కరోనా : బిజినెస్ టైకూన్‌కు జైలు భారీ జరిమానా | Sakshi
Sakshi News home page

కరోనా : బిజినెస్ టైకూన్‌కు జైలు, భారీ జరిమానా

Published Tue, Sep 22 2020 2:07 PM

Chinese tycoon Ren Zhiqiang jailed for criticising Xi Jinping COVID-19response - Sakshi

బీజింగ్ : ప్రభుత్వంపై విమర్శలకు చేసినందుకు గాను చైనాకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిలియనీర్ రెన్ జికియాంగ్ (69) కు మరోసారి భారీ షాక్ తగిలింది. కరోనా వైరస్ మహమ్మారి నిర్వహణలో చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్  సర్కార్  విఫలమైందంటూ బహిరంగంగా విమర్శించిన ప్రభుత్వ యాజమాన్యంలోని రియల్ ఎస్టేట్ కంపెనీ మాజీ చైర్మన్ రెన్‌కు అవినీతి ఆరోపణలపై 18 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. పలు ఆరోపణలపై రెన్‌ను బీజింగ్‌లోని ఒక న్యాయస్థానం మంగళవారం దోషిగా తేల్చింది. ముఖ్యంగా సుమారు 16.3 మిలియన్ల డాలర్ల (110.6 మిలియన్ యువాన్లు) ప్రజా నిధుల అక్రమాలు, లంచాలు, అధికార దుర్వినియోగం లాంటి ఆరోపణలను విచారించిన కోర్టు జైలు శిక్షతోపాటు, 620,000 డాలర్ల (4.2 మిలియన్ యువాన్లు) జరిమానా కూడా విధించింది. అంతేకాదు రెన్‌ అక్రమసంపాదను ప్రభుత్వానికి స్వాధీనం చేయడంతోపాటు,  తన నేరాలన్నింటినీ స్వచ్ఛందంగా అంగీకరించాడని కోర్టు తెలిపింది.

చైనా ట్రంప్ గా పేరొందిన రెన్ జికియాంగ్ చిక్కుల్లో పడటం ఇదే మొదటి సారి కాదు. చైనా అధ్యక్షుడు జింపింగ్ పై తీవ్ర విమర్శలతో గతంలో వార్తల్లో నిలిచారు. కమ్యూనిస్ట్ పార్టీ పాలక కుటుంబంలో జన్మించిన రెన్ తరచుగా చైనా రాజకీయాలపై బహిరంగంగా, సూటిగా విమర్శలు గుప్పించేవారు. అందుకే  చైనా సోషల్ మీడియాలో "ది కానన్" అనే పేరు వచ్చింది. ఈ క్రమంలో గత మార్చిలో ప్రభుత్వ విధానాలు, పత్రికా స్వేచ్ఛ, అసమ్మతిపై ఒక వ్యాసాన్ని ప్రచురించారు. చైనా ప్రజల భద్రత కంటే తన సొంత ప్రయోజనాలపై ప్రభుత్వం దృష్టిపెడుతోందని ఆరోపించారు. అలాగే వుహాన్‌లో డిసెంబర్‌లో ప్రారంభమైన వ్యాప్తిని  జిన్‌పింగ్ తప్పుగా నిర్వహించాడని ఆరోపించడం దుమారం రేపింది. వాస్తవాలను ప్రచురించకుండా మీడియాకు అడ్డంకులు, సరైన నిర్వహణ వ్యవస్థలేకుండా కరోనావ్యాప్తి ఈ రెండింటి ద్వారా ప్రజల జీవితాలు నాశన మవుతున్నాయని రెన్ ఆరోపించారు. ఈ వ్యాసం ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో జూలైలో రెన్‌ను పార్టీ నుండి బహిష్కరించడంతో పాటు, పలు అవినీతి ఆరోపణలతో విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. 

2016లో కూడా ప్రభుత్వాన్ని విమర్శించినందుకు క్రమశిక్షణా చర్యకు గురైన రెన్‌కు ఇక రెండో అవకాశం లేదని అక్కడి రాజకీయ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. కరోనాపై ప్రపంచాన్నితప్పుదారి పట్టించిందంటూ  చైనాపై అంతర్జాతీయంగా విమర్శలు, ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో బహిరంగ విమర్శలు లేదా ధిక్కరణను సహించేది లేదనే సందేశాన్ని అక్కడ ప్రభుత్వం ఇస్తోందని పేర్కొన్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement