చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్‌, ట్రంప్‌! | Sakshi
Sakshi News home page

చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్‌, ట్రంప్‌!

Published Wed, May 15 2024 12:02 PM

Joe Biden And Donald Trump Sensational Comments Over China

అగ్ర రాజ్యం అమెరికాలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్‌, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. ఈ తరుణంలో ట్రంప్‌.. చైనాపై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు.

కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్‌ ట్రంప్‌ మాట్లాడుతూ.. అమెరికాలో చైనా తన సైన్యాన్ని నిర్మిస్తోందని ఆరోపించారు. చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘మిలిటరీ ఏజ్‌’లో ఉన్న ఆ దేశ పౌరులు ఓ సైన్యంగా మారేందుకు అమెరికాకు వస్తున్నారని, వాళ్లు సైన్యంగా మారి దాడిచేస్తారని అన్నారు. వీరిలో యువకులే ఎక్కువగా ఉన్నారు. వారిని చూస్తుంటే మన దేశంలో చిన్న సైన్యాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారా అనిపిస్తోంది. వారి ప్రయత్నం కూడా అదేనా? అంటూ ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఇలాంటి వారికి తగిన బుద్ధిచెబుతామన్నారు.

ఇదిలా ఉండగా.. కోవిడ్‌ పరిణామాల అనంతరం అమెరికాకు చైనాకు అక్రమ వలసలు పెరిగినట్టు అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కోవిడ్‌ తర్వాత ఎక్కువ సంఖ్యలో చైనీయులు.. దక్షిణ అమెరికాకు విమానాల్లో చేరుకొని.. అక్కడి నుంచి ప్రమాదకరమైన మార్గాల్లో, కాలినడకన ఉత్తర అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపైనే ట్రంప్‌ తాజాగా ఆరోపణలు చేశారు.

మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. చైనాకు షాకిచ్చారు. బ్యాటరీలు, ఈవీలు, స్టీల్, సోలార్ సెల్స్, అల్యూమినియంతో సహా చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ భారీ సుంకాలను విధించారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలపై 100%, సెమీకండక్టర్లపై 50% సుంకం, చైనా నుండి దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలపై 25% సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో బైడెన్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు కావాల్సింది చైనాతో వివాదం కాదు. పోటీ కావాలి అని చెప్పుకొచ్చారు. ఆర్థికంగా చైనాతో పోటీ పడటానికి తాము మెరుగైన స్థితిలో ఉన్నట్టు చెప్పుకొచ్చారు. 

 

Advertisement
 
Advertisement
 
Advertisement