యూఏఈలో అనూహ్య వర్షాలు | Sakshi
Sakshi News home page

యూఏఈలో అనూహ్య వర్షాలు

Published Thu, Apr 18 2024 5:34 AM

Dubai airport runway flooded as heavy rains - Sakshi

నీట మునిగిన దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌!

దుబాయ్‌: మాడ పగిలిపోయే ఎండ వేడికి, ఎడారులకు నిలయమైన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ను భారీ వర్షాలు పలకరించాయి. బుధవారం కుండపోత వర్షాలతో యూఏఈ తడిసి ముద్దయింది. భారీ వర్షాలను తట్టుకునే ఏర్పాట్లేవీ పెద్దగా లేకపోవడంతో దుబాయ్‌ అంతర్జాతీయ విమానాశ్రయం రన్‌వే మొత్తం నీట మునిగింది. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీ ఎయిర్‌పోర్ట్‌గా ఖ్యాతికెక్కిన దుబాయ్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

ఎయిర్‌పోర్ట్‌ పార్కింగ్‌ ప్రాంతంలోని కార్లు మునిగిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఒకటిన్నర సంవత్సరంలో పడాల్సిన వర్షపాతం బుధవారం ఒక్కరోజే నమోదైందని సిటీ వాతావరణ శాఖ వెల్లడించిన గణాంకాల్లో తేలింది. 14.2 సెంటీమీటర్లమేర వర్షపాత నమోదైందని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా స్కూళ్లు మూసేశారు. సమీప బహ్రెయిన్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియాల్లోనూ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల కారణంగా జరిగిన ఆస్తినష్టాల వివరాలను ప్రభుత్వం బయటపెట్టలేదు. వర్షాల కారణంగా భారత్‌ నుంచి దుబాయ్‌కు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అయితే మేఘమథనం వల్లే ఈ వర్షాలు కురిశాయని నిపుణుల అంచనా.

Advertisement
 
Advertisement