భారత్‌పై జో బైడెన్‌ షాకింగ్‌ కామెంట్స్‌ | Sakshi
Sakshi News home page

భారత్‌కు ‘జోనోఫోబిక్‌’.. బైడెన్‌ షాకింగ్‌ కామెంట్స్‌

Published Fri, May 3 2024 9:26 AM

Joe Biden Says India And Some Countries Are 'xenophobia'

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. భారత్‌ తమ దేశంలోకి విదేశీ వలసదారులను అనుమతించేందుకు భయపడుతుందని తీవ్ర ఆరోపణలు చేశారు. అందుకే భారత్‌ వంటి దేశాల్లో ఆర్థిక అభివృద్ధి వేగంగా లేదని చురకలించారు.

కాగా, వాషింగ్టన్‌లో పార్టీ నిధుల సేకరణ కార్యక్రమంలో జో బైడెన్‌ మాట్లాడుతూ.. భారత్‌, జపాన్‌, చైనా, రష్యా దేశాలపై విరుచుకుపడ్డారు. ఈ దేశాలు విదేశీ వలసదారులను తమ దేశంలోకి ఆహ్వానించేందుకు భయపడుతున్నాయి. అందుకే వాటి ఆర్థిక వ్యవస్థలు వేగంగా వృద్ధి చెందకుండా ఇబ్బంది పడుతున్నాయన్నారు. కానీ, అమెరికా విదేశీ వలసదారులను స్వాగతిస్తుందన్నారు. ఈ కారణంగానే వారు దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమయ్యేందుకు కృషి చేస్తుంటారని చెప్పుకొచ్చారు.

 

ఈ క్రమంలో భారత్‌, జపాన్‌, చైనా, రష్యా దేశాలను ‘జెనోఫోబిక్‌’ (విదేశీయుల పట్ల విద్వేషం, భయం) దేశాలంటూ విమర్శించారు. ఈ సందర్బంగా అమెరికాను హైలైట్‌ చేసే ప్రయత్నం చేశారు బైడెన్‌. అయితే, ఎన్నికల సందర్బంగా బైడెన్‌ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. అమెరికా మిత్ర దేశాలైన భారత్‌, జపాన్‌ గురించి బైడెన్‌ తక్కువ చేసి మాట్లాడం సరికాదని రాజకీయ విశ్లేషకులు మండిపడుతున్నారు. అలాగే, ఆయన వ్యాఖ్యలు అమెరికాలో ఉన్న భారతీయులపై ప్రభావం చూపిస్తాయంటున్నారు. 

మరోవైపు.. బైడెన్‌ వ్యాఖ్యలపై వైట్‌ హౌస్‌ వివరణ ఇచ్చింది. ఆయనకు ఆయా దేశాల పట్ల అమితమైన గౌరవం ఉందని పేర్కొంది. ఆయన వ్యాఖ్యలు విశాల దృక్పథంతో చేసినవని చెప్పుకొచ్చింది. బైడెన్‌ ఎంత గౌరవిస్తారో మా మిత్రదేశాలు, భాగస్వాములకు బాగా తెలుసు. ఆయన అమెరికా గురించి మాట్లాడుతూ.. వలసదారులు దేశానికి ఎంత కీలకమో, వారు ఆర్థిక వ్యవస్థను ఎలా బలోపేతం చేస్తారో చెప్పారు. ఈ వ్యాఖ్యలను విస్తృత అర్థంలో తీసుకోవాల్సి ఉంటుంది. జపాన్‌, భారత్‌తో మాకు బలమైన సంబంధాలున్నాయి. మూడేళ్లుగా వాటిని మరింత పటిష్ఠపర్చేందుకు కృషి చేశామని వైట్‌ హౌస్‌ అధికార ప్రతినిధి కరీన్‌ జీన్‌ పియర్‌ వివరించారు.

Advertisement
Advertisement