్వదేశానికి తిరిగొచ్చి వినూత్న తరహాలో వ్యాపారాలు పెట్టుకుని విజయాలు సాధిస్తున్నారని కూడా మీడియాలో చదువుతూనే ఉన్నాం. ఇలాంటి వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. అపూర్వ ప్రగతి సాధిస్తున్న దేశాల నుంచి సైతం కొందరు వలసపోవడం అత్యంత సహజ పరిణామమేగాని పెద్దగా దిగులుపడాల్సిన విషయం కాదు.


- విజయసాయిరెడ్డి, వైఎస్సార్‌సీపీ, రాజ్యసభ ఎంపీ. 

Advertisement
 
Advertisement
 
Advertisement